దారి మూసి తరిమేశాడు..
కరోనా మహమ్మారి కారణంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జోన్ ఉంగ్ తీసుకొచ్చిన ఆంక్షలు.. ఆ దేశంలో పనిచేసిన రష్యా దౌత్యవేత్తలకు తిప్పలు తెచ్చిపెట్టాయి. స్వదేశానికి వెళ్లేందుకు రాకపోకలు లేకపోవడంతో వారంతా రైల్ ట్రాలీని తోసుకుంటూ సరిహద్దు దాటాల్సి వచ్చింది. దారులన్నీ మూసేసిన కిమ్.. మీ చావు మీరు చావండి అన్న చందగా రష్యా అధికారులపట్ల వ్యవహరించడం వివాదాస్పదమైంది. కరోనా వ్యాప్తి భయాలతో కిమ్.. కొరియా సరిహద్దులను మూసేయడం, చాలా మంది విదేశీయులు ఉత్తరకొరియాలోనే ఉండిపోవాల్సి రావడం తెలిసిందే. ఇప్పుడు వారిని వెళ్లిపోవచ్చని ఆదేశించిన కిమ్.. అందుకు తగిన ఏర్పాట్లను మాత్రం చేయలేదు. దీంతో..

32 గంటల కఠిన ప్రయాణం
కిమ్ వెళ్లగొట్టిన తర్వాత రష్యా దౌత్య అధికారులు ఏకంగా 32 గంటలపాటు కఠిన ప్రయాణం చేయాల్సి వచ్చింది. తొలుత రెండు గంటలు బస్సు ప్రయాణం చేసి ప్యోంగ్యాంగ్ నుంచి ఉత్తరకొరియా – రష్యా సరిహద్దు సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 30 గంటలపాటు రైల్ ట్రాలీని తోసుకుంటూ సరిహద్దు దాటి స్వదేశానికి చేరుకున్నారు.

కిమ్ కఠినాత్ముడు.. పిల్లల్ని చూడలేదు..
దౌత్యవేత్తలు తమ పిల్లలను ట్రాలీలో కూర్చోబెట్టి, ముందుభాగంలో తమ లగేజీ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పై తోసుకుంటూ వస్తున్న ఫొటోలు, వీడియోలను విదేశాంగశాఖ పోస్ట్ చేసింది. సదరు వీడియోలు వైరల్ గా మారాయి. కిమ్ కఠినాత్ముడని, పిల్లల్ని కూడా దయచూడలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా భూభాగంలో అడుగుపెట్టిన తర్వాత విదేశాంగ శాఖ సిబ్బంది వారిని కలుసుకుని బస్సులో వ్లాదివోస్టక్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విమానంలో మాస్కో చేరుకున్నట్లు రష్యా వెల్లడించింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలక సూచిక అని పరిశీలకులు అంటున్నారు.