శ్రీలంక అందాల పోటీల్లో సంచలనం
ప్రపంచ వ్యాప్తంగా జరిగే అందాల పోటీల్లో వివాదాలకూ ఏమాత్రం కొదవలేదు. విజేతలుగా ఎంపికైన వారిపై రన్నరప్‌లుగా నిలిచిన వారు అక్కసు వెళ్లగక్కడంతో పాటు ఇతరత్రా వివాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ శ్రీలంకలో తాజాగా జరిగిన అందాల పోటీల్లో ఓ కొత్త వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా ఆ పోటీల్లో విజేతగా నిలిచిన అందాల భామ పరువు గంగపాలు చేసింది. దీంతో ఇప్పుడు అంతర్జాతీయింగా కూడా ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విజేత తలపై కిరీటం లాక్కొన్న మాజీ సుందరి
శ్రీలంలలో ఆదివారం నిర్వహించిన మిసెస్ వరల్డ్ శ్రీలంక పోటీల్లో పుష్పిక డిసిల్వా విజేతగా నిలిచింది. పోటీల్లో అందాల ఆరబోతతో పాటు వివిధ విభాగాల్లో రాణించిన ఆమెకు మిసెస్ వరల్డ్ శ్రీలంక కిరీటం దక్కింది. దీంతో ఆమె అంతర్జాతీయ స్ధాయిలో జరిగే మిసెస్ వరల్డ్ పోటీలకు శ్రీలంక తరఫున ఎంపికైనట్లయింది. విజేతగా నిలిచిన పుష్పిక డిసిల్వాకు మాజీ మిసెస్ వరల్జ్ 2019 కరోలైన్ జూరీ కిరీటం తొడిగింది. ఆ తర్వాత వేదిక దిగి వెళ్లిపోయింది. కానీ నిమిషాల వ్యవధిలోనే వేదికపైకి వచ్చి పుష్పిక డిసిల్వాకు తొడిగిన కిరీటం లాక్కొంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

రన్నరప్‌కు కిరీటం తొడిగిన మాజీ సుందరి
బహుమతుల ప్రధానం పూర్తయ్యాక వేదిక దిగి వెళ్లిపోయిన మాజీ మిసెస్ వరల్డ్ కరోలైన్ జూరీ ఆ తర్వాత పిలవకుండానే వేదికపైకి రావడమే కాకుండా విజేత పుష్పిక డిసిల్వా తలపై నుంచి కిరీటం లాక్కోవడం అక్కడున్న వారిని నిశ్చేష్టుల్ని చేసింది. అదే సమయంలో లాక్కొన్న కిరీటాన్ని అక్కడే ఉన్న ఫస్ట్ రన్నరప్‌కు తొడిగేసింది. దీంతో ఆమె కూడా అవాక్కయింది. ఇందంతా చూస్తున్న వారికి ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
విడాకుల వివాదమే అసలు కారణం
మిసెస్ వరల్డ్ శ్రీలంక అందాల పోటీలో విజేతగా నిలిచిన పుష్పిక డిసిల్వా నుంచి కిరీటం లాక్కొని ఫస్ట్ రన్నరప్‌కు తొడిగిన మాజీ మిసెస్ వరల్డ్ కరోలైన్ జూరీ .. ఆ తర్వాత తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చింది. పుష్పిక డిసిల్వా విడాకులు తీసుకుందని చివరి నిమిషంలో తెలియడంతో తాను ఆమె నుంచి కిరీటం లాక్కొని ఫస్ట్ రన్నరప్‌కు తొడిగినట్లు కరోలైన్ తెలిపింది. కానీ కరోలైన్ చర్యతో అవమానం ఫీలయిన పుష్పిక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఫేస్బుక్లో స్పందించిన పుష్పిక.. కరోలైన్ చెప్తున్నట్లు తాను విడాకులు తీసుకోలేదని, ఆమె అబద్ధాలు చెప్తోందని ఆరోపించింది. ఈ వివాదంపై మిసెస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు.