వైట్ హ్యాట్ జూనియర్..
దేశంలోని పిల్లలకు కోడింగ్ ను విద్యార్థి దశ నుంచే నేర్పించే ఉద్ధేశ్యంతో వైట్ హ్యాట్ జూనియర్ స్టార్టప్ ఏర్పాటైంది. ప్రస్తుతం నడుస్తున్న టెక్ యుగం కారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పిన్న వయస్సులోనే కోడింగ్ లో శిక్షణ ఇప్పించేందుకు ఇది మంచి ఆన్ లైన్ వేదికగా మారింది. ఆ తర్వాత ఈ కంపెనీని దేశీయ దిగ్గజ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ కొనుగోలు చేసింది.

బైజూస్ నిర్ణయం..
కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలు మళ్లీ పాఠశాలలకు వెల్లటంతో బైజూస్ అమ్మకాలు భారీగా క్షీణించాయి. ఈ క్రమంలో కంపెనీ నష్టాలు సైతం పెరిగాయి. దీంతో కంపెనీ ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు కంపెనీ మరో అడుగు ముందుకు వేసి తాను కొనుగోలు చేసిన వైట్ హ్యాట్ జూనియర్ కంపెనీని మూసివేసే ఆలోచనలో ఉందని సమాచారం. మార్చి 2023 నాటికి లాభదాయకతను చేరుకోవాలనే లక్ష్యంతో ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీ ఈ చర్య తీసుకుంటోందని తెలుస్తోంది.

2020లో కొనుగోలు..
WhiteHat Jr పిల్లలకు ప్రోగ్రామింగ్, సంగీతం, గణితాన్ని బోధించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ కంపెనీని 300 మిలియన్ డాలర్ల విలువతో బైజూస్ సంస్థ 2020లో కొనుగోలు చేసింది. తాజా ఆర్థిక ఫలితాల ప్రకారం బైజూస్ నష్టాల్లో అతిపెద్ద భాగం వైట్ హ్యాట్ వల్లనేనని వెల్లడైంది. కంపెనీ పనితీరు సరిగా లేదని గతంలో ఒక ఇంటర్వ్యూలో BYJU సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్ కూడా కామెంట్ చేశారు. బైజూస్ కొనుగోలు చేసిన ఆకాష్ కోసం IPOని ప్రారంభించాలని యోచిస్తున్న నేపథ్యంలో ఈ వార్త వెలువడింది.