వేరియబుల్ పే అంటే..
ఐటీ పరిశ్రమలో కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాన్ని రెండు భాగాలుగా చెల్లిస్తుంటాయి. ఒకటి నెలవారీ చెల్లించే ఫిక్స్‌డ్ వేతనం కాగా.. మరొకటి త్రైమాసికానికి ఒకసారి కంపెనీ పనితీరు ఆధారంగా చెల్లించేది. దీనినే వేరియబుల్ పే అని పిలుస్తారు. ఇది ఒక్కో కంపెనీలో ఒక్కోలాగా ఉంటుంది. అయితే కంపెనీ పనితీరును బట్టి ఏ క్యాటగిరీలోని ఉద్యోగులకు దీనిని ఎంతమేర చెల్లించాలనే నిర్ణయాన్ని కంపెనీలు ప్రతి త్రైమాసికంలోనూ ప్రకటిస్తుంటాయి. టెక్కీలు సైతం వీటికోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాయి.

వేరియబుల్ వేతనం..
విప్రోలో డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వేరియబుల్ పే ఫిబ్రవరి నెల జీతంతో విడుదల చేయాలని టెక్ దిగ్గజం నిర్ణయించిందని సమాచారం. దేశీయ ఐటి మేజర్ 2022-23 డిసెంబర్ ముగిసిన త్రైమాసికంలో A నుంచి B3 బ్యాండ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులకు 87 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించనుందని కంపెనీ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈ-మెయిల్ లో వెల్లడించిందని తెలుస్తోంది. ఉద్యోగుల వేరియబుల్ వేతనం కంపెనీ పనితీరుతో పాటు ఉద్యోగులు పని చేస్తున్న వ్యాపార యూనిట్ పనితీరుపై ఆధారపడి ఉంటుందని అందులో తెలిపింది.

కంపెనీ ఆదాయం..
FY2022-23కి సంబంధించి డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 14.3 శాతం పెరిగి రూ.23,229 కోట్లకు చేరినట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో తెలిపింది. IT సేవల నుంచి విప్రో ఆదాయం ఏడాది ప్రాతిపధికన 10.4 శాతం పెరిగింది. ఈ క్రమంలో ఆపరేటింగ్ మార్జిన్ వరుసగా 120 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 16.3 శాతానికి చేరుకుంది.

సీఈవో ఏమన్నారంటే..
క్లయింట్ సంబంధాలు, అధిక విన్ రేట్‌ల ఫలితంగా మార్కెట్ వాటాను పొందడాన్ని కొనసాగిస్తున్నట్లు CEO, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే అన్నారు. మునుపటి త్రైమాసికంలో కంపెనీ A నుంచి B3 బ్యాండ్ ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పేని చెల్లించింది. అయితే విప్రో ప్రత్యర్థులను గమనిస్తే.. TCS డిసెంబర్ త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించనున్నట్లు ప్రకటించింది.