[ad_1]
Women Need More Sleep: ఈ రోజుల్లో అన్ని వయస్సుల వారికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. మంచి నిద్ర శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికీ ఎంతో ముఖ్యం. నిద్రలేమితో బాధపడేవాళ్లలో ఆత్మవిశ్వాసం లోపించడం, డిప్రెషన్, ఆందోళన, కోపం, అతిగా తినడం, గందరగోళం.. వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల హైబీపీ, టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం, మూర్ఛ వంటి తీవ్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి ఎన్ని గంటల నిద్రపోవాలి అనేది వారి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. సగటున ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోవాలి.
CDC నివేదిక ప్రకారం, మధ్యవయసు వారికి అంటే 19-60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు, అంతకంటే పెద్దవారికి 7 గంటల నిద్ర అవసరం. 13-18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. అదేవిధంగా, 6-12 సంవత్సరాల వయస్సు పిల్లలకు 9 నుండి 12 గంటల నిద్ర అవసరం. చిన్న పిల్లలు ఎక్కువ సమయం నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. వారి శరీరం అభివృద్ధి చెందడానికి మంచి నిద్ర తోడ్పడుతుంది.
మనం ఎంతసేపు నిద్రపోవాలో వయస్సు ఆధారంగానే కాకుండా.. మన జెండర్ మీదా ఆధారపడి ఉంటుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని నిపుణులు వెల్లడించారు. స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, పురుషుల కంటే స్త్రీలకు దాదాపు 11 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరం. ఎందుకంటే పురుషుల కంటే స్త్రీల మెదళ్లు ఎక్కువగా పనిచేస్తాయి. వీళ్ల బ్రెయిన్ రీలాక్స్ అవ్వడానికి రాత్రి ఎక్కువ నిద్ర అవసరం.
మహిళల షెడ్యూల్స్ బిజీగా ఉంటాయి..
పురుషుల కంటే మహిళల షెడ్యూల్స్ చాలా బిజీగా ఉంటాయి. వారు త్వరగా మేల్కొంటారు, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారు, ఇంటి పనులను చేస్తారు, కాబట్టి వారికి ఎక్కువ విశ్రాంతి అవసరం అని నిపుణులు చెబుతున్నారు. రోజంతా మల్టీ టాస్కింగ్ వల్ల బ్రెయిన్ అలసిపోతుంది. వారికి మానసిక శక్తి చాలా అవసరం. తగినంత నిద్రలేకపోతే.. శరీరం, మనస్సుపై దుష్ప్రభావాలు పడతాయి.
హార్మోనల్ మార్పులు ఎక్కువగా జరుగుతుంటాయ్..
స్త్రీలలో పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ కారణంగా హార్మోన్లలో మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఇవి పురుషుల కంటే చాలా రెట్లు ఎక్కువ. శారీరక అసౌకర్యం, నొప్పి కారణంగా స్త్రీల మెదడుకు ఎక్కువ నిద్ర కావాలి. అదనంగా, మహిళలు ఆందోళన, నిరాశ వంటి పరిస్థితులకు ఎక్కువగా గురవుతారు.
అధిక బరువు..
పురుషులతో పోలిస్తే.. మహిళలకు బరువు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. . అదే సమయంలో, ఊబకాయం ఉన్న స్త్రీలు నిద్రలేమికి గురవుతారు. నిద్రలేమికి, అధిక బరువుకు సంబంధం ఉంటుంది. అదనంగా, నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ అధికంగా విడుదల అవుతుంది కార్టిసాల్ ఎక్కువగా విడుదల అయితే..ఆకలి అధికమవుతుంది. దీని కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువ.
రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్..
NCBIలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, పురుషుల కంటే స్త్రీలు రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌తో బాధపడుతుంటారు. దీని కారణంగా.. కాళ్లు ఎక్కువగా కదుపుతూ ఉంటారు. ఇది రాత్రి సమయంలో మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యతో బాధపడే మహిళలకు రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టదు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం చేస్తుండాలి. ఇలా చేస్తుండడం వల్ల హ్యాపీగా నిద్ర పోవచ్చు.
- నిద్రకు ముందు కాఫీ, టీలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల నిద్రభంగం కలగొచ్చు.
- నిద్రపోయే ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి.
- కొంతమంది నిద్రపట్టడం లేదని ఆల్కహాల్ తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల అన్ని మరిచిపోయి నిద్రపోవచ్చని భావిస్తారు. కానీ, ఇలా చేయడం వల్ల సమస్య ఎక్కువ అవుతుందని తగ్గదు.
- నిద్రపోయే ముందు ముఖ్యంగా త్వరగా జీర్ణం కానీ ఆహార పదార్థాలను తీసుకోకూడదు. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి. జీర్ణ సమస్యలు వస్తే రాత్రి మేల్కోవాల్సి వస్తుంది.
- నిద్రపోయే ముందు ఫోన్లు వాడొద్దు. ఫోన్ నుంచి వచ్చే బ్లూ రేస్ మీ నిద్ర క్వాలిటీని దెబ్బతీస్తాయి.
- పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవద్దు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link