రెండు భాగాలుగా మొత్తం రుణం:
దేశంలో వైద్య రంగం అభివృద్ధి కోసం రూ.500 మిలియన్ డాలర్ల చొప్పున రెండు రుణాలు విషయమై.. ప్రపంచ బ్యాంకు, ఇండియా సంతకం చేశాయి. అక్టోబర్ 2021లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు వరల్డ్ బ్యాంకు తెలిపింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ రాష్ట్రాలకు ప్రత్యేకం:
ఈ రెండు రుణాల్లో ఒకదాని ద్వారా యావత్ దేశంతో పాటు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, కేరళ, ఒరిస్సా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లకు ప్రత్యేక సాయం అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో వైద్య సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు చెప్పింది. భారత ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ అడిషనల్ సెక్రటరీ రజిత్ కుమార్, వరల్డ్ బ్యాంక్ తరఫున అగస్టే టానో కౌమే సంతకాలు చేశారు.

భవిష్యత్ సన్నద్ధతకు:
కరోనా సంక్షోభం అనంతరం వైద్య సదుపాయాల అవసరం గురించి ప్రపంచ దేశాల్లో తీవ్రంగా చర్చ మొదలైనట్లు కౌమే తెలిపారు. ఈ తరహా మహమ్మారులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ప్రతి దేశమూ ఆలోచిస్తున్నాయి. అందుకే భవిష్యత్తులో రానున్న వైద్య సంక్షోభాలకు వ్యతిరేకంగా, సమర్థవంతంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు సంతకాలు జరిగిన రెండు ప్రాజెక్టులూ భారత్ సన్నద్ధత కోసం ఉద్దేశించినవేనని స్పష్టం చేశారు.

భారీగా పెరిగిన ఆయుర్ధాయం:
భారత ప్రభుత్వానికి ఇస్తున్న ఈ నిధుల ద్వారా ఆయా రాష్ట్రాలు తమ వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచుకోగలవని విశ్వసిస్తున్నట్లు వరల్డ్ బ్యాంకు ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో ఇండియా అంచలంచెలుగా వృద్ది సాధిస్తున్నట్లు గుర్తించామన్నారు. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 1990లో 58 ఏళ్లుగా ఉన్న దేశ ప్రజల ఆయుర్దాయం, 2020 నాటికి 69.8 కి పెరిగినట్లు వెల్లడించారు. దేశ సగటు ఆదాయ స్థాయి కంటే ఇది ఎక్కువగా ఉండటం గమనార్హం.