లోటస్ పాండ్ నివాసంలో అభిమానులకు అభివాదం..
ఈ పరిణామాల మధ్య వైఎస్ షర్మిలా.. కొద్దిసేపటి కిందటే హైదరాబాద్కు చేరుకున్నారు. బెంగళూరు నివాసం నుంచి బయలుదేరిన ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో లోటస్పాండ్ నివాసానికి వచ్చారు. అప్పటికే అక్కడ వందల సంఖ్యలో గుమికూడిన అభిమానులకు అభివాదం చేశారు. లోటస్: పాండ్ భవనం మీది నుంచి అభిమానులు, పార్టీ సానుభూతిపరులను పలకరించారు. అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు.

అందరినీ సంప్రదిస్తున్నా..
ప్రస్తుతం తాను అందరినీ సంప్రదిస్తున్నానని, త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తానని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు లక్షలాది మంది తెలంగాణలో ఉన్నారనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ పెట్టబోతోన్నానంటూ వస్తోన్న వార్తలపై ఇప్పటికప్పుడు ఎలాంటి ప్రకటన చేయలేనని అన్నారు. తాను నిర్వహించబోయే వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన స్పందనను తనను ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తోందని అన్నారు.

రాజన్న రాజ్యం..
తెలంగాణలో రాజన్నరాజ్యం లేదని షర్మిలా వ్యాఖ్యానించారు. అది తీసుకురావలనేదే తన లక్ష్యమని చెప్పారు. దాన్ని తీసుకుని వస్తామని అన్నారు. రాజన్న రాజ్యం కావాలని, రావాలనే డిమాండ్ కొంతకాలంగా తెలంగాణలో వినిపిస్తోందని షర్మిలా తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్ధం చేసుకోవడానికే తాను ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలవారీగా పార్టీ అభిమానులు, సానుభూతిపరులను కలుస్తానని అన్నారు. వైఎస్సార్ లేని లోటు తెలంగాణలో కనిపిస్తోందంటూ పలువురు సానుభూతిపరులు చెబుతున్నారని అన్నారు. తెలంగాణలో రాజన్నరాజ్యం తీసుకొస్తామని చెప్పారు.

వైఎస్సార్ టీపీగా నామకరణం..?
కాగా- వైఎస్ షర్మిలా పెట్టబోయే రాజకీయ పార్టీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ పేరు చక్కర్లు కొడుతోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేసినట్లు చెబుతున్నారు. వైఎస్సార్టీపీగా పేరు పెట్టినట్లు లీకులు వెలువడుతున్నాయి. వైఎస్ఆర్టీపీలో- టీ అనేది తెలంగాణ లేదా.. తెలుగుగా పేర్కొంటారా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. దీనితో వైఎస్ షర్మిలా ఇక పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించబోతోండటం దాదాపుగా ఖాయమైనట్టేనని అంటున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకుని రావడమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్లే వైఎస్సార్ పేరును ప్రతిబింబించేలా పార్టీ పేరు ఉండబోతోందని తెలుస్తోంది.