ఈట్‌ నౌ-పే లేటర్‌, EMI ఆఫర్‌లో మామిడిపండ్లు

[ad_1]

Mangoes on EMI: పండ్లలో రారాజు మామిడి. తలుచుకుంటే నోట్లో నీళ్లూరతాయి. వేసవిలో మాత్రమే దొరికే మామిడి పండ్లను తినకపోతే, ఆ ఏడాది వృథా అయినట్లే. అయితే… దేశంలో ద్రవ్యోల్బణం దెబ్బకు అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాల ధరలతో పాటు మామిడి పండ్ల రేట్లు కూడా మండిపోతున్నాయి. 

రుచిలోనే కాదు ధరలోనూ మేటి హాపస్ రకం మామిడి పండ్లు
మామిడి పండ్లలో… దేవ్‌గఢ్ & రత్నగిరి నుంచి వచ్చే అల్ఫాన్సో (Alphonso) లేదా హాపస్ (Hapus) రకం మామిడి పండ్లు అద్భుతమైన రుచితో ఉంటాయి, జనం నుంచి వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. తింటే గారెలు తినాలి అని మనం అనుకున్నట్లుగానే, తింటే హాపస్‌ తినాలి అని మహారాష్ట్రీయులు భావిస్తారు. ప్రస్తుతం, రిటైల్ మార్కెట్‌లో డజను హాపస్ రకం పండ్లు రూ. 800 నుంచి రూ. 1300 వరకు రేటు పలుకుతున్నాయి. దీంతో.. రుచితో నోట్లో నీరూరించే మామిడి, కొనే సమయంలో కళ్లలో నీరూరిస్తోంది. 

మామిడి పండ్ల మీద EMI ఆఫర్‌
ఎక్కువ రేటు పెట్టి కొనలేక కస్టమర్లు తగ్గుతుండడంతో, మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఒక మామిడి పండ్ల వ్యాపారి విచిత్రమైన ప్లాన్‌ వేశాడు. సెల్‌ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల లాంటి వస్తువులను నెల వాయిదాల పద్ధతిలో (EMI) అమ్మగాలేనిది, తన మామిడి పండ్లకు EMI ఆఫర్‌ మీద ఎందుకు అమ్మకూడదు అని అనుకున్నాడు. తన ఆలోచనను ఆలోచనను ఆచరణలో పెట్టాడు. మామిడి పండ్ల మీద EMI ఆఫర్‌ ప్రకటించాడు. గురుకృప ట్రేడర్స్ అండ్‌ ఫ్రూట్‌ ప్రొడక్ట్స్‌ ఓనర్‌ గౌరవ్ సనస్‌ది (Gaurav Sanas) ఈ ఐడియా. గత 12 ఏళ్ల నుంచి అతను మామిడి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు.

వెరైటీ ఐడియా దెబ్బకు వార్తల్లో వ్యక్తిగా మారాడు గౌరవ్‌ సనస్. దేశం మొత్తంలో EMIపై మామిడి పండ్లను విక్రయిస్తున్న మొట్టమొదటి, ఏకైక స్టాల్‌ తనదేనని గొప్పగా చెప్పుకుంటున్నాడు కూడా.

“సీజన్ ప్రారంభంలో ధరలు ఎప్పుడూ చాలా ఎక్కువగా ఉంటాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఇతర ఉపకరణాలు EMI మీద కొనుగోలు చేస్తున్నప్పుడు మామిడిపండ్లను కూడా అలా ఎందుకు కొనుగోలు చేయకూడదు? EMI మీద దొరికితే అందరూ మామిడి పండ్లను కొనుగోలు చేయగలరు” –  గౌరవ్‌ సనస్‌

గౌరవ్‌ సనస్‌ ఔట్‌లెట్‌లో EMI మీద పండ్లను కొనుగోలు చేసే విధానం మొబైల్ ఫోన్‌ను వాయిదా చెల్లింపుల పద్ధతిలో కొనుగోలు చేయడం లాగానే ఉంటుంది. EMI ఆఫర్‌ మీద మామిడి పండ్లు కావాలనుకున్న కస్టమర్ తన క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించాలి. చెల్లించాల్సిన మొత్తాన్ని 3, 6. లేదా 12 నెలల EMIలుగా మార్చుకోవచ్చు. అయితే, కనీసం రూ. 5,000 తగ్గకుండా పండ్లు కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. 

ఇప్పటి వరకు నలుగురు వినియోగదారులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని సనస్ చెబుతున్నాడు. 

ఈ వార్త చదువుతుంటే, “బయ్‌ నౌ – పే లేటర్‌” లాగా, “ఈట్‌ నౌ – పే లేటర్‌” అని అనిపిస్తోంది కదూ. బతకాలంటే ఇలాంటి ఐడియాలు బుర్రలోకి రావల్సిందే బాస్‌.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *