ఒక్కో సెకను రూ.3 లక్షలు, వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లో ప్రకటనల ఖర్చు ఇది

[ad_1]

Cricket World Cup: ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ICC క్రికెట్ ప్రపంచ కప్ ఈ రోజు (అక్టోబర్ 5, 2023‌) నుంచి ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీకి మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగుతుంది. 2019 వరల్డ్‌ కప్‌ విజేత ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య తొలి పోరుతో 2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు స్టార్టయ్యాయి.

క్రికెట్ ప్రపంచ కప్ (Cricket World Cup 2023) పోటీలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో కోట్లాది మంది చూస్తారు. ఈ నేపథ్యంలో, కేవలం క్రికెటర్లు, వీక్షకులే కాక.. బడా కార్పొరేట్లకు కూడా ఈ మెగా ఈవెంట్ ఒక వేదిక అవుతుంది. కోట్లాది మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తాయి.

కార్పొరేట్‌ కంపెనీల మధ్య పోటీ
అక్టోబర్ 5 నుంచి ప్రారంభమమైన ఈ ఈవెంట్, నవంబర్ 19 వరకు కొనసాగుతుంది. దాదాపు ఒకటిన్నర నెలల వ్యవధిలో మొత్తం వీక్షకుల సంఖ్య (ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసే వాళ్లతో కలిపి) వందల కోట్లకు చేరుతుంది. ఈసారి ప్రపంచ కప్‌నకు ఇండియా ఆతిథ్యం ఇస్తోంది కాబట్టి, ప్రేక్షకుల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. జనాభా పరంగా ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్లలో భారతదేశం ఒకటి. ఈ పరిస్థితిలో, కోట్లాది మంది ప్రజలతో కూడిన అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి అనేక గ్లోబల్ కంపెనీలకు క్రికెట్ ప్రపంచ కప్ గొప్ప మార్గం అవుతుంది.

ఒక్కో సెకను రూ.3 లక్షల ఖర్చు
బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం… గత ప్రపంచకప్‌తో (2019) పోలిస్తే ఈసారి ప్రపంచకప్‌లో ప్రకటనల రేటు చాలా భారీగా పెరిగింది. ఇప్పుడు, క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు 10 సెకన్ల స్లాట్ కోసం కంపెనీలు 30 లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అంటే ప్రతి సెకను ప్రకటన ఖరీదు దాదాపు 3 లక్షల రూపాయలు. గత ప్రపంచకప్ కంటే ఇది 40 శాతం ఎక్కువ.

బ్లూమ్‌బెర్గ్‌ లెక్కల ప్రకారం, మొత్తం మెగా ఈవెంట్ సమయంలో, అన్ని బ్రాండ్స్‌ కలిపి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ ప్రకటనల కోసం 240 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నాయి. దీనిని మన రూపాయల్లోకి మారిస్తే దాదాపు 2,000 కోట్ల రూపాయలు అవుతుంది. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆట కావడమే దీనికి పెద్ద కారణం. అందుకే, ఖర్చు విషయంలో కార్పొరేట్‌ కంపెనీలు వెనుకాడడం లేదు. 

జెఫరీస్ చెబుతున్న ప్రకారం, ప్రతి సంవత్సరం కంపెనీలు ప్రకటనలు & స్పాన్సర్‌షిప్ మొదలైనవాటి కోసం క్రికెట్‌ మీద 1.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నాయి. ఇది, భారతదేశంలోని మొత్తం క్రీడా వ్యయంలో 85 శాతానికి సమానం.

ఖర్చు చేస్తున్న పెద్ద బ్రాండ్లు
ప్రపంచ కప్ క్రికెట్‌ సందర్భంగా ప్రకటనల కోసం ఖర్చు చేసే గ్లోబల్ బ్రాండ్స్‌లో… కూల్‌డ్రింక్‌ కంపెనీ కోకా కోలా (Coca Cola), ఆల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్‌ పే (Google Pay), యూనిలీవర్‌ Plcకి చెందిన భారతీయ యూనిట్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (Hindustan Unilever Ltd – HUL), సౌదీ అరేబీయాకు చెందిన ఆయిల్‌ గ్రూప్‌ ఆరామ్‌కో ‍‌(Saudi Aramco), దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ (Emirates), కార్ల కంపెనీ నిస్సాన్ మోటార్ (Nissan Motor) వంటి పెద్ద పేర్లు ఉన్నాయి.

మరో ఆసక్తికర కథనం: కుంభస్థలం కొట్టిన కుక్‌, రెండు రోజుల్లో రూ.345 కోట్ల సంపాదన

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *