ద్రవ్యోల్బణం దెబ్బకు పొదుపులన్నీ మటాష్‌, 30 ఏళ్ల కనిష్టానికి సేవింగ్స్‌

[ad_1]

India inflation: పెరిగిన పెట్టుబడి వ్యయాల బారి నుంచి లాభాలను కాపాడుకోవడానికి అన్ని రకాల కంపెనీలు ఉత్పత్తుల రేట్లు పెంచాయి. దీంతో, దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది, ఆ బాడుదును సామాన్య ప్రజలు భరిస్తున్నారు. ముఖ్యంగా, పేద & దిగువ మధ్య తరగతి ఆదాయ ప్రజలు నిత్యం ధరల వేధింపులకు గురవుతున్నారు. గృహ పొదుపులు ‍‌(Household savings) మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. దేశంలో వినియోగం కూడా విపరీతంగా తగ్గింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పాలసీ రేటు పెంచుతూనే ఉన్నా ద్రవ్యోల్బణం దిగి రావడం లేదు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తారస్థాయిలో ఉంది. ధరాఘాతాన్ని భరించలేక, దేశ ప్రజలు ఖర్చుల విషయంలో స్వీయ నియంత్రణలు విధించుకుంటున్నారు. ఆచితూచి ఖర్చు పెట్టినా, మిగిలిన డబ్బులు పొదుపులకు సరిపోవడం లేదు. దీంతో, ఇటీవలి త్రైమాసికాల్లో సేవింగ్స్‌లో తిరోగమనం కనిపిస్తోంది. 

వినియోగంలో నియంత్రణ, పడిపోయిన గృహ పొదుపులు.. భారతదేశంలో “K” ఆకారపు ఆర్థిక పునరుద్ధరణకు ‍‌(economic recovery) నిదర్శనం. అంటే, ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాలు పుంజుకుంటుంటే, మరికొన్ని రంగాలు పడిపోతున్నాయని అర్ధం.

భారతదేశంలో వినియోగదారుల ధరల సూచీ (CPI) ద్రవ్యోల్బణం 2023 జనవరిలో 6.5 శాతానికి చేరుకుంది. 2022 డిసెంబర్‌లో 5.72 శాతంగా, నవంబర్‌లో 5.88 శాతం నుంచి పెరిగింది. అంతేకాదు, ద్రవ్యోల్బణం H1FY23లో సగటున 7.2 శాతంగా ఉంది. గత రెండేళ్లలో ఏడాదికి సగటున 5.8 శాతంగా ఉంది.

ఇండియా రేటింగ్స్ తాజా రిపోర్ట్‌ ప్రకారం.. K ఆకారపు పునరుద్ధరణ కారణంగా భారతదేశంలో పారిశ్రామిక వృద్ధి నీరసపడుతుందని అంచనా. దీనివల్ల వినియోగ డిమాండ్‌ పెరగదు, పరిశ్రమల్లో జీతాలు పెరగవు. ముఖ్యంగా, ఆదాయ పిరమిడ్‌లో సగ భాగంగా ఉన్న అట్టడుగు వర్గాల జనాభాపై తీవ్ర ప్రభావం పడుతుంది.

గృహ పొదుపు పతనం
వస్తువులు, సేవల కోసం, ముఖ్యంగా టెలికాం, వాహనాలు, ఇంధనం, FMCG వంటి ముఖ్యమైన వాటి కోసం ప్రజలు చేస్తున్న ఖర్చులు ఇటీవలి త్రైమాసికాల్లో పెరిగాయి. గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ మొత్తాన్ని జేబుల్లోంచి బయటకు తీయాల్సి వస్తోంది. జేబుల్లోని నోట్లన్నీ ఖర్చయి, చిల్లర మాత్రమే మిగులుతోంది. దీనివల్ల పొదుపు చేయడానికి జనం దగ్గర డబ్బులు ఉండడం లేదు. ఫలితంగా, దేశవ్యాప్త పొదుపులు పడిపోయాయి.

సామాన్య ప్రజల పొదుపులు మూడు దశాబ్దాల కనిష్టానికి చేరినట్లు మోతీలాల్‌ ఓస్వాస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా వేసింది.

“హౌస్‌హోల్డ్‌ నికర ఆర్థిక పొదుపులు FY22లో GDPలో 7.3 శాతంగా, కొవిడ్‌ కాలంలోని FY21లో 12.0%గా ఉన్నాయి. H1FY23లో మాత్రం 4.0 శాతానికి, మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయిందని మా లెక్కలు సూచిస్తున్నాయి. ”అని తన నివేదికలో మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. ఆర్థిక పొదుపులు దెబ్బ తిన్నప్పటికీ.. బంగారం, స్థిరాస్తుల వంటి వాటికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది.

వినియోగంలో మందగమనం
భారతదేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ‍‌(Q3FY23) మరింత మోడువారింది. Q2FY23లో 6.3 శాతం నుంచి Q3FY23లో 4.4 శాతానికి తగ్గింది. RBI వరుస వడ్డీ రేట్ల పెంపుదల కారణంగా డిమాండ్ & ఉత్పాదక రంగంలో బలహీనత కొనసాగింది.

FY23 మొదటి 9 నెలల్లో గ్రామీణ వ్యయం 5.3 శాతం పెరిగింది, అయితే ఈ పెరుగుదల చాలా నెమ్మదిగా ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషించింది. “మొత్తంగా చూస్తే, వినియోగదారుల డిమాండ్ దక్షిణ దిశగా (కిందకు) ప్రయాణాన్ని ప్రారంభించింది. 3QFY23లో గ్రామీణ & పట్టణ వినియోగం రెండూ మూడు త్రైమాసికాల కనిష్టానికి చేరాయి” అని పేర్కొంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *