బ్రేక్‌-ఈవెన్‌ స్థితికి చేరుకున్న బుల్లి పిట్ట, పెరిగిన కంపెనీ ఆదాయం

[ad_1]

Elon Musk -Twitter: సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను కొని నానా తిప్పలు పడుతున్న ఎలాన్‌ మస్క్‌, ఎట్టకేలకు ఆ నష్టాల నుంచి బయటపడే దారిలో ఉన్నారు. 

సోషల్ మీడియా సంస్థ “దాదాపు బ్రేకింగ్ ఈవెన్” స్థాయిలో ఉందని అని, ప్రకటనదార్లు (advertisers) చాలా మంది తిరిగి వచ్చారని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Twitter Inc CEO Elon Musk) చెప్పారు. ఒక వ్యాపారంలో ప్రారంభ నష్టాలు తగ్గి, లాభనష్టాలు లేని స్థితికి చేరడాన్ని బ్రేక్‌-ఈవెన్‌గా పిలుస్తారు. బ్రేక్‌-ఈవెన్‌ స్థితిని కూడా దాటితే, లాభాలు రావడం ప్రారంభం అవుతుంది.

బీబీసీకి ఎలాన్‌ మస్క్‌ ఇంటర్వ్యూ 
BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ ముఖాముఖిని ట్విట్టర్ స్పేసెస్‌లో (Twitter Spaces) ప్రత్యక్ష ప్రసారం చేయగా, 30 లక్షలకు పైగా వీక్షకులు చూశారు.

గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొన్నారు. అప్పటి నుంచి ట్విట్టర్ ప్రకటనల ఆదాయం భారీగా తగ్గింది. ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలతో పాటు, కంపెనీ ఖర్చులను తగ్గించడానికి వేలాది మంది ఉద్యోగులను ఎలాన్‌ మస్క్‌ ఉన్నఫళంగా ఇళ్లకు పంపేశారు.

కాలానుగుణంగా ప్రకటనల వ్యయం తగ్గిందని, “రాజకీయ” కారణాలు కూడా దీనికి తోడడయ్యాయని మస్క్ చెప్పారు. ఇప్పుడు, ప్రకటనదార్లలో చాలా మంది తిరిగి వచ్చారని బీబీసీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అప్పుడు 7,000 – ఇప్పుడు 1,500 
ట్విటర్‌లో ఇప్పుడు దాదాపు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారన్న మస్క్‌, తాను కొనుగోలు చేయడానికి ముందు దాదాపు 7,000 మంది ఉన్నారని చెప్పారు. ఆ నంబర్‌తో పోలిస్తే ఇప్పటి నంబర్‌ చాలా తగ్గిందని వెల్లడించారు.

ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఆ సంస్థ స్థిరత్వంపై ఆందోళనలు విస్తృతంగా వ్యాప్తి చెందాయి. ట్విట్టర్‌ సేవల్లో అంతరాయాలను పరిష్కరించే చాలా మంది ఇంజినీర్లు కూడా ఆందోళన వ్యక్తం చేసినవాళ్లలో ఉన్నారు. అయితే.. మస్క్‌ ఈ విమర్శలను అస్సలు పట్టించుకోలేదు, యథాప్రకారం తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ట్విట్టర్‌ కొనుగోలు తర్వాత వచ్చిన పని ఒత్తిడి కారణంగా తాను నిద్రకు కూడా దూరమయ్యానని గతంలో ఒకసారి ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. మొత్తానికి.. సీఈవో మస్క్‌, కంపెనీ ఉద్యోగుల కృషి ఫలితంగా బ్రేక్‌-ఈవెన్‌ స్థాయికి ట్విట్టర్‌ చేరుకుంది.

ఎక్స్‌ యాప్‌లో ట్విట్టర్‌ విలీనం
ఇటీవలే, ఒక కోర్టు కేసు విచారణ సందర్భంగా, ట్విటర్‌ అనే స్వతంత్ర కంపెనీ మనుగడలో లేదని ఆ సంస్థ వెల్లడించి ఆశ్చర్యపరిచింది. ఎక్స్‌ అనే యాప్‌లో ట్విటర్‌ను కలిపేసినట్లు న్యాయస్థానానికి తెలిపింది. దీనిని ధృవీకరిస్తూ..  ‘X’ అక్షరాన్ని మస్క్‌ మంగళవారం (11 ఏప్రిల్‌ 2023) నాడు ట్వీట్‌ చేశారు. ఎక్స్‌ అనేది ఒక సూపర్‌ యాప్‌. ట్విటర్‌ను ఎక్స్‌ యాప్‌లో విలీనం చేయడం ద్వారా.. మెసేజింగ్‌, కాలింగ్‌, పేమెంట్స్‌ వంటి పనులన్నీ ఒకే యాప్‌ ద్వారా చేపట్టేలా చూడాలన్నది ఎలాన్‌ మస్క్‌ లక్ష్యం. ప్రస్తుతం, చైనాకు చెందిన ‘వీచాట్‌’ ఇదే తరహా సేవలను అందిస్తోంది. ఎక్స్‌ యాప్‌ను తన దీర్ఘకాల వ్యాపార ప్రణాళికగా మస్క్‌ అభివర్ణించారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *