17 ఏళ్లుగా ఓటు లేదు. 17 ఏళ్లుగా గొంతు లేదు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన ఓటు హక్కును కాకినాడ రూరల్ మండలంలోని ఆరు గ్రామ పంచాయతీల వేలాది మంది ప్రజలు దాదాపు రెండు దశాబ్దాలుగా వినియోగించుకోలేకపోతున్నారు. “ఓటు హక్కు లేనివాడు చచ్చినవాడితో సమానం” అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకీ దుస్థితి?
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపేందుకు సుమారు 17 ఏళ్ల క్రితం ప్రభుత్వం గవర్నర్ ద్వారా విలీన ప్రక్రియ ప్రారంభించింది. కొందరు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఈ గ్రామాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. కోర్టుల్లో ప్రజలకు న్యాయం జరిగేలా చూడాల్సిన ప్రభుత్వం, ఏళ్లు గడుస్తున్నా తేల్చకుండా నాన్చుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇందులో ఏ పార్టీ ప్రభుత్వానికీ మినహాయింపు లేదని వారు అంటున్నారు. వాకలపూడి, తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వలసపాకల గ్రామాల ప్రజలు నిరసనల్లో పాల్గొంటున్నారు.
ప్రజాప్రతినిధులు లేరు, ప్రశ్నించేవారు లేరు
ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రజల గొంతు వినిపించే వేదికే లేకుండా పోయిందని, అధికారులు ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ లెక్కలు, నిధుల వినియోగంపై ప్రశ్నించడానికి కూడా ప్రజలు భయపడే పరిస్థితి ఉందని, భారీ అవినీతి, ప్రభుత్వ స్థలాలూ , లేఔట్ లలో ఉమ్మడి స్థలాల ఆక్రమణలపై ఆరోపణలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఈ ప్రాంతానికి సంభంధం లేని, ఎటువంటి పక్షపాతం లేని ఉన్నతాధికారులతో స్వతంత్ర విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తాగునీరూ లేదు, డ్రైనేజీ లేదు: నీళ్లలో బతుకులు
కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా కనీసం మంచినీటి సౌకర్యం లేదు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం కురిస్తే వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్ల చుట్టూ నెలల తరబడి నిలిచిన నీరు కుళ్లి దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు, పాములు, విషకీటకాల మధ్య ప్రాణభయంతో, అనారోగ్యాలతో ప్రజలు జీవిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని స్వచ్ఛంద సంస్థలు, కొందరు కార్యకర్తలు ఆహారం, సహాయం అందిస్తూ చేస్తున్నారు; వారి సేవలతోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు కాపాడుకుంటున్నారు.
ధర్నా: “విలీనమో, ఎన్నికలో తేల్చండి”
గతంలో అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు. ఈ గ్రామాలను కార్పొరేషన్లో కలపి ఎన్నికలు నిర్వహించాలో, లేక గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలో ప్రభుత్వం వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగే వరకు ఇంటి పన్నులు చెల్లించబోమని స్థానికులు తీర్మానిస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా?
17 ఏళ్లుగా ఉలుకూ పలుకూ లేకుండా, 5 సంవత్సరాలకు ఒకసారి మారుతున్న ప్రభుత్వాలలో, ఇప్పుడున్న ప్రభుత్వమయినా ఇప్పటికైనా కళ్లు తెరుస్తుందా, లేదా అనేది వేచి చూడాలి. ఈ వార్త రాసే సమయానికి ప్రభుత్వం లేదా అధికారుల అధికారిక స్పందన మా వద్ద లేదు. ఇందులోని ఆరోపణలు స్థానికుల, నిరసనకారుల అభిప్రాయాలు; అధికారుల వివరణ అందితే ఈ వార్తను నవీకరిస్తాం.
