[ad_1]

Pak Economic Crisis:

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి అప్పులు తీసుకోవడంలో పాకిస్థాన్‌ది అందెవేసిన చేయి! మళ్లీ మళ్లీ బిక్ష పాత్ర పట్టుకొని వారి దగ్గర చేయి చాచడమంటే ఎంతో ఇష్టం! ప్రస్తుతం 23 ఐఎంఎఫ్‌ ప్రోగ్రాములు నడుస్తున్నాయంటే దాయాది పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గడిచిన 75 ఏళ్లలో ఆ దేశం ఏకంగా 23 సార్లు ఐఎంఎఫ్ వద్ద బెయిల్‌ఔట్‌కు వెళ్లడం గమనార్హం. 21 ప్రోగ్రాములతో అర్జెంటీనా రెండో స్థానంలో ఉంది.

’నిజాయతీగా చెప్పాలంటే మేం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థకు విశ్వాసమైన కస్టమర్లం’ అని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ పాకిస్థాన్‌ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ముర్తజా సయ్యద్‌ అంటున్నారు. ‘ఇందుకు విరుద్ధంగా మా దాయాది భారత్‌ ఐఎంఎఫ్‌ వద్దకు ఏడుసార్లే వెళ్లింది. 1991లో పీవీ నరసింహారావ్‌, మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక సంస్కరణలు చేపట్టాక వారి ముఖమే చూడలేదు’ అని జియో న్యూస్‌ రిపోర్టు చేసింది. తమ దేశం మాత్రం 75 ఏళ్లలో 23 సార్లు వెళ్లిందని విమర్శించింది.

’నేడు పాకిస్థాన్‌ వద్ద 3 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యమే ఉంది. చరిత్రలో ఎప్పుడూ మా రిజర్వు 21 బిలియన్‌ డాలర్లను అధిగమించలేదు. బంగ్లాదేశ్ వద్ద 35 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. భారత్‌ వద్ద 600 బిలియన్‌ డాలర్లు, చైనా వద్ద 4 లక్షల డాలర్లు ఉన్నాయి. 1990 నుంచి పాక్‌ 11 సార్లు ఐఎంఎఫ్ వద్ద అప్పు తీసుకోగా బంగ్లాదేశ్‌ 3 సార్లు తీసుకుంది. భారత్‌, చైనా అస్సలు తీసుకోలేదు’ అని సయ్యద్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఎన్నిడూ లేని విధంగా దివాలా అంచున నిలిచింది. రక్షించాలని ఐఎంఎఫ్‌కు విజ్ఞప్తి చేస్తోంది. కొన్ని నెలలుగా అక్కడ ధరలు ఆకాశాన్ని అంటాయి. వరదలతో పంటలు నష్టపోవడం, విదేశీ మారక నిల్వలు అడుగంటడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ధరలు పెరగడం, ఇప్పటికే చెల్లించాల్సిన అప్పుల్ని చెల్లించకపోవడంతో ఏ ఆదేశమూ ఆదుకోవడం లేదు.

ఇప్పటికే దాయాది ఎన్నోసార్లు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంది. రానురాను ఇవి మరింత ఘోరంగా ఉంటున్నాయి. పైగా ఈ ఏడాది రాజకీయ అనిశ్చితి నెలకొంది. 2025లోపు పాకిస్థాన్‌ 73 బిలియన్‌ డాలర్ల అప్పులు తీర్చాలి. అది జరిగే పని కాదు. ఐఎంఎఫ్‌ బెయిల్‌ ఔట్‌ చేసినా మళ్లీ రుణాలను పునర్‌ వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. అయితే ఈజిప్టు, శ్రీలంకతో పోలిస్తే కాస్త సులభంగానే రీస్ట్రక్చర్‌ చేయొచ్చని నిపుణులు అంటున్నారు.

సర్జరీలు చేయకండి: పాక్ ప్రభుత్వం

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం అక్కడి హెల్త్‌కేర్ రంగాన్నీ దెబ్బ తీసింది. ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు అత్యవసర మందులు అందించలేక ఇబ్బందులు పడుతోంది ప్రభుత్వం. ఫారెక్స్ నిల్వలు నిండుకుంటున్నాయి. ఫలితంగా వేరే దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దేశీయంగా తయారు చేయాలన్నా Active Pharmaceutical Ingredients (API)కూడా అందుబాటులో లేవు. ప్రస్తుతానికి దేశీయంగా మందులు తయారు చేస్తున్న కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం లేదు. సర్జరీలు చేయొద్దంటూ వైద్యులకు అల్టిమేటం జారీ చేసింది పాక్ సర్కార్. అత్యవసర సర్జరీలకు అవసరమైన అనస్తీషియా మరో రెండు వారాలకు సరిపడ మాత్రమే ఉంది. గుండె, కిడ్నీ జబ్బులతో పాటు క్యాన్సర్‌తో బాధ పడుతున్న రోగులకూ మందులు దొరకడం లేదు. ఈ సమస్యలకు తోడు ఆసుపత్రుల్లో సరిపడా సిబ్బంది కూడా లేరు. చాలా మందికి జీతాలివ్వలేక తొలగించారు. ఫలితంగా ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. అయితే…ఈ సమస్యకు ప్రభుత్వమే కారణమని డ్రగ్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకులు దిగుమతులకు అవసరమైన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌లు జారీ చేయడం లేదని మండి పడుతున్నాయి. పాకిస్థాన్‌లో వైద్యం అంతా విదేశాల నుంచి వచ్చిన మందులతోనే నడుస్తోంది. దేశీయంగా పెద్దగా ఉత్పత్తి లేక మొత్తంగా వేరే దేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. భారత్, చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది.

[ad_2]
Source link
Leave a Reply