ఆరోగ్య బీమాతో ఇప్పుడు ‘పైసా వసూల్‌’ – విలువ పెంచిన కొత్త మార్పులు

[ad_1]

Health Insurance Update: ప్రస్తుత కాలంలో, ఆర్థిక భద్రత కోసం బీమా ముఖ్యంగా ఆరోగ్య బీమా అవసరంగా మారింది. అనర్థాలు, రోగాలు చెబితే రావని అంటారు. కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నారు. రోగాలు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పెద్ద ఖర్చును తెచ్చి మన బడ్జెట్‌ ప్లాన్‌ను పాడు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆరోగ్య బీమా ఉపయోగపడుతుంది. ఆకస్మిక అనారోగ్యాల సమయంలో ప్రజలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఇటీవలి కాలంలో కొన్ని మార్పులు ఆరోగ్య బీమా విలువను పెంచాయి. ఆరోగ్య బీమా కంపెనీలు తమ బీమా ప్లాన్స్‌కు కొత్త సౌకర్యాలను జోడిస్తున్నాయి, దీనివల్ల, కొత్త బీమా పథకాలు వినియోగదార్లకు మరింత ఉపయోగకరంగా మారుతున్నాయి.

ఆరోగ్య బీమా రంగంలో వచ్చిన 4 ప్రధాన మార్పులు:

ఓపీడీ కవరేజ్ (OPD Coverage)
గతంలో, ఒక వ్యక్తి ఇన్‌ పేషెంట్‌గా ఆసుపత్రిలో చేరవలసి వచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్య బీమా ఉపయోగపడేది, ఔట్‌ పేషెంట్‌కు వర్తించేది కాదు. ప్రజలు అనారోగ్యానికి గురైన చాలా సందర్భాల్లో, చికిత్స కోసం అడ్మిట్ చేయాల్సినంత అవసరం ఉండదు, OPDలోనే నయమవుతుంది. అలాంటి సందర్భాలలో OPD లేదా డాక్టర్ ఫీజు తదితరాల భారం పడినా, ఆ బీమా అక్కరకు వచ్చేది కాదు. ఇప్పుడు, చాలా కంపెనీలు వైద్యుల సంప్రదింపులు, ఫార్మసీ, డయాగ్నోస్టిక్స్, టెలీమెడికల్ కన్సల్టేషన్, వైద్య సంబంధిత విషయాలపై అయ్యే ఇతర ఖర్చులను కవర్ చేయడం ప్రారంభించాయి. అంటే, OPD ఖర్చులను కూడా ఆరోగ్య బీమా పాలసీ పరిధిలోకి తీసుకువచ్చాయి. 

నగదు రహిత చికిత్స (Cashless Hospitalization)
అకస్మాత్తుగా ఎవరైనా ఆసుపత్రిలో చేరవలసి వస్తే, ముందుగా కొంతమొత్తం డబ్బును డిపాజిట్ చేయాలి. ఇక్కడే మొదటి సమస్య తలెత్తుతుంది. అటువంటి పరిస్థితిలో, రోగి కుటుంబ సభ్యుల మీద భారీ ఆర్థిక భారం ఉంటుంది. చాలా సందర్భాల్లో, తక్షణం డబ్బు కట్టలేని పరిస్థితి కారణంగా చికిత్స ఆలస్యం అవుతుంది, చాలా చెడు ఫలితాలు చూడాల్సి వస్తుంది. ఆరోగ్య బీమా ఈ సమస్యను తొలగిస్తుంది. బీమా నియంత్రణ సంస్థ IRDA, ఆరోగ్య బీమా విషయంలో నగదు రహిత చికిత్సల పరిధిని, ఆసుపత్రుల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం, మన దేశంలోని నగదు రహిత చికిత్స అందించే ఆసుపత్రుల నెట్‌వర్క్ చాలా భారీగా పెరిగింది. ఆరోగ్య బీమా తీసుకున్న రోగులు నగదు గురించి చింతించకుండా ఈ ఆసుపత్రుల్లో సులభంగా అడ్మిట్ కావచ్చు, సకాలంలో సరైన చికిత్సను పొందవచ్చు.

మానసిక ఆరోగ్య కవరేజ్ (Mental Health Coverage)
సాధారణంగా, ప్రజలు మానసిక అనారోగ్యం లేదా మానసిక సమస్యలను విస్మరిస్తారు. ఇలాంటి సమస్యలను సీరియస్‌గా తీసుకోకపోవడానికి చాలా కారణాలున్నాయి. మొదటిది, ఇది తక్షణ హాని కలిగించదు. రెండవది, మానసిక అనారోగ్యం & దాని చికిత్స గురించి అవగాహన లేకపోవడం. ఎక్కువ మంది విద్యావంతులకు కూడా మానసిక అనారోగ్యం గురించి తక్కువ తెలుసు లేదా ఏమీ తెలియకపోవచ్చు. ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వచ్చి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అన్ని బీమా కంపెనీలు తమ సమగ్ర ఆరోగ్య బీమా పాలసీల్లో మానసిక ఆరోగ్య కవరేజీని అందించడాన్ని కూడా రెగ్యులేటర్ IRDA తప్పనిసరి చేసింది. ఇలాంటి మానసిక అనారోగ్య చికిత్సల కోసం OPD కవరేజీని కూడా ఉపయోగించుకోవచ్చు.
 
సీనియర్ సిటిజన్ వరకు కవరేజ్ (Senior Citizen Coverage)
మనుషుల వయసు పెరిగే కొద్దీ రోగాలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా చాలా ముఖ్యం. ఈ వర్గం కోసం ఇప్పటివరకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బీమా ఉత్పత్తుల శ్రేణి పరిమితంగా ఉంది. మారుతున్న వినియోగదార్ల అవసరాలకు అనుగుణంగా బీమా కంపెనీలు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఈ పథకాలు అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్, కో-పేమెంట్స్‌లో తగ్గింపు, తక్కువ లేదా సబ్‌-లిమిట్‌ లేకపోవడం, బీమా పునరుద్ధరించిన ప్రతి సంవత్సరం పెరిగే హామీ మొత్తం వంటి సౌకర్యాలను అందిస్తాయి. ఇది కాకుండా, ఆరోగ్య బీమా ఉత్పత్తులు సూపర్ సీనియర్లు అంటే 80 ఏళ్లు పైబడిన వారికి కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *