ఇన్ఫోసిస్‌ నుంచి కిరణ్ మజుందార్‌ షా రిటైర్మెంట్‌! కొత్తగా..!

[ad_1]

Infosys, Kiran Mazumdar-Shaw Retires:

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బోర్డు నుంచి ప్రముఖ మహిళా వ్యాపారవేత్త కిరణ్‌ మజుందార్‌ షా రిటైర్మెంట్‌ తీసుకున్నారు. బుధవారంతో స్వతంత్ర డైరెక్టర్‌గా ఆమె పదవీకాలం పూర్తైందని కంపెనీ ప్రకటించింది. ఆమె స్థానంలో డీ సుందరాన్ని కంపెనీ లీడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా నియమించింది. గురువారం నుంచి ఆయన పదవిలో కొనసాగుతారు. నామినేషన్‌, రెమ్యూనరేషన్‌ కమిటీ సూచన మేరకు ఆయనను ఎంపిక చేసింది.

ఇన్ఫోసిస్‌ (Infosys) బోర్డులో 2017 నుంచి సుందరం పనిచేస్తున్నారు. ఆడిట్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, వాటాదారుల సంబంధాలు, నామినేషన్‌, రెమ్యూనరేషన్‌ కమిటీ, సైబర్‌ సెక్యూరిటీ సబ్‌ కమిటీల్లో సేవలు అందించారు. ‘ఫైనాన్స్‌, స్ట్రాటజీ విభాగాల్లో సుందరానికి గొప్ప అనుభవం ఉంది. భవిష్యత్తులో కంపెనీ దార్శనికత వాస్తవరూపం దాల్చేందుకు ఆయన కీలకంగా ఉంటారు’ అని ఇన్ఫోసిస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

కిరణ్‌ మజుందార్‌ షా 2014లో ఇన్ఫోసిస్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. 2018 నుంచి లీడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉంటున్నారు. నామినేషన్‌ – రెమ్యూనరేషన్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కమిటీలకు ఆమె ఛైర్‌పర్సన్‌గా సేవలు అందించారు. గతంలో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌, సోషల్‌, గవర్నెన్స్‌ కమిటీ బోర్డులో పనిచేశారు.

‘ఇన్ఫోసిస్‌ కుటుంబంలో కీలక సభ్యురాలిగా పనిచేసిన కిరణ్‌కు కృతజ్ఞతలు. కొన్నేళ్లుగా ఆమె ఇన్ఫీ బోర్డుకు విలువైన సలహాలు ఇచ్చారు. తన మార్గదర్శనంలో నడిపించారు. 2017లో నేను మళ్లీ చేరినప్పటి నుంచి  ఆమె మాతో ఉన్నందుకు నేనెంతో కృతజ్ఞుడిని’ అని ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకనీ అన్నారు. ‘లీడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా నియమితులైన సుందరానికి అభినందనలు. ఇన్ఫోసిస్‌ ఇలాగే మరింత వృద్ధిని సాధించేందుకు ఆయన విలువైన సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాను’ అని నీలేకని తెలిపారు.

డిసెంబర్‌ 2022 త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ మెరుగైన ఫలితాలు విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన డిసెంబర్‌ నాటికి 20.2 శాతం వృద్ధితో రూ.38,318 కోట్ల రాబడి నమోదు చేసింది. తాజా త్రైమాసికంలో 13.4 శాతం వృద్ధితో రూ.6,586 కోట్ల రాబడిని ప్రకటించింది.

ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో కాన్‌స్టంట్‌ కరెన్సీ ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను 15-16 శాతం నుంచి 16-16.5 శాతానికి పెంచింది. ప్రస్తుత రాబడిని చివరి త్రైమాసికంలో విదేశీ కరెన్సీ రేటుతో పోల్చడాన్ని కాన్‌స్టంట్‌ కరెన్సీగా పేర్కొంటారు. చాలామంది విశ్లేషకులు కంపెనీ తన ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను అందుకుంటుందనే అంచనా వేయడం గమనార్హం. FY23కి 21-22 శాతంతో ఆపరేటింగ్‌ మార్జిన్‌ గైడెన్స్‌ను కంపెనీ నిలబెట్టుకుంది.

డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ కాన్‌స్టంట్‌ కరెన్సీ రాబడి వృద్ధి 13.7 శాతంతో పటిష్ఠంగా ఉంది. సీక్వెన్షియల్‌గా 2.4 శాతంగా ఉంది. తాజా త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఇన్ఫోసిస్‌ 3.3 బిలియన్‌ డాలర్ల మేర ఒప్పందాలు సొంతం చేసుకోవడం ప్రత్యేకం. చివరి ఎనిమిది క్వార్టర్లలో ఇదే పటిష్ఠం కావడం గమనార్హం.

‘ఈ క్వార్టర్లో మా ఆదాయ వృద్ధి బలంగా ఉంది. డిజిటల్‌ వ్యాపారం, ప్రధాన సేవల్లో వృద్ధి నమోదైంది. భారీ ఒప్పందాలు కుదురుతున్నాయి. మా క్లయింట్లకు నమ్మకమైన భాగస్వామిగా ఎక్కువ మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుంటున్నాం’ అని ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ సలిల్‌ పారేఖ్‌ అన్నారు. ‘మెరుగైన ఖర్చుల నిర్వహణతో మూడో త్రైమాసికంలో ఆపరేటింగ్‌ మార్జిన్‌ పటిష్ఠంగా ఉంది. అట్రిషన్‌ రేటూ తగ్గింది. రాబోయే కాలంలో మరింత తగ్గుతుందని మా అంచనా’ అని చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నీలాంజన్‌ రాయ్‌ పేర్కొన్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *