[ad_1]
India Post Accidental Insurance Details: అన్ని బీమా సంస్థలతో పాటు భారతీయ తపాలా విభాగం (Postal Department) కూడా ఒక ప్రమాద బీమా పథకాన్ని ఆఫర్ చేస్తోంది. టాటా AIGతో కలిసి, గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ (GAG) పేరిట ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పాలసీ కొనడానికి ఏడాదికి కేవలం 520 రూపాయలు చెల్లిస్తే చాలు. పాలసీహోల్డర్‌కు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కవరేజ్ లభిస్తుంది. అంటే, రోజుకు ఒక్క రూపాయిన్నర కంటే తక్కువ మొత్తంతోనే ఒక భారీ ప్రమాద బీమా కవరేజీ పొందొచ్చు.
పోస్టాఫీస్ ప్రమాద బీమా వివరాలు
18 నుంచి 65 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న ఎవరైనా ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (India Post Payments Bank) ద్వారా మాత్రమే ప్రీమియం చెల్లించాలి. అంటే, ఈ బీమా తీసుకోవాలంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతా ఉండడం తప్పనిసరి. కేవలం రూ.100తో ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
పాలసీదారు రోడ్డు ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందుతాయి. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే, లక్ష రూపాయలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తంలో ఏది తక్కువైతే అది చెల్లిస్తారు.
ఇతర అదనపు ప్రయోజనాలు
ఈ పాలసీలో మరికొన్ని డెత్ బెనిఫిట్స్ (Death benefits) కూడా ఉన్నాయి. విద్యా ప్రయోజనం కింద, గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ట్యూషన్ ఫీజులో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకునే ఆప్షన్ ఉంది. కుటుంబ ప్రయోజనం కింద 25 వేల రూపాయలు, అంత్యక్రియల కోసం మరో 5 వేల రూపాయలు అందుతాయి. ఆసుపత్రిలో చికిత్స సమయంలో, రోజువారీ నగదు రూపంలో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు ఇస్తారు.
రూ.320తో రూ.5 లక్షల ప్రమాద బీమా
ఇదే పథకాన్ని 320 రూపాయల ప్రీమియం ఆప్షన్‌తోనూ తపాలా శాఖ అందిస్తోంది. దీనిని ఎంపిక చేసుకని, ఏడాదికి 320 రూపాయలు చెల్లిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణం, శాశ్వత వైకల్యం, పక్షవాతం వంటి సంఘటనలు జరిగితే, ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందుతాయి. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరితే వైద్య ఖర్చుల కోసం 50 వేల రూపాయలు ఇస్తారు. పిల్లల చదువుల వంటి ఇతర అదనపు ప్రయోజనాలు అందవు.
రూ.755 చెల్లిస్తే రూ.15 లక్షల బీమా
నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిసి తపాలాశాఖ అందిస్తున్న బీమా పథకం ఇది. ఏడాదికి రూ.755 చెల్లించి ఈ పాలసీలో జాయిన్ కావచ్చు. అంటే, రోజుకు 2 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, రోజుకు 2 రూపాయల 07 పైసలతో రూ.15 లక్షల బీమా కవరేజీని పొందొచ్చు.
పాలసీ తీసుకున్న తర్వాత, పాలసీదారు ప్రమాదంలో మృతి చెందినా, శాశ్వత వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా నామినీ లేదా ఆ కుటుంబానికి రూ.15 లక్షలు అందుతాయి. పాలసీదారు చనిపోతే, పిల్లల విద్యా ప్రయోజనాల కింద రూ.లక్ష ఇస్తారు. పిల్లల పెళ్లి కోసం మరో రూ.లక్ష చెల్లిస్తారు.
ఒకవేళ ఆసుపత్రిలో చేరితే వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇస్తారు. ఆసుపత్రిలో, సాధారణ చికిత్స సమయంలో రోజుకు రూ.1000, ICUలో ఉంటే రోజుకు రూ.2 వేలు చెల్లిస్తారు. పాలసీదారు చేయి, కాలు విరిగిపోతే, బీమా కవరేజ్ కింద రూ.25,000 చెల్లిస్తారు.
మరో ఆసక్తికర కథనం: హెల్త్ ఇన్సూరెన్స్‌లో కో-పేమెంట్, డిడక్టబుల్ రూల్స్ గురించి మీకు తెలుసా?
[ad_2]
Source link
Leave a Reply