[ad_1]
Jubilant Pharmova shares: ఇవాళ్టి (మంగళవారం, 30 మే 2023) ట్రేడ్‌లో, జూబిలెంట్ ఫార్మోవా షేర్లు జారుడు బండ మీద ఉన్నాయి. FY23 మార్చి త్రైమాసికంలో ఈ ఫార్మా సంస్థ నికర నష్టం రూ.98 కోట్లకు పెరగడంతో షేర్‌హోల్డర్ల కోపం నషాళానికి అంటింది. కంపెనీ షేర్లను నడివీధిలో పెట్టి అమ్మేశారు. దీంతో, జూబిలెంట్ ఫార్మోవా షేర్లు 11.2% పడిపోయి రూ. 318.50కి చేరుకున్నాయి.
అంతకుముందు త్రైమాసికంలో (డిసెంబర్ త్రైమాసికం) ఈ కంపెనీ రూ. 15.67 కోట్ల నష్టాన్ని చవి చూసింది. సరిగ్గా ఏడాది క్రితం, Q4FY22లో ఆర్జించిన రూ. 59.55 కోట్ల లాభం నుంచి ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది.
భారీగా పెరిగిన కంపెనీ ఖర్చులు
జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ ఖర్చులు భారీగా పెరగడంతో ఆ ప్రభావం లాభంపై పడింది. మొత్తం ఖర్చులు Q4FY22లో రూ. 1,420.24 కోట్ల నుంచి Q4FY23లో రూ. 1,785.57 కోట్లకు పెరిగాయి. Q3FY23లో రూ. 1,551.69 కోట్లుగా ఉన్నాయి. అంటే, వ్యయాలు క్రమంగా పెరిగాయి, లాభం రాన్రాను తగ్గుముఖం పట్టింది.
Q4FY23లో, జూబిలెంట్ ఫార్మోవా రూ. 1,678 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. Q3FY23లో ఆదాయం రూ. 1,552.51 కోట్లు & Q4FY22లో రూ. 1,527.53 కోట్లుగా ఉంది. అంటే, ఆదాయం పెద్దగా పెరగలేదు.
సమీక్ష కాల త్రైమాసికంలో ఎబిటా (EBITDA) రూ. 202 కోట్లకు చేరుకుంది, Q4FY22లోని రూ. 234 కోట్ల నుంచి 13.7% క్షీణించింది. అదేవిధంగా, ఎబిటా మార్జిన్స్ గత ఏడాది ఇదే త్రైమాసికంలోని 15.5% నుంచి ఇప్పుడు 12.2%కి తగ్గాయి.
ఒక్కో షేరుకు రూ. 5 డివిడెండ్
FY23లో నికర నష్టం మూటగట్టుకున్నప్పటికీ, జూబిలెంట్ డైరెక్టర్ల బోర్డు ఒక్కో షేరుకు రూ. 5 డివిడెండ్ ప్రకటించింది.
ప్రైస్ యాక్షన్
మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి, BSEలో, జూబిలెంట్ ఫార్మోవా షేరు 6.70% శాతం తగ్గి రూ. 333.80 వద్ద ట్రేడవుతోంది. గత ఒక ఏడాది కాలంలో ఇది కూడా 18% పైగా పడిపోయింది. గత ఆరు నెలల కాలంలో దాదాపు 15% నష్టపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూసినా 8%పైగా నష్టాలతో ట్రేడవుతోంది.
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, జూబిలెంట్ ఫార్మోవా స్టాక్‌ను ఇద్దరు ఎనలిస్ట్‌లు ట్రాక్ చేస్తున్నారు. ఇద్దరూ “బయ్” రేటింగ్ ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన సగటు టార్గెట్ ప్రైస్ రూ. 406. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 22% ర్యాలీని ఇది చూపుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: కొండ దిగుతున్న పసిడి – ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
[ad_2]
Source link
Leave a Reply