[ad_1]
Bank Employees: ఈ వార్త బ్యాంక్ సిబ్బందికి గుడ్ న్యూస్, జనానికి మాత్రం బ్యాడ్ న్యూస్. ఎందుకంటే, అన్ని బ్యాంకులు వారంలో ఐదు రోజులే (5-day work week for bank employees) పని చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, బ్యాంకులతో తరచూ పని ఉండే వ్యక్తులు, సంస్థలకు ఇది ఇబ్బందికర పరిస్థితే.
ప్రస్తుతం, నెలలోని ప్రతి ఆదివారంతో పాటు, ఆ నెలలోని రెండో శనివారం, నాలుగో శనివారాల్లో బ్యాంకులు పని చేయడం లేదు.
రెండో శనివారం & నాలుగో శనివారం అంటూ లెక్కలు వద్దు, ఏ వారంలోనైనా ఐదు రోజులు మాత్రమే పని చేస్తామని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఒక్కటీ అడక్కు అంటూ ఇంతకాలం తాత్సారం చేసిన ‘ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్’ (Indian Banks Association – IBA), ఎట్టకేలకు బ్యాంక్ యూనియన్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
షరతులు వర్తిస్తాయట!
ఒకవేళ, వారానికి ఐదు రోజుల పని దినాలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పుకుంటే, ఒక చిన్న మెలిక పెట్టే ఛాన్స్ ఉంది. వారంలో రెండో శనివారం, నాలుగో శనివారం సెలవులు పోగా.. ఒకటో శనివారం, మూడో శనివారాల్లో పూర్తి పని గంటల పాటు ఇప్పుడు బ్యాంకులు పని చేస్తున్నాయి. ఒకవేళ వారంలో ఐదు రోజుల పనికి ఒప్పుకుంటే, ఆ పని గంటలు పోతాయి కాబట్టి వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేయవచ్చు. కోల్పోయిన గంటలను భర్తీ చేయడానికి, వారంలో మిగిలిన ఐదు రోజుల్లో, పని గంటలను ప్రతిరోజూ 50 నిమిషాలు పెంచే అవకాశం కనిపిస్తోంది.
“వారానికి ఐదు రోజుల పని డిమాండ్‌ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సానుకూలంగా పరిశీలిస్తోంది” అని ‘ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్’ (All India Bank Officers Association) జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజన్ ఒక జాతీయ మీడియాకు వెల్లడించారు.
ఐదు రోజుల పని డిమాండ్‌కు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఓకే చెబితే, ఆ తర్వాత ఆ ప్రతిపాదన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుతుంది. అక్కడ కూడా ఆమోదముద్ర పడితే, ఆ తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India – RBI) వద్దకు వెళుతుంది. రిజర్వ్ బ్యాంక్ కూడా ఒప్పుకుంటే, కేంద్ర బ్యాంక్ విధించే షరతులకు లోబడి వారానికి ఐదు రోజుల పని విధానం బ్యాంకుల్లో అమలవుతుంది.
గతంలోనూ ఇదే డిమాండ్
ఇదే విషయంపై, గత సంవత్సరం, ‘ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్’ (All-India Bank Employees Association) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఒక లేఖ రాసింది. వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయడానికి రోజువారీ పని గంటలను మరో 30 నిమిషాలు పెంచవచ్చని, ప్రతి రోజూ అదనంగా 30 నిమిషాలు పని చేయడానికి దేశవ్యాప్తంగా బ్యాంక్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆ లేఖలో పేర్కొంది.
దేశాన్ని తీవ్రంగా భయపెట్టిన కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలోనూ బ్యాంక్ సిబ్బంది నుంచి ఈ డిమాండ్ మరోమారు తెరపైకి వచ్చింది. ప్రజల తాకిడి ఎక్కువగా ఉండే బ్యాంకుల్లో ఎక్కువ రోజులు పని చేస్తే తాము కూడా కొవిడ్ బారిన పడతామని, పని రోజులను వారానికి ఐదు రోజులకు పరిమితం చేయాలని అప్పట్లోనూ యూనియన్లు డిమాండ్ చేశాయి. కానీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అప్పుడు కూడా ఆ డిమాండ్‌ను తిరస్కరించింది. బ్యాంక్ సిబ్బంది పోరాటం, ఎదురుచూపులు ఫలించి ఇప్పుడు ఆ డిమాండ్ ఆచరణలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు భిన్నంగా, మహమ్మారి సమయంలో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Life Insurance Corporation – LIC) తన ఉద్యోగులకు వరం ప్రకటించింది. వారంలో ఐదు రోజుల విధానాన్ని LIC అమలు చేసింది.
[ad_2]
Source link
Leave a Reply