మామఎర్త్‌ ఐపీవోకి బ్రేక్‌, పబ్లిక్‌ ఆఫర్‌ను పక్కనబెట్టిన స్కిన్‌ కేర్ కంపెనీ

[ad_1]

Mamaearth IPO: మార్కెట్‌లో ఒడుదొడుకులను చూసి భయపడి, ఐపీవోను రద్దు చేసుకున్న కంపెనీల లిస్ట్‌లోకి మరో పేరు చేరింది. 

ప్రస్తుతం.. నిఫ్టీ50 ఇండెక్స్‌ దాని గరిష్ట స్థాయి కంటే 10% దిగువన ట్రేడ్ అవుతోంది. ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన IPOలు, ఇష్యూ ధరల కన్నా తక్కువ స్థాయికి పడిపోయాయి. ఈ పరిస్థితులను చూసి కలత చెందిన స్కిన్‌ కేర్ స్టార్టప్ మామఎర్త్, తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను (Mamaearth IPO) హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం.

సిఖోయా క్యాపిటల్‌, బెల్జియంకు చెందిన సొఫీనా వెంచర్స్‌, వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థల మద్దతు ఉన్న మామఎర్త్‌, ఇప్పుడు “వెయిట్ అండ్ వాచ్ మోడ్”లో ఉంది. బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యంపై బెంగతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు నీరసించిన కారణంగా, ఈ కంపెనీ కూడా ఆందోళన చెంది తన పబ్లిక్‌ ఆఫర్‌ను పక్కనబెట్టినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

200-300 మిలియన్‌ డాలర్ల ప్లాన్‌
Mamaearth బ్రాండ్‌తో బిజినెస్‌ చేస్తున్న పేరెంట్ కంపెనీ హోనస కన్స్యూమర్ ‍‌(Honasa Consumer), డిసెంబర్‌లో IPO పత్రాలను దాఖలు చేసింది. ఫ్రెష్‌ ఈక్విటీ జారీ, ఇప్పటికే ఉన్న షేర్‌హోల్డర్ల నుంచి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) రూట్‌లో మరి కొన్ని షేర్ల విక్రయం ద్వారా సుమారు 200 మిలియన్ డాలర్ల నుంచి 300 మిలియన్‌ డాలర్ల వరకు సమీకరించడానికి ప్రణాళిక రచించింది.

ఐపీవో ద్వారా 3 బిలియన్‌ డాలర్ల విలువను ఈ కంపెనీ ఆశిస్తున్నట్లు గతంలో రిపోర్ట్‌లు వచ్చాయి. చివరిగా, జనవరి 2022లో జరిగిన ఫండింగ్‌లో 1.2 బిలియన్‌ డాలర్ల విలువను ఈ యూనికార్న్‌ కంపెనీ కలిగి ఉంది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి IPO కోసం ఆమోదం పొందడానికి, తుది ప్రాస్పెక్టస్‌ను ఫైల్ చేయడానికి ఈ కంపెనీకి డిసెంబర్ వరకు గడువు ఉంది. 

తన షేర్లను స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేయాలనే ఈ కంపెనీ ఇప్పటికీ భావిస్తోంది, కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చని మార్కెట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మార్కెట్ పరిస్థితులను పునఃపరిశీలించి, సెంటిమెంట్ మెరుగుపడితే అక్టోబర్ నాటికి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చని తెలుస్తోంది.

కంపెనీ యొక్క అతిపెద్ద పెట్టుబడిదారైన సిఖోయా, IPOలో ఎటువంటి వాటాలను విక్రయించదని ప్రకటించారు. ఈ IPO తర్వాత కూడా కంపెనీ వ్యవస్థాపకులకు (founders) 97% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంటారని మామఎర్త్‌ CEO వరుణ్ అలఘ్‌ (Mamaearth CEO Varun Alagh) చెప్పారు.

2016లో మామఎర్త్‌ ప్రారంభం
భార్యాభర్తలైన వరుణ్‌ అలఘ్‌, గజల్‌ అలఘ్‌ 2016లో మామఎర్త్‌ను ప్రారంభించారు. ఇది కంపెనీ వెబ్‌సైట్‌, ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా తన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయిస్తుంటుంది. వెదురుతో తయారు చేసిన బేబీ వైప్స్‌, ఫేస్‌ మాస్కులు, లోషన్లు, హెయిర్‌ కేర్ ఉత్పత్తులను ఈ కంపెనీ అమ్ముతుంది. 2019లో డెర్మా పేరిట కూడా మరో బ్రాండ్‌ను ప్రారంభించింది. భారతదేశంతో పాటు, ఆగ్నేయాసియా, గల్ఫ్ దేశాల్లో వ్యాపారం ఉంది. గత 3 సంవత్సరాలలో కంపెనీ ఆదాయం 105 శాతం CAGR వద్ద పెరిగింది. 2022లో కంపెనీ లాభాలను ఆర్జించింది. 

పేలవమైన మార్కెట్ పరిస్థితుల కారణంగా.. దుస్తుల కంపెనీ ఫ్యాబ్‌ఇండియా, జ్యుయెలరీ రిటైలర్ జోయల్లుక్కాస్ గత నెలలో తమ IPOలను రద్దు చేసుకున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయిన చివరి 10 IPOలలో ఎక్కువ కంపెనీలు వాటి ఇష్యూ ధరల కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతున్నాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *