[ad_1]
UPI Payments: భారతదేశంలో పెరిగిన ఇంటర్నెట్ వ్యాప్తి, స్మార్ట్‌ఫోన్ల వినియోగం కారణంగా.. UPI లావాదేవీలు కూడా విపరీతంగా పెరిగాయి. UPI (Unified Payments Interface) ద్వారా చెల్లింపులు 2022 ఫిబ్రవరి నెలతో పోలిస్తే, 2023 ఫిబ్రవరి నెలలో 50 శాతం పెరిగాయి.
రోజుకు 24 కోట్ల నుంచి 36 కోట్లకు..
2022 ఫిబ్రవరి నెలలో రోజుకు సగటున 24 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగితే… 2023 ఫిబ్రవరి నెలలో రోజుకు సగటున 36 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) ఈ గణాంకాలను విడుదల చేశారు. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో డిజిటల్ చెల్లింపుల అవగాహన వారోత్సవాన్ని గవర్నర్ ప్రారంభించారు.
పెరిగిన లావాదేవీల విలువ
2022 ఫిబ్రవరి నెలలో సగటు లావాదేవీల మొత్తం విలువ రూ. 5.36 లక్షల కోట్లుగా ఉంటే.. 2023 ఫిబ్రవరి నెలలో సగటు లావాదేవీల మొత్తం విలువ రూ. 6.27 లక్షల కోట్లుగా ఉంది, ఏడాది క్రితం కాలం కంటే ఇది 17 శాతం వృద్ధి. గత మూడు నెలలుగా (2022 డిసెంబర్ నుంచి), మొత్తం డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ప్రతి నెలలోనూ రూ. 1,000 కోట్ల మార్కును దాటాయని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. 2016లో ప్రారంభమైన UPI సేవలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయని, మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో వీటి వాటా 75 శాతంగా ఉందని శక్తికాంత దాస్ చెప్పారు.
ఇటీవల, దేశవ్యాప్తంగా చేపట్టిన పాన్-ఇండియా డిజిటల్ పేమెంట్స్ సర్వేలో (90,000 మంది పాల్గొన్నారు) 42 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ వివరించారు. 2017 జనవరిలో 45 లక్షల UPI లావాదేవీలు జరగ్గా, 2023 జనవరిలో ఈ సంఖ్య 804 కోట్లకు పెరిగిందని దాస్ తెలిపారు. ఇదే కాలంలో యూపీఐ లావాదేవీల విలువ రూ. 1,700 కోట్ల నుంచి రూ. 12.98 లక్షల కోట్లకు పెరిగింది.
UPIతో లింక్ కోసం ప్రపంచ దేశాల ఆసక్తి
భారతదేశ UPI పేమెంట్స్ వ్యవస్థ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోందని శక్తికాంత దాస్ చెప్పారు. చాలా దేశాలు UPI చెల్లింపుపై ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. 2023 ఫిబ్రవరి 21న, భారతదేశ UPIతో సింగపూర్‌కు చెందిన ‘పేనౌ’ని (Paynow) అనుసంధానించారు. ఆ తర్వాత, గత 10 రోజుల్లో సింగపూర్ నుంచి మన దేశంలోకి 120 లావాదేవీల ద్వారా నగదు వచ్చిందని, మన దేశం నుంచి 22 లావాదేవీల ద్వారా నగదు సింగపూర్‌కు వెళ్లిందని గవర్నర్ వివరించారు. చాలా దేశాలు కూడా UPIతో భాగస్వామ్యానికి ఆసక్తి చూపిస్తున్నాయని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఒప్పందం చేసుకోవడానికి కనీసం 6 దేశాలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని చెప్పారు.
RBI భవిష్యత్ ప్రణాళిక
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ 75 గ్రామాలను దత్తత తీసుకుంటుందని శక్తికాంత దాస్ తెలిపారు. ఈ గ్రామాల ప్రజలను కలుపుకుని డిజిటల్ చెల్లింపులపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. PSOలు 75 గ్రామాలను దత్తత తీసుకుని వాటిని డిజిటల్ పేమెంట్ ఎనేబుల్ గ్రామాలుగా మారుస్తారు.
[ad_2]
Source link
Leave a Reply