[ad_1]
Bank Locker Rule: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన సంఘటన మీకు గుర్తుందా?. బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఆషియానా బ్రాంచ్ లాకర్‌లో అల్కా పాఠక్ అనే మహిళ డబ్బు దాచుకున్నారు. ట్యూషన్లు చెప్పుకుని బతికే సదరు మహిళ, తన కుమార్తె పెళ్లి కోసం ఆ డబ్బును దాచుకున్నారు. ఆర్‌బీఐ కొత్త రూల్స్ ప్రకారం, ‘నో యువర్ కస్టమర్’ (KYC) వివరాలను అప్‌డేట్ చేయడానికి, కొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి బ్రాంచ్‌కు రావాలని ఇటీవలే బ్యాంక్ అధికారులు ఆమెకు కాల్ చేశారు. బ్యాంక్‌కు వెళ్లిన పాఠక్, తన లాకర్ తెరిచి చూస్తే అక్కడ ఏం కనిపించలేదు. లాకర్‌లో ఆమె దాచుకున్న డబ్బును చెదపురుగులు తినేశాయి. ఈ విషయం సెన్సేషన్ న్యూస్ అయింది. మొత్తం డబ్బు 18 లక్షల రూపాయలుగా అల్కా పాఠక్ చెబుతున్నారు. ఈ సంఘటనపై, బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది తమ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ పంపారు. జరిగిన నష్టానికి అల్కా పాఠక్‌కు పరిహారం లభిస్తుందా, ఒకవేళ పరిహారం లభిస్తే ఎంత చెల్లిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మన దేశంలోని లక్షలాది మంది ప్రజలు బంగారం, వెండి, నగదు, ఆస్తిపత్రాలు, విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచడానికి బ్యాంక్ లాకర్లను ఉపయోగిస్తున్నారు. బ్యాంక్ లాకర్‌లో పెట్టిన వస్తువులకు సంపూర్ణ రక్షణ ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. అయితే… దొంగతనం, అగ్నిప్రమాదం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్‌కు నష్టం జరగవచ్చు. తాజాగా, చెద పురుగుల సంఘటన జరిగింది. ఇలాంటి సందర్భాల్లో, భారతీయ బ్యాంకుల రూల్స్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
మారిన రూల్స్ ఏం చెబుతున్నాయి?
వరదలు, భూకంపం, అల్లర్లు, తీవ్రవాదుల దాడి, కస్టమర్ నిర్లక్ష్యం మొదలైన వాటి కారణంగా బ్యాంక్ లాకర్‌లో విలువైన వస్తువులు దొంగతనానికి గురైనా, దెబ్బతిన్నా… పాత రూల్స్ ప్రకారం బ్యాంకులు ఆ నష్టాన్ని భర్తీ చేస్తాయి. కానీ, ఇప్పుడు అలా లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం, కస్టమర్ తన లాకర్‌లో ఉంచిన విలువైన వస్తువులకు సంబంధిత బ్యాంక్ బాధ్యత వహించదు. ఇందులోనూ కొన్ని షరతులు ఉన్నాయి.
అద్దెకు 100 రెట్ల బాధ్యత మాత్రమే!
అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ, బ్యాంక్ భవనం కూలిపోవడం లేదా బ్యాంక్ ఉద్యోగుల మోసం వంటి సంఘటనల్లో… బ్యాంక్ బాధ్యత ఆ లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు మాత్రమే ఉంటుంది. 100 రెట్లు అనే పదం వినడానికి గంభీరంగా ఉన్నా, కస్టమర్‌కు దక్కేది చాలా తక్కువ. లాకర్ వార్షిక అద్దె వెయ్యి రూపాయలు అనుకుంటే, లాకర్‌లో ఎంత విలువైన ఆస్తి ఉన్నా బ్యాంకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇస్తుంది.
బాధ్యత వహించని సందర్భాలు
భూకంపం, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్‌లోని వస్తువులు దెబ్బతిన్నప్పుడు లేదా నష్టపోయినప్పుడు బ్యాంక్ ఎటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అవి బ్యాంక్ సృష్టించినవి కావు. కాబట్టి, అలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉన్న చోట లాకర్ తీసుకోకపోవడం ఉత్తమం. ఒకవేళ తీసుకున్నా, విలువైన వస్తువులను అందులో ఉంచకపోవడం అత్యుత్తమం.
నష్టాలకు బ్యాంకులు ఎందుకు బాధ్యత వహించవు?
లాకర్‌లో దాచిన ఆస్తి నష్టానికి బ్యాంక్ బాధ్యత తీసుకోకపోవడానికి కారణం… కస్టమర్ తన లాకర్‌లో ఏం ఉంచుతున్నారో బ్యాంకు అధికారులకు తెలీకపోవడం లేదా నష్టపోయిన వస్తువు అసలు విలువ తెలీయకపోవడం. లాకర్ అనేది వ్యక్తిగత విషయం, అందులో ఏం దాస్తున్నారో ఆ బ్యాంక్‌కు కస్టమర్ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, లాకర్‌లో పెడుతున్న వస్తువుల గురించి బ్యాంకులు అడగవు, పట్టించుకోవు. ఈ పరిస్థితిలో, పరిహారం ఎంతన్నది నిర్ధరించడం దాదాపు అసాధ్యం.
సాధారణంగా, లాకర్ రూల్స్ అన్ని బ్యాంక్‌లకు దాదాపుగా ఒకేలా ఉంటాయి, కొన్ని విషయాలు మాత్రం మారతాయి. కాబట్టి, మీరు ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో లాకర్ తీసుకోవాలనుకుంటే, ముందుగా లాకర్ ఉన్న వాతావరణం, లాకర్ రూల్స్ గురించి తెసుకుంటే మంచిది.
మరో ఆసక్తికర కథనం: పసిడి పతనం కంటిన్యూస్ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply