20 పైసలకు ఎస్‌ఎంఎస్‌, రూ.14కు కాలింగ్ రెవెన్యూ డౌన్‌! OTT వల్లే ఇదంతా!!

[ad_1]

Telecom Revenue Share: 

ఇంటర్నెట్‌ ప్రభంజనం టెలికాం కంపెనీల ఆదాయంలో పెను మార్పులు తీసుకొస్తోంది. అతి తక్కువ ధరకే డేటా అందుబాటులోకి రావడంతో మిగతా సెగ్మెంట్ల రాబడి తగ్గిపోతోంది. చివరి పదేళ్లలో టెలికాం ఆపరేటర్లకు వాయిస్‌ కాల్స్‌ నుంచి 80 శాతం, ఎస్‌ఎంఎస్‌ల నుంచి 94 శాతం ఆదాయం పడిపోయిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) పేపర్‌ పేర్కొంది.

ఇంటర్నెట్‌ ఆధారిత కాలింగ్‌ (Internet Calling), మెసేజింగ్‌ యాప్‌ల (Messaging Apps) పెరుగుదలే ఇందుకు కారణాలని ట్రాయ్‌ వెల్లడించింది. అయితే జూన్‌ 2013 నుంచి డిసెంబర్‌ 2022 వరకు ఒక్కో యూజర్‌ వాడిన డేటాపై ఆదాయం పది రెట్లు పెరిగిందని వివరించింది. వాట్సాప్‌, గూగుల్‌ మీట్‌, ఫేస్‌టైమ్‌ వంటి ఇంటర్నెట్‌ మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్‌లను నియంత్రించనున్నట్టు తెలిపింది. మెసేజింగ్‌, వాయిస్‌ కమ్యూనికేషన్‌ వంటి ఓవర్‌ ది టాప్‌ల ద్వారా వస్తున్న ఆదాయం వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌లను మించి వస్తోందని స్పష్టం చేసింది.

‘భారత్‌లో 2013-2022 మధ్య వైర్‌లెస్‌ యాక్సెస్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల రాబడిలో భారీ మార్పులు వచ్చాయి’ అని ట్రాయ్‌ తెలిపింది. ఈ మేరకు ‘ఓటీటీ కమ్యూనికేషన్‌ సేవలపై నియంత్రణ, ఓటీటీ సేవలపై సెలక్టివ్‌ బ్యానింగ్‌’ అనే పత్రాలను విడుదల చేసింది.

టెలికాం ఆపరేటర్లకు ఏఆర్‌పీయూ (ARPU) అత్యంత కీలకం. ఒక యూజర్‌పై వచ్చే సగటు ఆదాయాన్ని ఏఆర్‌పీయూ అంటారు. డేటాను పక్కన పెడితే వీటిపై ఏఆర్‌పీయూ రెవెన్యూ 2013-2022 మధ్య తగ్గిందని ట్రాయ్‌ తెలిపింది.

ఒక్కో యూజర్‌పై 2013, జూన్‌ త్రైమాసికంలో8.1 శాతంగా ఉన్న డేటా రెవెన్యూ 2022, డిసెంబర్‌ నాటికి పది రెట్లు పెరిగింది. వృద్ధిరేటు 85.1 శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో ఏఆర్‌పీయూ రెవెన్యూ కేవలం 41 శాతమే పెరిగింది. రూ.123 నుంచి రూ.146కు చేరుకుంది. 

ఏఆర్‌పీయూలో కాల్స్‌ రెవెన్యూ రూ.14.79 (10.1 శాతం)కు తగ్గింది. పదేళ్ల క్రితం ఇది రూ.72.53గా ఉండేది. అంటే ఏఆర్‌యూపీలో 58.6 శాతంగా ఉండేది. ఇదే విధంగా ఏఆర్‌పీయూలో ఎస్‌ఎంఎస్‌ ఆదాయం రూ.3.99 నుంచి 20 పైసలకు పడిపోయింది.

ఓటీటీ కంపెనీలను లైసెన్సింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ పరిధిలోకి తీసుకొచ్చే మార్గాలను ట్రాయ్ అన్వేషిస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే ఆయా కంపెనీలు ప్రవేశ రుసుము, ఆదాయంలో వాటా, చట్టపరంగా జోక్యం, కాల్స్‌ డేటా రికార్డులు ఇవ్వడం, నిబంధనలను పాటించడం వంటివి చేయాల్సి ఉంటుంది.

గతంలో ఓటీటీలకు లైసెన్స్‌ అవసరం ఉండేది కాదు. ఐటీ, కమ్యూనికేషన్లకు చెందిన పార్లమెంటరీ ప్యానెల్‌.. ఇంటర్నెట్‌ కాలింగ్‌, మెసేజింగ్‌ యాప్స్‌పై సెలక్టివ్‌ బ్యానింగ్‌ వంటివి అమలు చేయాలని సిఫార్స్‌ చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను పూర్తి స్థాయిలో షట్‌డౌన్‌ చేయకుండా ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో టెర్రరిస్టులు ఓటీటీ యాప్స్‌, వెబ్‌సైట్ల ద్వారా ఇబ్బందులు కలిగిస్తే సెలక్టివ్‌ బ్యానింగ్‌ ఉపయోగ పడుతుందని భావించింది.

Also Read: సైలెంట్‌ కిల్లర్‌ సైయెంట్‌ డీఎల్‌ఎం – 50% ప్రీమియంతో షేర్ల లిస్టింగ్‌

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *