అద్దె ఇల్లు Vs సొంత ఇల్లు – ట్రెండింగ్‌లో జీరోధ సీఈవో సమాధానం

[ad_1]

Zerodha CEO Nithin Kamath Comments: ఇల్లు కొంటే బెటరా, అద్దెకు తీసుకుంటే బెటరా.. చాలా మంది మెదళ్లను పురుగులా తొలిచేసే ప్రశ్న ఇది. ఆర్థిక రంగంలో ఆరితేరినవాళ్లు సైతం ఈ పశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేరు. కోడి ముందా, గుడ్డు ముందా అంటే ఏం చెబుతాం?, ఈ ప్రశ్న కూడా అలాంటిదే. సొంత ఇంటికి, అద్దె ఇంటికి.. దేనికి ఉండే సానుకూలతలు, ప్రతికూలతలు దానికి ఉన్నాయి. ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత పరిస్థితులు/అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారే నిర్ణయం తీసుకోవాలి తప్ప, ఈ ప్రశ్నకు ఉమ్మడి సమాధానం ఉండదు.

బ్రోకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ జీరోధ సీఈవో నితిన్ కామత్ (Zerodha CEO Nithin Kamath), ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ‘రెంట్ వర్సెస్‌ బయ్‌ డిబేట్’ (Rent Vs Buy Debate) పాడ్‌కాస్ట్‌ అది. ఆ పాడ్‌కాస్ట్‌లో నితిన్‌ కామత్‌ చెప్పిన మాటలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

అద్దె ఇల్లు Vs సొంత ఇల్లు – నితిన్‌ కామత్‌ అభిప్రాయం
ఇంటిని కొనడం కంటే అద్దెకు తీసుకోవడానికే తాను ఇష్టపడతానని నితిన్‌ కామత్‌ చెప్పారు. ప్రస్తుతం తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నానని అన్నారు. ఈ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3.7 లక్షల మంది చూశారు. దాదాపు 8,900 లైక్స్‌ కూడా వచ్చాయి. 

తన కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉందని, అది తన తల్లిదండ్రులదని కామత్‌ చెప్పారు. ఆ ఇంటితో పెనవేసుకున్న అనుబంధం, భావోద్వేగాల వల్ల దానిని అమ్మకుండా అట్టి పెట్టుకున్నామని అన్నారు. ఇల్లు కొనాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఇంటికి అద్దె కట్టడమే సమంజసంగా భావించినట్లు చెప్పారు.

ఇల్లు కొనడం కన్నా అద్దెకు తీసుకోవడం బెటర్‌ అన్న కామత్‌ కామెంట్‌ నెటిజన్లలో కలకలం రేపింది. కామత్‌ మాటలపై స్పందనపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు, కామెంట్స్‌ను పోస్ట్‌ చేస్తున్నారు. కామత్‌ మాటలతో కొందరు ఏకీభవించగా, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఇల్లు కొనడమే మంచిదని మరికొందరు వాదించారు. 

కామత్‌ కామెంట్లపై నెటిజన్ల స్పందన
“80% సొంత డబ్బు, 20% అప్పుతో కలిపి ఇల్లు కొనడం చెడ్డ ఆలోచనేం కాదు” అని ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ కామెంట్‌ చేశారు. “సొంత ఇంటి వల్ల ఒక రకమైన మానసిక శాంతి, భద్రత భావం ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆదాయం ఆగిపోయినా, కనీసం ఉండడానికి నా సొంత ఇల్లు ఉంది. ఏ కారణాల వల్లనైనా నేను 3 నెలల పాటు అద్దె కట్టకపోయినా ఆ ఇంటి నుంచి ఎవరూ నన్ను బయటకు పంపలేరు అన్న హామీ లభిస్తుంది. ఇల్లు ఎప్పటికీ ఇల్లుగా ఉంటుంది” అని మరొకరు రాశారు. “కామత్‌ చెప్పిన విషయంలో అర్థం ఉంది. అతని మనోగతం వాస్తవికత, లెక్కలపై ఆధారపడి ఉంటాయి” అని మరొకరు వ్యాఖ్యానించారు. “అప్పు తీసుకుని నెలనెలా పెద్ద మొత్తంలో EMI కట్టే బదులు అద్దె ఇంట్లో ఉంటూ, EMI డబ్బులో కొంతమొత్తాన్ని రెంట్‌ కింద వినియోగించి, మిగిలిన డబ్బును పెట్టుబడిగా పెట్టొచ్చని, దాని వల్ల దీర్ఘకాలంలో సంపద సృష్టించొచ్చని” మరికొందరు కామెంట్‌ చేశారు.

మరో ఆసక్తికర కథనం: నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొంటే సెక్షన్‌ 80C, సెక్షన్‌ 24B వర్తిస్తాయా?

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *