భారత్‌లో రికార్డ్‌ స్థాయిలో సంపన్నులు, ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారబ్బా?

[ad_1]

Hurun India Rich List 2024: ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగులు పెట్టే ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ది తొలి స్థానం. 5G స్పీడ్‌తో దూసుకెళ్తున్న మన ఎకానమీలో, సూపర్ రిచ్‌ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో, సంపన్నుల సంఖ్య 75 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం, భారతదేశంలో రూ.1000 కోట్ల కంటే ఎక్కువ ఆస్తిపాస్తులున్న వ్యక్తులు 1300 మందికి పైగా ఉన్నారు. 

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ (Hurun India Rich List 2024) ప్రకారం, ప్రస్తుతం, రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య 1,319 కు పెరిగింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023లో ఈ సంఖ్య 216 పెరిగితే, ఈ ఏడాది మరో సంపన్నుల క్లబ్‌లో మరో 278 మంది కొత్త వ్యక్తులు చేరారు. అంటే, గతేడాది కొత్త సభ్యుల సంఖ్య కంటే ఈ ఏడాది కొత్త సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు ఇదే పునరావృతం అవుతోంది. 

భారతదేశంలో రూ. 1000 కోట్లకు పైగా సంపద ఉన్న వారి సంఖ్య 1300 దాటడం ఇదే తొలిసారి, ఇదొక రికార్డ్‌. గత ఐదేళ్లలో, భారత్‌లో అపర కుబేరుల సంఖ్య 76 శాతం పెరిగింది.

భారతీయ పారిశ్రామికవేత్తల్లో నవోత్సాహం
భారతీయ సంపన్నులు భవిష్యత్‌ రోజులపైనా ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లోని వ్యాపారవేత్తల కంటే భారతీయ వ్యాపారవేత్తలు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని హురున్ గ్లోబల్ చైర్మన్ రూపర్ట్ హూగ్‌వెర్ఫ్ చెప్పారు. కొత్త సంవత్సరం మరింత మెరుగ్గా ఉండబోతోందని భారతీయ సంపన్నులు భావిస్తున్నారట. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇంత ఉల్లాసం, ఉత్సాహం కనిపించలేదని వెల్లడించారు. మన పొరుగున ఉన్న చైనా పారిశ్రామికవేత్తలు 2024 గురించి చాలా బెంగ పెట్టుకున్నారట. ఇది ఒక చెడ్డ సంవత్సరంగా నిలుస్తుందని భయపడుతున్నట్లు హురున్‌ ఇండియా సర్వేలో తేలినట్లు రూపర్ట్ హూగ్‌వెర్ఫ్ చెప్పారు. అత్యంత ధనిక దేశాలున్న ఐరోపాలోనూ ఆశావాదం కనిపించడం లేదని స్పష్టం చేశారు.

భారత్‌ – చైనా సంపన్నుల మధ్య వ్యత్యాసం
భారతదేశం – చైనా సంపన్నులను పోల్చి చూస్తే… రెండు దేశాల సంపన్నుల లిస్ట్‌లో తేడాలు కనిపిస్తున్నాయని హూగ్‌వెర్ఫ్ చెప్పారు. భారత్‌ విషయానికొస్తే.. కుటుంబ ఆధారిత వ్యాపార నిర్మాణం ఉంది. మన దగ్గర సంపన్నుల వ్యాపార సామ్రాజ్యాలు తరతరాల నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. అయితే, చైనాలో బహుళ తరాల వ్యాపార సామ్రాజ్యాల కొరత ఉంది. భారతదేశ కుటుంబ ఆధారిత వ్యాపార సామ్రాజ్యాలను ‘రెండు వైపులా పదును గల కత్తి’గా హూగ్‌వెర్ఫ్ అభివర్ణించారు. సంప్రదాయికంగా ఇది గొప్పగా కనిపించినప్పటికీ, నూతన వ్యవస్థాపకతను ఇది ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ రెండు రంగాల నుంచి భవిష్యత్‌ కుబేరులు
భవిష్యత్‌ సంవత్సరాల్లోకి చూస్తే.. రెండు రంగాల నుంచి అత్యంత సంపన్నులు ఉద్భవించబోతున్నారని హురున్ గ్లోబల్ చైర్మన్‌ చెప్పారు. మొదటి రంగం.. కృత్రిమ మేథ (AI), రెండో రంగం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs). ఇటీవలి కాలంలో, AI వల్ల చాలా కంపెనీలు లాభపడ్డాయి. మైక్రోసాఫ్ట్ విలువ 700 నుంచి 800 బిలియన్ డాలర్లు పెరిగింది. చైనాలో, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో చాలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ముక్తాయింపుగా ఒక్క ముక్క చెప్పుకుందాం. పేదల విషయంలోనే కాదు, సంపన్నుల సంఖ్యలోనూ లోటు లేని దేశం భారత్‌.

మరో ఆసక్తికర కథనం: ఫ్రీ కరెంట్‌ ఇచ్చే పీఎం సూర్య ఘర్‌ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు కాదు?

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *