ఇంటి రుచులు..
బయటి ఆహారం ఎంత తిన్నా ఇంటి భోజనం రుచే వేరు అని చాలా మంది భావిస్తుంటారు. పైగా కరోనా తర్వాత చాలా మంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతో ఇంటి ఆహారానికి షిఫ్ట్ అయ్యారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులను పసిగట్టిన జొమాటో సైతం తన వ్యాపారాన్ని మార్చుకోవటంలో భాగంగా Zomato Everyday కింద ఇంటి రుచులను భోజన ప్రియులకు అందించనుంది. ఇందులో కేవలం రూ.89కే ఆహారాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది.

జొమాటో ఎవ్రీడే అంటే..
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో బుధవారం తన జొమాటో ఇన్‌స్టంట్ స్థానంలో జొమాటో ఎవ్రీడే పేరుతో కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. నిలిపివేయబడిన Zomato ఇన్‌స్టంట్ కింద గతంలో కంపెనీ ఎంపిక చేసిన ఆహార పదార్థాలకు 10 నిమిషాల్లోపు డెలివరీలను అందించింది. అయితే కొత్తగా ఆవిష్కరించబడిన Zomato ఎవ్రీడే కింద.. హౌస్ చెఫ్స్ వండిన ఇంటి భోజనాన్ని అందిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో..
ఇంటి తరహా ఆహారాన్ని ఇప్పటికే మార్కెట్లో Cookr, FoodCloud, HomeFoodi వంటి స్టార్టప్ సంస్థలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని భోజన ప్రియులకు మాత్రమే అందిస్తున్నాయి. ప్రస్తుతం జొమాటో సైతం ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇంటి తరహా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలకునే వారిని టార్గెట్ చేసుకుని ప్రస్తుతం జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్డర్ ప్రక్రియ..
జొమాటో గుర్తించిన చెఫ్‌లు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. వారు తమ ప్రాంగణంలో వినియోగదారుల కోసం మాత్రమే ఆహారాన్ని సిద్ధం చేస్తారు. మెుదటగా జొమాటో ఎవ్రీడే గురుగ్రామ్‌లోని కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వినియోగదారుల నుంచి అల్పాహారం కోసం ఉదయం 8 నుంచి 11:30 గంటల మధ్య, మధ్యాహ్న భోజనం కోసం 11:30 నుంచి 3:30 గంటల మధ్య మాత్రమే ఆర్డర్‌లను తీసుకుంటుంది.