Cryptocurrency Recovery in 2023: క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో 2023 సంవత్సరం మొత్తం ఒక గందరగోళం కనిపించింది. ఈ ఏడాది పొడవునా, క్రిప్టో అసెట్స్‌కు ‍‌(Crypto Assets) సంబంధించిన అప్‌డేట్స్‌ వస్తూనే ఉన్నాయి. ఒకవైపు, అనేక క్రిప్టో కరెన్సీ కంపెనీలు మూతబడ్డాయి, మరోవైపు, సంస్థాగత ఆమోదం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన నియమనిబంధనలను కఠినతరం చేస్తున్నా, ప్రధాన కాయిన్స్‌ ఈ సంవత్సరం అద్భుతమైన రికవరీని చూపించాయి. 

కుప్పకూలిన పెద్ద క్రిప్టోలు
గత సంవత్సరం (2022) క్రిప్టోలకు పీడకలను మిగిల్చింది. ఆ ఏడాదిలో FTX, సామ్ బ్యాంక్‌మన్ ఫ్రాయిడ్ ‍‌(Sam Bankman-Fried) ఆకాశం నుంచి ఒక్కసారిగా పాతాళానికి జారి పోయారు. కాస్త అటూఇటుగా ఇదే ట్రెండ్ 2023లోనూ కొనసాగింది. సామ్ బ్యాంక్‌మన్ ఫ్రాయిడ్ విచారణపై 2023 మొత్తంలో వార్తలు వస్తూనే ఉన్నాయి. క్రిప్టో ప్రపంచంలోని ఎలాన్ మస్క్‌గా పేరు గడించిన బినాన్స్ (Binance) చీఫ్ చాంగ్‌పెంగ్ జావో, US మనీలాండరింగ్ నిరోధక చట్టాలను ఉల్లంఘించినందుకు దోషిగా తేలారు. సెల్సియస్ ‍‌(Celsius) వ్యవస్థాపకుడు అలెక్స్ మాసిన్స్కీ జులైలో అమెరికాలో అరెస్టయ్యారు.

2023లో క్రిప్టో అసెట్స్‌పై కఠినమైన నిబంధనలు వెలువడ్డాయి. G20 సమ్మిట్‌లో ఈ దిశగా కీలక అడుగు పడింది. ఆ సమ్మిట్‌లో, క్రిప్టో ఆస్తులకు సంబంధించి సాధారణ చట్టపరమైన చర్యలపై చర్చలు జరిగాయి. ఇందులో, వినియోగదార్ల రక్షణ, మనీలాండరింగ్‌ను నిరోధించే చర్యలు, డిజిటల్ ఆస్తులపై పన్నులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 

బిట్‌కాయిన్‌ (Bitcoin), ఎథేరియం (Ethereum) వంటి క్రిప్టో కరెన్సీలు ఈ సంవత్సరంలో సంస్థాగత ఆమోదం పొందాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో.. బ్లాక్‌రాక్, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, BNY మెల్లన్, సిటీ గ్రూప్ మొదలైన అనేక పెద్ద కంపెనీలు సైతం క్రిప్టో అసెట్స్‌ మీద ఆసక్తిని ప్రదర్శించాయి.

బిట్‌కాయిన్‌కు కొత్త రెక్కలు
ఈ సంవత్సరం, నష్టాలను కవర్‌ చేసుకోవడంలో బిట్‌కాయిన్ విజయం సాధించింది. 2023లో, బిట్‌కాయిన్ ప్రైస్‌ 164 శాతంతో విపరీతంగా పెరిగింది. ఇది S&P 500 వంటి అనేక సాంప్రదాయ, బెంచ్‌మార్క్ సూచీల కంటే చాలా రెట్లు ఎక్కువ. ఈ సంవత్సరం S&P 500 దాదాపు 20 శాతం పెరిగింది. ఈ ఏడాది 40 వేల డాలర్ల స్థాయిని దాటడంలోనూ బిట్ కాయిన్ విజయవంతమైంది. మొత్తం క్రిప్టో మార్కెట్‌లో దాని వాటా 38 శాతం నుంచి 50 శాతంపైగా పెరిగింది. కాబట్టి, 2023ను బిట్‌కాయిన్‌ సంవత్సరంగా పిలవొచ్చు.

ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలోనే బిట్‌కాయిన్‌ చాలా ఎక్కువగా పెరిగింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో, బిట్‌కాయిన్ ధర ఇప్పటి వరకు 55 శాతానికి పైగా జంప్‌ చేసింది. వచ్చే ఏడాది వడ్డీ రేట్లను తగ్గిస్తామని US సెంట్రల్ బ్యాంక్ స్పష్టమైన సిగ్నల్‌ ఇచ్చింది. దీనివల్ల US బాండ్ రాబడులు తగ్గుతాయి. ఫలితంగా క్రిప్టో ఆస్తుల పెరుగుదలకు ప్రోత్సాహం లభించింది. 

2023లో కఠినంగా మార్చిన చట్టాల వల్ల ప్రయోజనం కూడా ఉంది, నియంత్రణకు సంబంధించిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇది క్రిప్టో కరెన్సీలకు సాయపడుతుంది. మొత్తంమ్మీద, 2023లో ప్రారంభమైన గుడ్‌ టైమ్‌ 2024లోనూ కంటిన్యూ కావచ్చు.

మరో ఆసక్తికర కథనం: సంచలనం సృష్టించిన టాప్‌-10 IPOలు, పెట్టుబడిదార్లకు కనక వర్షం Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *