PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

క్రెడిట్‌ సూయిస్‌ టేకోవర్‌ కోసం UBS ప్రయత్నాలు


UBS Group – Credit Suisse: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం నుంచి పుట్టుకొచ్చిన ప్రకంపనలు అమెరికా నుంచి గ్లోబల్‌ బ్యాంకింగ్‌ రంగం మొత్తానికి వ్యాపించాయి. ఏ బ్యాంక్‌కు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చినా.. ఇటు స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్లు, అటు బ్యాంకు ఖాతాదార్లు వణికిపోతున్నారు. ఈ ఎపిసోడ్‌లో తాజాగా నలుగుతున్న ఉదాహరణ క్రెడిట్ సూయిస్ బ్యాంక్‌. 

క్రెడిట్ సూయిస్ భారీ సమస్యల్లో ఉందంటూ వస్తున్న వార్తలు పెట్టుబడిదార్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ అంతర్గత వ్యవస్థల్లో లోపాలు ఉన్నట్లు తాము గుర్తించినట్లు, ఇటీవలే ఈ బ్యాంక్‌ స్వయంగా ప్రకటించింది కూడా. ఈ దిగ్గజ బ్యాంక్‌ దగ్గర $54 బిలియన్‌ డాలర్ల నగదు నిల్వలు ఉన్నప్పటికీ, దీని షేర్‌ ధర పతనం కొనసాగింది. దీంతో, క్రెడిట్‌ సూయిస్‌కు కొత్త ఊపిరులు ఊదడం ద్వారా మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఉత్తేజాన్ని నింపడానికి ప్రయత్నం జరుగుతోంది. స్విస్ నేషనల్ బ్యాంక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

క్రెడిట్ సూయిస్ – UBS చర్చలు           
భారీ సమస్యలను ఎదుర్కొంటున్న క్రెడిట్ సూయిస్ బ్యాంక్ బోర్డు, స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం UBS బోర్డు మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. క్రెడిట్‌ సూయిస్‌ మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని UBS స్వాధీనం చేసుకోవడానికి ఈ చర్చలు జరుగుతున్నాయి. దీంతోపాటు, స్విస్ నేషనల్ బ్యాంక్, బ్యాంకింగ్‌ రెగ్యులేటర్ స్విస్ ఫిన్మా (FINMA) ప్రారంభించిన చర్చల్లోనూ ఈ రెండు బ్యాంకుల బోర్డులు విడివిడిగా పాల్గొంటాయి, ఈ వారాంతంలో సమావేశాలు జరుగుతాయి.

వెల్త్ మేనేజ్‌మెంట్ క్లయింట్లు క్రెడిట్‌ సూయిస్‌ బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోతున్నారని ఆ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్ చెప్పిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. UBS విలువ $56 బిలియన్‌ డాలర్లు కాగా, క్రెడిట్ సూయిస్‌ విలువ $7 బిలియన్‌ డాలర్లు. వీటి మధ్య విలీన చర్చల వల్ల ఇన్వెస్టర్లలో విశ్వాస పతనానికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ఈ చర్చలకు “ప్లాన్ A” అని పేరు పెట్టనట్లు తెలుస్తోంది.

అయితే, UBS గానీ, Credit Suisse గానీ ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించాయి.

సొసైటీ జనరల్‌, డ్యూయిష్‌ బ్యాంక్‌ సహా కనీసం నాలుగు ప్రధాన బ్యాంకులు క్రెడిట్ సూయిస్‌తో కొత్త లావాదేవీలపై పరిమితులను విధించాయని, ఇది ఈ బ్యాంక్ సమస్యలను పెంచిందని రాయిటర్స్ నివేదించింది. క్రెడిట్ సూయిస్ సెక్యూరిటీలతో లింక్ అయిన రుణాలను HSBC పరిశీలిస్తోందని కూడా రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది.

క్రెడిట్ సూయిస్ షేర్లు భారీగా పతనం
ఈ వారం ప్రారంభంలో, స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి క్రెడిట్‌ సూయిస్‌ 5400 మిలియన్‌ డాలర్ల (54 బిలియన్ డాలర్లు) రుణం తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఈ రూపంలో స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి జీవదానం దొరికినా, క్రెడిట్ సూయిస్ ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించడంతో సంస్థ షేర్లు ఆ భారాన్ని భరించవలసి వచ్చింది. శుక్రవారం కూడా క్రెడిట్ సూయిస్ షేర్లు 7 శాతం పడిపోయాయి. మొత్తంగా చూస్తే, ఈ వారంలో ఈ స్టాక్ 24 శాతం క్షీణతను నమోదు చేసింది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *