Akash, Isha, Anant Ambani Salary: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఓనర్ అయిన ముఖేష్ అంబానీ, కంపెనీ అభివృద్ధి కోసం 24×7 కష్టపడుతుంటారు. అయినా, కంపెనీ నుంచి ఆయన ఎటువంటి జీతం తీసుకోవడం లేదు. గత మూడు సంవత్సరాలుగా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే (zero salary) ముకేష్ అంబానీ పని చేస్తున్నారు. ఇప్పుడు, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య వారసులైన అతని ముగ్గురు పిల్లలు కూడా అదే బాటలో నడుస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ‘జీరో శాలరీ’తో పని చేస్తున్నారు. అంబానీ కుటుంబ వారసులైన ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ కూడా, తమ తండ్రి లాగానే జీతం తీసుకోకుండా పని చేయడానికి నిర్ణయించుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్, కమిటీ మీటింగ్స్ హాజరైనందుకు ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాలపై కమీషన్ మాత్రమే వాళ్లకు చెల్లిస్తారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీని కంపెనీ డైరెక్టర్ల బోర్డులో చేర్చేందుకు చేసిన తీర్మానంలో, ఆ ముగ్గురు జీరో శాలరీ తీసుకుంటారన్న విషయాన్ని చేర్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ప్రకటించింది. ఆకాష్, ఇషా, అనంత్ అంబానీ నియామకాలపై ఆమోదం కోరుతూ, తాజాగా, తన వాటాదార్లకు పోస్టల్ బ్యాలెట్‌లు పంపింది.
ఈ ఏడాది ఆగస్టు 28న జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో (RIL AGM), తన ముగ్గురు పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డులో చేర్చుకుంటున్నట్లు ఛైర్మన్ & CEO ముఖేష్ అంబానీ ప్రకటించారు. తాను మరో ఐదేళ్ల పాటు, అంటే 2029 ఏప్రిల్ 18 వరకు కంపెనీ ఛైర్మన్ & CEOగా కొనసాగుతానని కూడా అదే సమావేశంలో ముకేష్ అంబానీ ప్రకటించారు. విశేషం ఏంటంటే… ఈ ఐదేళ్ల కాలానికి కూడా (2029 ఏప్రిల్ 18 వరకు) జీరో జీతంతోనే ముకేష్ అంబానీ పని చేయనున్నారు. తనకు కమీషన్ కూడా వద్దని ముకేశ్ అంబానీ చేసిన రిక్వెస్ట్ ప్రకారం, 2024 ఏప్రిల్ 19 నుంచి 2029 ఏప్రిల్ 18 వరకు, జీతం & కమీషన్ రూపంలో ఆయనకు ఒక్క రూపాయిని కూడా కంపెనీ చెల్లించదు.
ముఖేష్ అంబానీ పిల్లలకు ఎంత ఫీజ్, కమీషన్ వస్తుంది?
ముకేశ్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ 2014లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టరుగా చేరారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్, కమిటీ మీటింగ్స్ హాజరైనందుకు సిట్టింగ్ ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాలపై కమీషన్‌ను ఆమెకు చెల్లించేలా ఆ నియామకం జరిగింది. అవే షరతులు ఆకాశ్, అనంత్, ఇషాకూ వర్తించనున్నాయి. 2022-23లో, బోర్డు సమావేశాలకు హాజరైనందుకు సిట్టింగ్ ఫీజ్ కింద రూ.6 లక్షలు, కమీషన్ రూపంలో మరో రూ.2 కోట్లను నీతా అంబానీ పొందారు. ఆకాశ్, అనంత్, ఇషాకు కూడా దాదాపు ఇదే అమౌంట్ అందే అవకాశం ఉంది. ప్రస్తుతం, నీతా అంబానీ బోర్డ్ డైరెక్టర్‌గా లేరు. వారసత్వ ప్రణాళికలో (succession planning) భాగంగా, డైరెక్టర్ పదవికి నీతా అంబానీ రిజైన్ చేశారు. అయితే బోర్డు సమావేశాలన్నింటికీ హాజరయ్యేలా ఆమెకు శాశ్వత ఆహ్వానితురాలు (permanent invitee) హోదా ఇచ్చారు.
ముఖేష్ అంబానీ పిల్లలు ఏ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు?
రిలయన్స్ టెలికాం బిజినెస్ అయిన జియో బాధ్యతలను ఆకాష్ అంబానీ తీసుకున్నారు. రిలయన్స్ రిటైల్ వ్యాపారమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌ను ఇషా అంబానీ చూసుకుంటున్నారు. అనంత్ అంబానీకి రిలయన్స్ ఎనర్జీ & పునరుత్పాదక ఇంధన వ్యాపారం లభించింది. వారసత్వ ప్రణాళిక ప్రకారం, తన పిల్లలందరికీ వ్యాపారంలోని వివిధ విభాగాలను ముఖేష్ అంబానీ విభజించి ఇచ్చారు. వచ్చే ఐదేళ్లపాటు కంపెనీ చైర్మన్‌గా కొనసాగుతూ, తన పిల్లలకు మార్గనిర్దేశం చేస్తారు.
మరో ఆసక్తికర కథనం: రూ.2 వేల రూపాయల నోట్ల మార్పిడికి 3 రోజులే మిగిలుంది, ఇంకా వేల కోట్లు తిరిగి రాలేదు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial