అదానీ షేర్లలో ఆగని బ్లడ్‌ బాత్‌, నెల రోజుల్లో ₹12 లక్షల కోట్ల వినాశనం

[ad_1]

Adani – Hindenburg: అదానీ గ్రూప్‌ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వేసిన బాంబ్‌ షెల్ వేడికి, కేవలం ఒక నెల రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 12 లక్షల కోట్లు ఆవిరైంది. అదానీ స్టాక్స్‌ వాటి 52 వారాల గరిష్ట స్థాయుల నుంచి 84% వరకు పడిపోయాయి. అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క నెలలో 62% తగ్గి రూ. 7.32 లక్షల కోట్లకు దిగి వచ్చింది.

2023 జనవరి 24న నివేదిక విడుదలైనప్పుడు, గౌతమ్‌ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్‌లో పతనం ఫలితంగా ఆయన వ్యక్తిగత సంపద కూడా హరించుకుపోయి, ఇప్పుడు 29వ స్థానానికి పడిపోయారు.

గరిష్ట స్థాయుల నుంచి గణనీయ పతనం
షేర్లను విడిడివిడిగా చూస్తే… అదానీ గ్రీన్ ఎనర్జీ స్క్రిప్‌ తన 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 84% పడిపోయి, మొత్తం గ్రూప్‌లో పరమ చెత్త పనితీరును ప్రదర్శించింది. ఈ కౌంటర్ ఈ రోజు (శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023) కూడా 5% నష్టంతో, రూ. 486.75 వద్ద లోయర్ సర్క్యూట్ పరిమితిలో ఆగిపోయింది. ఇది ఒక సంవత్సరం (52 వారాల) కొత్త కనిష్ట స్థాయి కూడా. 

అదానీ ట్రాన్స్‌మిషన్‌ కూడా తన ఒక సంవత్సర గరిష్ట స్థాయి నుంచి 83%, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు ఒక సంవత్సర గరిష్ట స్థాయి నుంచి 81% తగ్గాయి. ఇవాళ ఈ రెండు స్క్రిప్‌లు 5% లోయర్ సర్క్యూట్‌లలో లాక్ అయ్యాయి.

స్టాక్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో రూ. 20,000 కోట్ల FPOని ఉపసంహరించున్న గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ ఎంటిటీ అదానీ ఎంటర్‌ప్రైజెస్, తన 52 వారాల గరిష్ట స్థాయి విలువలో ఇప్పటి వరకు 67% కోల్పోయింది.

గ్రూప్ క్యాష్ కౌ అయిన అదానీ పోర్ట్స్ షేర్లు కూడా 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 43% నష్టపోయాయి. ఈ రోజు మాత్రం 1% పెరిగి రూ. 559 వద్ద ట్రేడవుతున్నాయి.

ఈ నెల రోజుల్లో హిండెన్‌బర్గ్ నివేదిక సృష్టించిన రగడ అంతా ఇంతా కాదు. ఈ విషయం మీద చర్చకు విపక్షాల పట్టుతో పార్లమెంటు మార్మోగిపోయింది. సుప్రీంకోర్టులోనూ చాలా కేసులు నమోదయ్యాయి, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

అదానీ గ్రూప్ స్టాక్స్‌ పతనం నేపథ్యంలో, మార్కెట్ అస్థిరత నుంచి పెట్టుబడిదార్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి, రెగ్యులేటరీ విధానాలను బలోపేతం చేయడానికి ఒక నిపుణుల కమిటీని తామే ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రకటించింది.

ఫలితాన్ని ఇవ్వని శాంతి ప్రయత్నాలు
బద్ధలైన అగ్నిపర్వతాన్ని శాంతింపజేయడానికి అదానీ గ్రూప్‌ కూడా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా… అదానీ గ్రూప్ కొన్ని రుణాలను ముందస్తుగా చెల్లించింది. కంపెనీల బ్యాలెన్స్ షీట్, బిజినెస్ మోడల్స్‌లో బలం గురించి వీలైనప్పుడల్లా మాట్లాడుతూ, ఇన్వెస్టర్ల బీపీని కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నిస్తోంది. గౌతమ్‌ అదానీ కూడా రంగంలోకి దిగి తన వంతు ప్రయత్నం చేశారు. 

అయితే, పెట్టుబడిదార్లకు అదానీ గ్రూప్‌ మీద నమ్మకం కనిపించడం లేదని పడిపోతున్న షేర్‌ ధరలు నిరూపిస్తున్నాయి. పడిపోతున్న కత్తుల్లాంటి అదానీ స్టాక్స్‌ను పట్టుకున్న ఇన్వెస్టర్లు కూడా తమ చేతులకు తీవ్ర గాయాలు చేసుకున్నారు.

గత నెల రోజుల్లో నిఫ్టీ 3% పైగా పతనమైంది. ఈ పాపంలో అదానీ సంక్షోభం కూడా ఒక కారణంగా మారింది. అదానీ కంపెనీలకు బ్యాంకులు అప్పులు ఇచ్చిన ఫలితంగా, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌ గత నెల రోజుల్లో 6% పైగా నష్టపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థపై బ్రోకరేజీలు, ఎనలిస్ట్‌లు సానుకూలంగా ఉన్నా ఇన్వెస్టర్లను భయం వదిలిపెట్టలేదు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *