అదానీ స్టాక్స్‌ మాత్రమే కాదు – ఈ షేర్లనూ రాజీవ్‌ జైన్‌ కొన్నారు, కోట్లు గడిస్తున్నారు

[ad_1]

Gautam Adani New Investor: జీక్యూజీ పార్టనర్స్‌ (GQG Partners) ప్రెసిడెంట్ & చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ (Rajiv Jain).. అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో గత వారం రూ. 15,446 కోట్ల పెట్టుబడులు పెట్టారు, అదే చేత్తో గౌతమ్‌ అదానీని సంక్షోభ సుడిగుండం నుంచి బయటకు లాగారు. వాస్తవానికి, ఈ ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌కు (FII) ఇండియన్‌ మార్కెట్‌ కొత్త కాదు. రెండు దశాబ్దాల క్రితం నుంచి రాజీవ్‌ జైన్‌కు ఇండియన్‌ మార్కెట్‌తో గట్టి పరిచయం ఉంది.

పెట్టుబడుల విషయంలో ఈ NRI ఇన్వెస్టర్‌ స్ట్రాటెజీని గమనిస్తే… ఒకరి సంక్షోభాన్ని తనకు అవకాశంగా మలుచుకుంటారు. ఒక మంచి కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు డేగలాగా వచ్చి వాలతారు, చాలా చౌకగా షేర్లను తన్నుకుపోతారు. అదానీ స్టాక్స్‌తో పాటు ITC కూడా ఇందుకు మంచి ఉదాహరణ.

1996లో ఐటీసీ షేర్లు కొనుగోలు
“మేము, మొదటిసారి, ITCని అర్ధవంతమైన ధర వద్ద కొనుగోలు చేశాం. 1996లో ఈ కంపెనీ పన్ను బకాయి రిస్క్‌లోకి వెళ్లింది. అప్పుడు ఆ స్టాక్ 35% క్షీణించింది. అప్పుడు ITC షేర్లు కొన్నాం, గత 2 దశాబ్దాలకు పైగా ITCని హోల్డ్‌ చేస్తున్నాం” – రాజీవ్‌ జైన్‌

GQG Partnersకు, 2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి ITCలో 1.29% వాటా ఉంది. 2020 తర్వాత ఈ స్టాక్‌ మల్టీబ్యాగర్‌గా మారింది. గత ఏడాది కాలంలో 70 శాతానికి పైగా పెరిగింది.

2004 ఎన్నికల సమయంలో మార్కెట్ పతనమైన సమయంలో, 1998లో భారతదేశంపై అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో జైన్‌ విపరీతంగా షాపింగ్‌ చేశారు.

అదానీ గ్రూప్‌ విషయానికి వస్తే… అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 3.4% వాటాను ఒక్కో షేరుకు రూ. 1,410.86 ధర వద్ద GQG పార్ట్‌నర్స్‌ కొనుగోలు చేసింది. అదానీ పోర్ట్స్‌లో 4.1% వాటాను ఒక్కో షేర్‌కు రూ. 596.2 ధర వద్ద, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.5% వాటాను ఒక్కో షేరుకు రూ. 504.6 ధర వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీలో 3.5% వాటాను ఒక్కో షేరుకు రూ. 668.4 ధర వద్ద దక్కించుకుంది. ఇవి చాలా చౌక ధరలు. ఈ 4 కౌంటర్ల కోసం రూ. 15,446 కోట్లను వెచ్చించగా, ఈ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీ కారణంగా, ఆ తర్వాత రెండు రోజుల్లోనే GQG పార్టనర్స్ పెట్టుబడి విలువ రూ. 18,548 కోట్లకు పెరిగింది. కేవలం రెండు రోజుల్లోనే రూ. 3,100 కోట్ల లాభాన్ని జైన్‌ సంపాదించారు. 

హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత అన్ని అదానీ స్టాక్‌ల మార్కెట్ విలువ సగానికి పైగా తగ్గిన సమయంలో అదానీ గ్రూప్‌- GQG పార్టనర్స్‌ డీల్ జరిగింది.

అదానీ గ్రూప్‌ ఆదాయాలకు మరో కనీసం 20 సంవత్సరాల వరకు ఢోకా లేదన్న నమ్మకంతో ఆ గ్రూప్‌పై పందెం కాసినట్లు రాజీవ్‌ జైన్ చెప్పారు. గౌతమ్ అదానీ గ్రూప్‌ను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నానని, ఈ గ్రూప్‌ కంపెనీలకు అద్భుతమైన దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఉన్నాయని, గతంలో స్టాక్‌ వాల్యూయేషన్లు ఎక్కువగా ఉండడం వల్ల దూరంగా ఉన్నానని రాజీవ్‌ జైన్‌ చెప్పారు. అదానీ స్టాక్స్‌ క్రాష్ వల్ల, ఆకర్షణీయమైన ధర వద్ద “అద్భుతమైన ఆస్తులను” పొందినట్లు జైన్ చెప్పుకొచ్చారు. 

రాజీవ్‌ జైన్ కొన్న ఇతర ఇండియన్‌ స్టాక్స్‌… హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *