ఆ విషయంలో అంబానీ కంటే ముందున్న జుకర్‌బర్గ్‌, టైమ్‌ వస్తే ఎవర్నీ ఆపలేం!

[ad_1]

Mark Zuckerberg Networth: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (Facebook) సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. వాస్తవానికి… గత కొన్ని సంవత్సరాల్లో జుకర్‌బర్గ్‌ సంపద విలువ (Mark Zuckerberg Assets Value) గణనీయంగా క్షీణించింది, ప్రపంచంలోని టాప్‌-10 మంది ధనవంతుల జాబితా నుంచి కిందకు పడిపోయారు. ఇప్పుడు మళ్లీ సంపద పెరగడం ప్రారంభించింది. తాజాగా, భారతదేశంలో & ఆసియాలో అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ కంటే ఒక మెట్టు పైకి ఎక్కారు.           

12వ అత్యంత ధనవంతుడు
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం, మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుత నికర విలువ 87.3 బిలియన్‌ డాలర్లు. ఈ ఆస్తి విలువతో, బ్లూమ్‌బెర్గ్ జాబితాలో, ప్రపంచంలో 12వ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అంతకుముందు ఇదే స్థానంలో ఉన్న భారతీయ బిలియనీర్‌ ముకేశ్ అంబానీని కిందకు నెట్టారు. ముకేష్‌ అంబానీ ప్రస్తుత నికర విలువ ‍‌(Mukesh Ambani Networth) 82.4 బిలియన్ డాలర్లు. ప్రపంచ సంపన్నుల జాబితాలో అంబానీ ఇప్పుడు 13వ స్థానంలో ఉన్నారు.

మరోవైపు, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడి ప్రస్తుత నికర విలువ $84.9 బిలియన్లు. ఈ జాబితా ప్రకారం, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ర్యాంకుల్లో 14వ స్థానంలో నిలిచారు.            

ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే      
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల గురించి మాట్లాడుకుంటే, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) $208 బిలియన్ల నికర విలువతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk), $162 బిలియన్ల ఆస్తులతో ప్రపంచంలోని రెండో అత్యంత సంపన్న వ్యక్తి. అమెజాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జెఫ్ బెజోస్ (Jeff Bezos) $133 బిలియన్ల సంపదతో మూడో స్థానంలో, బిల్ గేట్స్ $122 బిలియన్లతో నాలుగో ప్లేస్‌లో, వెటరన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ $115 బిలియన్లతో ఐదో స్థానంలో ఉన్నారు. ఆరు, ఏడవ స్థానాలను ఆక్రమించిన లారీ ఎల్లిసన్, స్టీవ్ బాల్మెర్ నికర విలువ కూడా $100 బిలియన్‌ల కంటే ఎక్కువగా ఉంది.             

మెటా సంపద పెరిగింది     
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta), 2023 సంవత్సరం మొదటి త్రైమాసికంలో ‍‌(జనవరి-మార్చి కాలం) అద్భుతమైన ఆర్థిక ఫలితాల గణాంకాలను విడుదల చేసింది. ఈ కాలంలో మెటా ఆదాయం 3 శాతం పెరిగి $28.65 బిలియన్లకు చేరుకుంది. మార్కెట్ అంచనాల కంటే ఈ ఫలితం మెరుగ్గా ఉంది. దీంతో పాటు, ఫేస్‌బుక్‌ రోజువారీ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది. ఈ గణాంకాలు మెటా షేర్లను అమాంతం పెంచాయి, ఈ కారణంగా మార్క్‌ జుకర్‌బర్గ్ నికర విలువ కూడా ఒక్కసారిగా పెరిగింది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, గత 24 గంటల్లో, జుకర్‌బర్గ్ నికర విలువ 10.1 బిలియన్ డాలర్లు లేదా 13.57 శాతం పెరిగింది.               

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *