[ad_1]
Demat Account Nomination: డీమ్యాట్ ఖాతాదార్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదార్ల ఖాతాల్లో నామినేషన్‌ను సెబీ తప్పనిసరి చేసింది. గడువు దగ్గర పడుతున్నా, ఇప్పటికీ ప్రతి నలుగురిలో ముగ్గురి డీమ్యాట్ ఖాతాల్లో నామినీ పేరు లేదు.
డీమ్యాట్ ఖాతాల్లో నామినేషన్ పరిస్థితి
నామినేషన్‌కు సంబంధించి ఒక కన్సల్టేషన్ పేపర్‌ను సెబీ విడుదల చేసింది. దాని ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 13 కోట్ల 64 లక్షల సింగిల్ డీమ్యాట్ ఖాతాల్లో.. 9.8 కోట్లలో, అంటే 72.48 శాతం డీమ్యాట్ ఖాతాల్లో నామినేషన్ వివరాలు లేవు. 69.73 శాతం, అంటే 9.51 కోట్ల మంది డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు ఉద్దేశపూర్వకంగా నామినీ సమాచారం ఇవ్వలేదు. 2.76 శాతం, అంటే 37 లక్షల 58 వేల మంది డీమ్యాట్ ఖాతాదార్లు గందరగోళంలో ఉన్నారు. వీళ్లు నామినీ పేరును జోడించనూ లేదు, నామినేషన్ నుంచి వైదొలగనూ లేదు.
మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్ స్థితి
మన దేశంలో 8.9 కోట్ల సింగిల్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు ఉంటే.. 85.82 శాతం, అంటే 7 కోట్ల 64 లక్షల ఫోలియోల్లో నామినీలు చేయబడ్డారు. మిగిలిన 14.18 శాతం అంటే 1.26 కోట్ల ఫోలియోల్లో నామినేషన్ నుంచి దూరంగా ఉండాలనే ఆప్షన్ ఎంచుకున్నారు లేదా గందరగోళంలో ఉన్నారు.
డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ రెండింటి విషయంలో, నామినీ వివరాలను ఉద్దేశపూర్వకంగా ఇవ్వకూడదనుకునే వ్యక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో.. నామినేషన్ నుండి వైదొలిగిన వాళ్లు ఉన్నారు, నామినీ ఉండాలనే విషయం కూడా తెలియని వ్యక్తులు కూడా ఉన్నారు.
డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్ నామినేషన్ అంటే ఏంటి?
షేర్లు లేదా మ్యూచుల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, అతని పెట్టుబడులను నిర్వహించే/వెనక్కు తీసుకునే వ్యక్తిని సూచించడమే నామినేషన్. ఇక్కడ కుటుంబ సభ్యుల పేర్లు లేదా సన్నిహితుల పేర్లను చేర్చవచ్చు. నిబంధనల ప్రకారం కొత్త డీమ్యాట్ ఖాతా లేదా మ్యూచువల్ ఫండ్‌లో నామినేషన్ తప్పనిసరి. మీకు నామినీ వద్దనుకుంటే, మీ ఫారంలో ‘నామినేషన్ వద్దు’ అన్న అప్షన్ ఎంచుకోవాలి. గతంలో, నామినేషన్ తప్పనిసరి కాదు. దీని వల్ల మెజారిటీ అకౌంట్లలో నామినేషన్ లేకుండాపోయింది.
నామినేషన్ లేకపోతే నష్టం ఏంటి?
ఒకవేళ పెట్టుబడిదారు మరణించిన సందర్భంలో… అతని ఖాతాలో నామినీ పేరు ఉంటే, పెట్టుబడి డబ్బంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అతి తక్కువ సమయంలో, చాలా సులభంగా నామినీకి అందుతుంది. నామినీ పేరు లేకపోతే.. మరణించిన వ్యక్తికి చట్టబద్ధమైన వారసుడు ముందుకు వచ్చి, తన అర్హతను నిరూపించుకోవాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఖాతాలో నామినీ పేరును ఎలా చేర్చాలి?
ఇది చాలా సులభమైన పని. ఆఫ్‌లైన్ & ఆన్‌లైన్ రెండింటిలోనూ మ్యూచువల్ ఫండ్స్‌కు నామినీని యాడ్ చేయవచ్చు. ఆఫ్‌లైన్ మోడ్‌లో, సంబంధిత ఫారంలో నామినీ వివరాలు నింపి, ఫండ్ హౌస్‌కు పంపొచ్చు. ఆన్‌లైన్ మోడ్‌లో.. CAMS వెబ్‌సైట్ www.camsonline.com లోకి వెళ్లి, ‘ఎంఎఫ్ ఇన్వెస్టర్స్’ ఎంచుకోండి. ఆ తర్వాత, ‘నామినేట్ నౌ’ ఎంపికపై క్లిక్ చేసి, పాన్ (PAN) నమోదు చేయాలి. ఇప్పుడు మీ మ్యూచువల్ ఫండ్స్ ఖాతాల వివరాలు కనిపిస్తాయి. ఖాతాపై క్లిక్ చేసి, నామినీ పేరును నమోదు చేయొచ్చు. ఇప్పటికే ఒక పేరు ఇస్తే దానిని మార్చవచ్చు లేదా తొలగించవచ్చు. మీ మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేయవచ్చు.
డీమ్యాట్ ఖాతాలో నామినీని ఎలా అప్‌డేట్ చేయాలి?
డీమ్యాట్ ఖాతాలో నామినీని అప్‌డేట్ చేయడానికి, NSDL వెబ్‌సైట్ https://nsdl.co.in/ లోకి వెళ్లి ‘డీమ్యాట్ నామినీ ఆన్‌లైన్’పై క్లిక్ చేయండి. DP ID, క్లయింట్ ID, పాన్ నమోదు చేసిన తర్వాత, డీమ్యాట్ ఖాతాలో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నామినీ వివరాలను నింపొచ్చు. మీ బ్రోకింగ్ కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేయవచ్చు.
నామినీని యాడ్ చేయడానికి తుది గడువు ఎప్పుడు?
మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల్లో నామినేషన్ కోసం గడువు వచ్చే నెలలోనే (మార్చి) ముగుస్తుంది. అయితే, ఆ తేదీని జూన్ 30 వరకు సెబీ పొడిగించింది. ఈ గడువులోగా పని పూర్తి చేయకపోతే.. ఆ వ్యక్తి డీమ్యాట్ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయలేరు. డీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్‌లో మాత్రమే కాకుండా.. బ్యాంక్ ఖాతా, ఎఫ్‌డీ, ప్రావిడెంట్ ఫండ్, బీమా పాలసీల్లోనూ నామినేషన్ ఇవ్వడం చాలా అవసరం.
మరో ఆసక్తికర కథనం: హయ్యర్ పెన్షన్ టెన్షన్, వాళ్ల బీపీ పెంచకండయ్యా బాబూ!
[ad_2]
Source link
Leave a Reply