[ad_1]
E-rupee In Circulation: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ మారుతోంది. డిజిటల్ రూపంలో చేసే నగదు చెల్లింపుల్లో డిజిటల్ రూపాయి లేదా ఈ-రూపాయి (E-rupee) లావాదేవీలు ఉత్సాభరితంగా సాగుతున్నాయి. 2023 ఫిబ్రవరి 28 వరకు, పైలట్ ప్రాతిపదికన, మన దేశంలో రూ. 130 కోట్ల విలువైన ఈ-రూపాయలు చెలామణిలో ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (FM Nirmala Sitharaman) వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హోల్‌సేల్ సెగ్మెంట్ కోసం 1 నవంబర్ 2022న డిజిటల్ రూపాయిని (e₹-W) జారీ చేసింది. ఆ తర్వాత, 1 డిసెంబర్ 2022న రిటైల్ సెగ్మెంట్ కోసం ఈ-రూపాయలను (e₹-R) చెలామణీలోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం, తొమ్మిది బ్యాంకులు డిజిటల్ రూపాయి హోల్‌సేల్ పైలట్ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్నాయని ఆర్థిక మంత్రి చెప్పారు. అవి… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ.
రిటైల్ సెగ్మెంట్ కోసం 4.14 కోట్ల e₹-Rలు జారీ
లోక్‌సభలో రాతపూర్వక సమాధానం రూపంలో నిర్మల సీతారామన్ వెల్లడించిన వివరాల ప్రకారం… మొత్తం డిజిటల్ రూపాయిల్లో రిలైట్ ఈ-రూపాయల వాటా చాలా తక్కువగా ఉంది. 2023 ఫిబ్రవరి 28 నాటికి, దేశంలో చలామణీలో ఉన్న రూపాయిల్లో రిటైల్ ఈ-రూపాయల (e₹-R) విలువ రూ. 4.14 కోట్లు కాగా… హోల్‌సేల్ ఈ-రూపాయల (e₹-W) విలువ రూ. 126.27 కోట్లుగా ఉంది.
ఈ-రూపీ అంటే ఏంటి?
e₹-R అనేది చట్టపరమైన టెండర్‌ను సూచించే డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. అంటే, దీనికి చెల్లుబాటు ఉందని అర్ధం. భారతదేశ రూపాయికి ఇది సమానం. ప్రస్తుతం కాగితం కరెన్సీ & నాణేలను జారీ చేసిన డినామినేషన్లలోనే ఈ-రూపాయలు జారీ చేస్తున్నారు.
అర్హత కలిగిన బ్యాంకుల ద్వారా ఈ-రూపాయల పంపిణీ జరుగుతోంది. ఈ బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా e₹-R లావాదేవీలు చేయవచ్చు, మొబైల్ ఫోన్‌లు, వాలెట్, పరికరాల్లో నిల్వ చేసుకోవచ్చు. వినియోగదార్లు ఏ దుకాణం లేదా వ్యక్తులకు ఈ-రూపాయిల్లో చెల్లింపులు చేయవచ్చు, స్వీకరించవచ్చు.
ఈ-రూపీని ఎక్కడ ఖర్చు చేయవచ్చు?
పైలెట్ ప్రాజెక్ట్ నడుస్తోంది కాబట్టి, క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లోని 5 ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే ప్రస్తుతం e₹-R లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనే పర్సన్ టు పర్సన్ (P2P), పర్సన్ టు మర్చంట్ (P2M) లావాదేవీలకు అనుమతి ఇచ్చారు. ఈ 5 ప్రాంతాల్లోని టీ దుకాణాలు, పండ్ల దుకాణాలు, వీధి వ్యాపారాలు, చిన్న దుకాణాలు మొదలైన అన్ని చోట్లా ఈ-రూపాయిని ఉపయోగించవచ్చు. ఇంకా, రిటైల్ చైన్‌లు, పెట్రోల్ పంపులు కూడా ఈ-రూపాయలను అంగీకరిస్తున్నాయి. కొంతమంది ఆన్‌లైన్ వ్యాపారులు కూడా వినియోగదార్ల సౌలభ్యం కోసం డిజిటల్ రూపాయిల్లో చెల్లింపులను అంగీకరిస్తున్నారు. ఈ 5 ప్రాంతాల్లోని అనుభవాల తర్వాత, ఏమైనా మార్పులు ఉంటే చేసి, దేశవ్యాప్తంగా క్రమంగా e₹-R లావాదేవీలను అమలులోకి తీసుకువస్తారు.
[ad_2]
Source link
Leave a Reply