జనం బంగారం కొనడం మానుకుంటున్నారు, రీజన్‌ ఇదే!

[ad_1]

Gold Demand in India: కొన్నాళ్ల క్రితం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేటు రికార్డ్‌ స్థాయికి వెళ్లింది. మన దేశంలోనూ, 10 గ్రాముల స్వచ్ఛమైన (24 క్యారెట్లు) పసిడి ధర రికార్డ్‌ రేంజ్‌లో రూ. 64,000 పలికింది. బంగారం ధర సామాన్యుడు భరించలేని స్థాయిలోకి పెరిగినప్పటి నుంచి, ఇండియన్‌ మార్కెట్లో గోల్డ్‌ డిమాండ్ తగ్గడం ప్రారంభమైంది. 

బంగారం కొనేందుకు జంకుతున్న జనం!
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) రిపోర్ట్‌ ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మన దేశంలో బంగారం డిమాండ్ (India Gold Demand in Q2) 7 శాతం తగ్గింది, 158.1 టన్నులకు పరిమితమైంది. ఏప్రిల్-జూన్‌ కాలంలో పెళ్లిళ్ల సీజన్‌ ఉన్నా, కొండెక్కి కూర్చున్న స్వర్ణాన్ని అందుకోవడం సగటు భారతీయుడి వల్ల కాలేదు. అందువల్లే సామాన్య వినియోగదార్లు బంగారం షాపులకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు, ప్రభుత్వం అనుసరిస్తున్న పన్నుల విధానం కారణంగానూ గోల్డ్‌ డిమాండ్ దెబ్బతింది. రిజర్వ్‌ బ్యాంక్‌, 2 వేల రూపాయల నోట్లను చలామణి నుంచి వెనక్కు తీసుకున్న తొలి రోజుల్లో, పింక్‌ నోట్లతో ఎల్లో మెటల్‌ను బాగానే కొన్నారు. అయితే, చాలా తక్కువ సమయంలోనే ఆ ఉత్సాహం చల్లబడింది.

విచిత్రంగా, డిమాండ్‌ తగ్గినా ఇండియాలోకి గోల్డ్ ఇంపోర్ట్స్‌ మాత్రం పెరిగాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత్‌లోకి బంగారం దిగుమతులు 16 శాతం పెరిగి 209 టన్నులకు చేరాయి. త్వరలో పండుగల సీజన్‌ ప్రారంభం అవుతుంది. అప్పటికి ఉండే డిమాండ్‌, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందే గోల్డ్‌ ఇంపోర్ట్‌ చేసుకుని, నిల్వ చేస్తున్నారు. ప్రపంచంలో, బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది.

WGC ప్రకారం, FY2023 మొదటి ఆరు నెలల్లో దేశంలో బంగారం గిరాకీ దాదాపు 271 టన్నులుగా ఉండొచ్చు. మొత్తం సంవత్సరానికి ఈ డిమాండ్‌ 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకు చేరొచ్చని అంచనా. 

అప్పుడు అలా – ఇప్పుడు ఇలా
2022 ఏప్రిల్-జూన్ కాలంలో దేశంలో గోల్డ్‌ డిమాండ్‌ 170.7 టన్నులుగా ఉంది. ఈ ఏడాది అదే కాలంలో పసిడి గిరాకీ 7 శాతం క్షీణించి 158.1 టన్నులకు దిగి వచ్చింది. డిమాండ్ తగ్గినా, బంగారం కొనుగోళ్ల మొత్తం విలువ మాత్రం పెరిగింది.  గత ఏడాది జూన్‌ క్వార్టర్‌లో, 170.7 టన్నుల కోసం జనం రూ. 79,270 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది జూన్‌ క్వార్టర్‌లో 158.1 టన్నుల కోసమే రూ. 82,530 కోట్లు పే చేశారు. ఈ ప్రకారం, గోల్డ్‌ పర్చేజ్‌ వాల్యూ 4 శాతం పెరిగింది. 

ఆభరణాల లెక్కలు
జూన్‌ త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్‌ కూడా 8 శాతం తగ్గింది. గత సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ కాలంలో 140.3 టన్నుల సేల్స్‌ జరిగితే, ఈ ఏడాది అదే కాలంలో 128.6 టన్నులు మాత్రమే అమ్ముడయ్యాయి. నాణేలు, బిస్కట్ల గిరాకీ గత ఏడాది జూన్‌ క్వార్టర్‌లోని 30.4 టన్నుల నుంచి ఈ ఏడాది జూన్‌ క్వార్టర్‌లో 29.5 టన్నులకు తగ్గింది, ఇది 3 శాతం క్షీణత. 

18 క్యారెట్ల జ్యువెలరీకి పెరుగుతున్న డిమాండ్
బంగారం రేట్లు విపరీతంగా పెరగడంతో ఆ ఎఫెక్ట్‌ బంగారం స్వచ్ఛతపై కూడా పడింది. ప్రజలు 18 క్యారెట్ల బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారని WGC రిపోర్ట్‌ ద్వారా తెలుస్తోంది. 18 క్యారెట్ల ఆభరణాల రేట్లు అందుబాటులో ఉండడమే దీనికి కారణం. 

రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినా, సౌత్‌ ఇండియాలో ఇప్పటికీ సరైన వానలు లేవు. వ్యవసాయ రంగానికి అనుకూలంగా వర్షాలు కురిస్తే, దీపావళి నాటికి దేశంలో గోల్డ్‌ డిమాండ్‌ పెరుగుతుందన్నది WGC అంచనా. 

మరో ఆసక్తికర కథనం: తగ్గిన పసిడి కాంతి – ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *