ట్రెండ్‌ సెట్‌ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌, రికార్డు స్థాయిలో ₹14 వేల కోట్ల ‘SIP’లు

[ad_1]

Mutual Fund SIP Inflows: మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (AMFI) విడుదల చేసిన డేటా ప్రకారం.. మార్చి నెలలో SIP (Systematic Investment Plan) ద్వారా పెట్టుబడులు, ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోస్‌ రికార్డు స్థాయిలో పెరిగాయి. 

స్టాక్‌ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (SIP) ద్వారా నెలవారీ పెట్టుబడులను రిటైల్‌ ఇన్వెస్టర్లు పెంచారు. 2023 మార్చిలో తొలిసారిగా రూ. 14,000 కోట్ల మార్కును SIPలు దాటాయి. ఇదే కాకుండా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి (equity mutual funds) వచ్చే పెట్టుబడులు 31 శాతం పెరిగాయి.

SIP ఇన్‌ఫ్లోస్‌ ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్‌ను సృష్టిస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఈ మొత్తం రూ. 13,686 కోట్లుగా నమోదు కాగా, మార్చి నెలలో రూ. 14,276 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో.. నికర బాండ్‌ ఫండ్స్‌ లేదా డెట్ ఫండ్స్‌ ఔట్ ఫ్లో 311 శాతం పెరిగి రూ. 13,815 కోట్ల నుంచి ఒక్కసారే రూ. 56,884 కోట్లకు చేరింది. లార్జ్ క్యాప్ ఫండ్స్‌, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్, ELSS ఫండ్స్‌ రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి పెద్ద సంఖ్యలో ఇన్‌ఫ్లోలు వచ్చాయి.

ఏ ఫండ్‌లోకి అత్యధిక ఇన్‌ఫ్లో?
ఫిబ్రవరి నెలలో లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోస్‌ రూ. 353 కోట్లు కాగా, మార్చి నెలలో దాదాపు 3 రెట్లు పెరిగి రూ. 911 కోట్లకు చేరింది. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌లోకి ఫిబ్రవరిలో రూ. 47.9 కోట్లు రాగా, మార్చి నెలలో రూ. 3715 కోట్లు వచ్చాయి. అదేవిధంగా, ELSS (Equity Linked Saving Scheme) ఫండ్స్‌లోకి రూ. 981 కోట్ల నుంచి రూ. 2,685 కోట్లకు పెరిగాయి. 

ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నికర ఇన్‌ఫ్లోస్‌ భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలోని రూ. 6,244 కోట్ల నుంచి మార్చిలో రూ. 27,228 కోట్లకు ఈ పెట్టుబడులు పెరిగాయి, ఇది ఏకంగా 336 శాతం వృద్ధి. 

SIP ఖాతాల సంఖ్య రెట్టింపు
2020 మార్చిలో కేవలం 3 కోట్ల SIP ఖాతాలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు ఈ ఖాతాలు రెండింతలు పెరిగాయి. ప్రస్తుతం మొత్తం రిజిస్టర్డ్ ఖాతాలు 6.4 కోట్లు. ఇందులో, 2023 మార్చిలో 22 లక్షల ఖాతాలు కొత్తగా యాడ్‌ అయ్యాయి. మార్చి నెలలో ఓపెన్-ఎండ్ స్కీమ్‌ల ద్వారా 24 న్యూ ఫండ్ ఆఫర్‌లు, 21 క్లోజ్డ్-ఎండ్ స్కీమ్‌లు ప్రారంభమయ్యాయి.

2 లక్షల కోట్ల నికర ఇన్ ఫ్లో
FY23లో మార్కెట్‌లో అస్థిరత ఉన్నా, ఆ ఏడాదిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నికరంగా రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2023 మార్చిలో కార్పొరేట్ బాండ్ పథకాల్లోకి 15,600 కోట్లు, బ్యాంకింగ్ & పిఎస్‌యుల్లోకి రూ. 6,500 కోట్లు, డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోకి రూ. 5,661 కోట్లు వచ్చాయి.

డెట్‌ ఫండ్‌ స్కీమ్‌లు
లిక్విడ్ ఫండ్స్‌ నుంచి రూ. 56,924 కోట్లు బయటకు వెళ్లిపోగా, మనీ మార్కెట్ ఫండ్స్‌ నుంచి ఔట్‌ ఫ్లో రూ. 11,421 కోట్లుగా నమోదైంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *