[ad_1]
Coin Deposit in Bank Rules: ప్రస్తుతం, రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుంచి వెనక్కు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించడంతో, ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకుంటున్నారు లేదా ఖాతాల్లో జమ చేస్తున్నారు. 2 వేల రూపాయల నోట్లను అకౌంట్‌లో డిపాజిట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ కొత్తగా రూల్స్ ఏమీ పెట్టలేదు, ఆ ఖాతాకు వర్తించే పాత నిబంధనలే ఇప్పుడూ వర్తిస్తాయి. అదే సమయంలో, ఒక లావాదేవీలో గరిష్టంగా 10 రెండు వేల రూపాయల నోట్లు లేదా రూ. 20 వేల విలువైన నోట్లను చిన్న నోట్లలోకి మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
రూ. 2 వేల నోట్ల సంగతి అటుంచి నాణేల గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీ దగ్గర పెద్ద మొత్తంలో నాణేలు/కాయిన్స్ పోగుపడి, వాటిని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని మీరు అనుకుంటే, దానికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు ఒకేసారి ఎన్ని నాణేలు లేదా ఎంత విలువైన నాణేలను మీ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేయవచ్చో తెలుసా?
ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు, ఇరవై రూపాయల నాణేలు ప్రస్తుతం భారత మార్కెట్లో చెలామణిలో ఉన్నాయి. అయితే డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాక ఈ నాణేల వినియోగం చాలా వరకు తగ్గింది. గతంలో చిల్లర సమస్య అతి పెద్ద తలనొప్పిగా ఉండేది. ఇప్పుడు, ఒక్క 10 రూపాయలు చెల్లించాలన్నా చాలా మంది UPI ద్వారానే పంపుతున్నారు. దీంతో, చిల్లర సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ నేపథ్యంలో, మార్కెట్‌లో నాణేలు తక్కువగా కనిపిస్తున్నాయి.
ఎంత విలువ గల నాణేలను విడుదల చేయవచ్చు?
ప్రస్తుతం మార్కెట్‌లో చలామణీలో ఉన్న నాణేలన్నీ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసినవే. నాణేల చట్టం 2011 ప్రకారం, రూ. 1000 విలువ కలిగిన నాణేల వరకు రిజర్వ్ బ్యాంక్ జారీ చేయవచ్చు. అయితే… ఒక ఏడాదిలో ఆర్‌బీఐ ఎన్ని నాణేలు ముద్రించాలనే విషయాన్ని భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒకవేళ ఒక కొత్త కాయిన్ రిలీజ్ చేయాలని నిర్ణయిస్తే, ఆ నాణెం విలువను నిర్ణయించి, దాని డిజైన్‌ను సిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పుడు చలామణిలో ఉన్న నాణేల రూపకల్పన మొత్తం భారత ప్రభుత్వం చేతుల మీదుగానే జరిగింది.
బ్యాంకు ఖాతాలో ఎన్ని నాణేలు డిపాజిట్ చేయవచ్చు?
బ్యాంక్ ఖాతాలో ఎన్ని నాణేలు డిపాజిట్ చేయవచ్చన్న అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి పరిమితిని విధించలేదు. అంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎన్ని నాణేలైనా డిపాజిట్ చేయవచ్చు. ఖాతాదారు ఎన్ని నాణేలను తీసుకువచ్చినా సంబంధిత బ్యాంక్ తీసుకోవాల్సిందే. అయితే, అవన్నీ ప్రస్తుతం మార్కెట్‌లో చెల్లుబాటు అయ్యే నాణేలు అయి ఉండాలన్నది సెంట్రల్ బ్యాంక్ పెట్టిన రూల్. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం, చెల్లుబాటు అయ్యే నాణేలను డిపాజిట్ చేసుకోవడానికి ఏ బ్యాంక్ కూడా తిరస్కరించకూడదు. ఒకవేళ, చెల్లుబాటు అయ్యే నాణేలను తీసుకోవడానికి ఏ బ్యాంక్ అయినా ఒప్పుకోకపోతే, ఆ బ్యాంక్ గురించి RBI పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
[ad_2]
Source link
Leave a Reply