మహిళల కోసం గోల్డెన్‌ టిప్స్‌ – బంగారం, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌ – ఎక్కడ పెట్టుబడి పెట్టాలి

[ad_1]

Investment Tips for Women: మహిళలు ఒక కుటుంబాన్నే కాదు, దేశాన్ని కూడా నిర్వహించగల సమర్థులు. పెద్ద కంపెనీల బాధ్యతలను భుజానకెత్తుకుంటూ, ప్రతి రంగంలోనూ తనని తాను నిరూపించుకున్నారు. ఈ కామెంట్‌ మీద ఎవరికైనా డౌట్స్‌ ఉంటే, చాలా లైవ్‌ ఎగ్జాంపుల్స్‌ చూపించొచ్చు. అయితే, ఇప్పటికీ చాలా ఇళ్లలో డబ్బు/పెట్టుబడుల నిర్వహణలో స్త్రీలను దూరంగా ఉంచుతున్నారు. దీనికి కారణం పురుషాధిక్యత. మగువల కంటే తాము మెరుగైన పెట్టుబడిదార్లమని మగవాళ్లు భావిస్తారు. 

వాస్తవానికి, జెండర్‌ను బట్టి ఎవరూ జెమ్‌ కాలేరు. విజయవంతమైన పెట్టుబడిదారుగా మారడానికి క్రమశిక్షణ, అవగాహన, ఏకాగ్రత, సహనం, కృషి వంటి లక్షణాలు అవసరం. చాలా మంది స్త్రీలకు ఈ లక్షణాలు ఉంటాయి. కాబట్టి, ‘ఆమె’ మంచి పెట్టుబడిదారుగా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. 

మరో నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ కచ్చితంగా ఉహించలేరు. అలాంటిది.. మరో గంటలో, ఒక రోజు తర్వాత, భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?. కోలుకోనీయని కష్టాలు ఏ సమయంలోనైనా కుటుంబాన్ని ఢీకొట్టవచ్చు. కాబట్టి, మహిళలు కూడా ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండటం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించడం గొప్ప కాదు. దానిని ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడమే అసలైన సంపాదన. పురుషుల కంటే స్త్రీల సగటు వయస్సు ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల.. మహిళల పేరిట తగినన్ని పెట్టుబడులు, ఆస్తులు ఉండటం చాలా ముఖ్యం.

సాధారణంగా, మహిళలకు పొదుపుపై శ్రద్ధ ఎక్కువ. అయితే.. పొదుపుతోనే సరిపెట్టకుండా, అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టాలి. ద్రవ్యోల్బణం వల్ల డబ్బు విలువ కాలక్రమేణా తగ్గుతుంది. అందువల్ల, ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి ఇచ్చే పెట్టుబడులు పెట్టడం, అధిక రాబడి రాబట్టడం కీలకం.

బ్యాంక్‌, పోస్టాఫీస్‌ స్కీమ్‌లు ‍‌(Bank and Post Office Schemes)
పెట్టుబడికి బ్యాంకులు, పోస్టాఫీసులు మంచి ఆప్షన్‌. వీటిలో రాబడి తక్కువే అయినా, రిస్క్ కూడా అతి స్వల్పంగా ఉంటుంది. ప్రస్తుతం, మహిళ సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ స్కీమ్‌ మీద 7.50% వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తున్నారు. స్టేట్‌ బ్యాంక్‌ సహా బ్యాంక్‌లు గరిష్ట వడ్డీ రేటుతో ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ రన్‌ చేస్తున్నాయి. వాటిలో చాలా స్కీమ్‌ల్లో చేరేందుకు గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది.

బంగారం, రియల్ ఎస్టేట్‌ (Gold and Real Estate)
బంగారం, స్థిరాస్తిలోనూ మహిళలు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే.. రియల్ ఎస్టేట్ నుంచి రాబడి పొందడానికి చాలా సమయం పడుతుంది. భౌతిక బంగారం విషయంలో స్వచ్ఛత సమస్యలు ఉంటాయి. ఫిజికల్‌ గోల్డ్‌ కాకుండా, ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు. దీనికోసం సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (SGB), గోల్డ్‌ ETFs వంటివి పరిగణనలోకి తీసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) 
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కూడా ఉత్తమ మార్గమే. MFs ఏకమొత్తంగా డబ్బు మదుపు చేయవచ్చు, లేదా నెలనెలా కొంతమొత్తం చొప్పున (SIP) జమ చేయవచ్చు. మహిళలకు ఇది చాలా సులభమైన పెట్టుబడి ఎంపిక. మ్యూచువల్‌ ఫండ్స్‌లో… ఈక్విటీ ఫండ్స్‌లో రిస్క్-రిటర్న్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంత రిస్క్‌ వద్దనుకుంటే, హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌ దీర్ఘకాలికమైనవి, డెట్ ఫండ్‌లు స్వల్పకాలికమైనవి.  సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP) ద్వారా నెలకు కేవలం రూ.500తో పెట్టుబడిని స్టార్ట్‌ చేయవచ్చు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: మూడో రోజూ రఫ్ఫాడిస్తున్న అదానీ స్టాక్స్‌ – 10లో 9 షేర్లకు గ్రీన్‌ టిక్‌, మిగిలిన ఆ ఒక్కటి ఏది?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *