మీకు తెలీకుండానే మీ హోమ్‌ లోన్‌ EMI 22% పెరిగింది, ఇదిగో లెక్క

[ad_1]

Home Loan EMI Incresed: ఈ ఆర్థిక సంవత్సరం ‍‌(2023-24) తొలి ద్రవ్య విధాన సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు రిలీఫ్‌ ఇచ్చింది. రెపో రేటును పెంచకుండా, పాత రేటునే కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో నిర్ణయించింది. దీంతో, రెపో రేటు 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంది. అయితే.. గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 6 మానిటరీ పాలసీ సమావేశాలు జరిగాయి, వీటిలో 5 సార్లు రెపో రేటును RBI పెంచింది. దీంతో, మొత్తం ఆర్థిక ఏడాదిలో రెపో రేటు 4 శాతం నుంచి 225 బేసిస్‌ పాయింట్లు పెరిగి 6.5 శాతానికి చేరింది.

మీరు 2022 ఏప్రిల్ నెలలో 6.7 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నట్లయితే, ఇప్పుడు మీరు EBLR (External Benchmark based Lending Rate) కింద 9.25 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. అంటే మీ వడ్డీ రేటు అదనంగా 2.5 శాతం పెరిగింది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. మీరు, గత ఏడాది ఏప్రిల్‌ నెలలో రూ. 50 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. దాని కాల పరిమితి 20 సంవత్సరాలు. 6.7 శాతం వడ్డీ రేటు వద్ద మీ నెలవారీ EMI రూ. 38,018 కాగా, ఇప్పుడు 9.25 శాతం వడ్డీ రేటు వద్ద రూ. 45,707 కి చేరింది. అంటే, EMI మొత్తం ఏడాదిలోనే 22 శాతం పెరిగింది.

పాత విధానంలో రుణాన్ని చెల్లింపు
హోమ్ లోన్ భారాన్ని తగ్గించుకోవడానికి  EMI మొత్తం నుంచి పదవీకాలం వరకు అనేక ఆప్షన్లు ఉన్నాయి. మీరు MCLR (Marginal Cost of Funds based Lending Rate), BPLR ‍‌(Benchmark Prime Lending Rate) కింద రుణ వాయిదాలు చెల్లిస్తున్నట్లయితే, దానిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, EBLRlతో పోలిస్తే BPLR, MCLR కింద వడ్డీ మొత్తం తక్కువగా ఉంటుంది. 

రుణ బదిలీ ఎంపిక
మీరు ఇప్పటికే రుణం తీసుకుంటే… లోన్ మొత్తంపై మీ వడ్డీ రేటును మీరు ఇతర బ్యాంకులతో సరిపోల్చుకోండి. వివిధ బ్యాంకుల్లో ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారు, ఆయా వడ్డీ రేట్ల వద్ద ఎంత EMI కట్టాల్సి వస్తుందో చెక్‌ చేసుకోండి. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనే హోమ్‌ లోన్‌ కాలుక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు తీసుకున్న రుణంపై మీ బ్యాంక్‌కు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లుగా తేలితే, తక్కువ EMI చెల్లించే అవకాశం ఉన్న బ్యాంక్‌కు మీ గృహ రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా హోమ్‌ లోన్ తీసుకోకపోతే, ఇదే పద్ధతి ఫాలో అయి, ఎక్కడ తక్కువ వడ్డీ రేటు ఉంటే అక్కడ గృహ రుణం తీసుకోవచ్చు.

మంచి క్రెడిట్ స్కోర్‌
మీ క్రెడిట్‌ స్కోర్‌ ఎప్పుడూ ‘గుడ్‌’ నుంచి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, తక్కువ వడ్డీ రేటుకు రుణం ఇవ్వమని మీ బ్యాంకును అడగవచ్చు. అలాగే, ఎక్కువ మొత్తంలోనూ రుణాన్ని పొందవచ్చు.

ఎక్కువ వడ్డీ వచ్చే పెట్టుబడులు
మీరు మీ హోమ్ లోన్‌ను తగ్గించుకోవడానికి లేదా పూర్తిగా తిరిగి చెల్లించడానికి మీ పెట్టుబడులను ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటికే హోమ్‌ లోన్‌ తీసుకుని, పెట్టుబడి పెట్టడానికి కూడా మీ చేతిలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే.. హోమ్‌ లోన్ వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ చెల్లించే మార్గాల్లో పెట్టుబడి పెట్టండి. తద్వారా.. ఆ పెట్టుబడి నుంచి వచ్చే ఎక్కువ ఆదాయంతో మీ హోమ్‌ లోన్‌ EMIలు చెల్లించండి. ఉదాహరణకు… మీరు హోమ్‌ లోన్‌ మీద 7.5% వడ్డీ రేటు చెల్లిస్తున్నారనుకుందాం. మీకు 9.5% ఆదాయం వచ్చే పెట్టుబడి మార్గం ఉంటే, అందులో మీ డబ్బును పెట్టుబడిగా పెట్టండి. మీకు వచ్చే 9.5% వడ్డీ ఆదాయం నుంచి 7.5% మొత్తాన్ని హోమ్‌ లోన్‌ EMI కోసం చెల్లించండి. మిగిలిన 2% మొత్తాన్ని మళ్లీ పెట్టుబడిగా వాడుకోవచ్చు లేదా EMIలోనే జమ చేస్తూ వెళ్లవచ్చు. దీనివల్ల హోమ్‌ లోన్‌ త్వరగా తీరుతుంది. 

ఒకవేళ, హోమ్‌ లోన్‌ తీసుకోకుండా, మీ చేతిలో ఉన్న డబ్బుతో ఇల్లు కొనాలని భావిస్తుంటే, అప్పుడు కూడా ఇదే మార్గాన్ని అనుసరించవచ్చు. అంటే.. మీరు హోమ్‌ లోన్‌ తీసుకోండి. హోమ్‌ లోన్ వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ చెల్లించే మార్గాల్లో మీ డబ్బును పెట్టుబడిగా పెట్టండి. ఆ పెట్టుబడి నుంచి వచ్చే ఆదాయంలో మీ హోమ్‌ లోన్‌ EMI పోను, మరికొంత మొత్తం మిగిలుగుతుంది కదా. దానిని మళ్లీ పెట్టుబడిగా వాడుకోండి, లేదా ఎక్కువ మొత్తంలో EMIలు చెల్లించండి. ఈ విధానం మీకు బాగా ఉపయోగపడుతుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *