[ad_1]
RBI MPC meeting: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), రెపో రేటును మరోసారి పెంచాలని చూస్తోంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సహా ఆరుగురు సభ్యుల ప్యానెల్ కొత్త ఆర్థిక సంవత్సరంలో (2023-24 లేదా FY24) మొదటి ద్రవ్య విధానాన్ని మరో రెండు రోజుల్లో ప్రకటిస్తుంది. దేశంలో ద్రవ్యోల్బణం రేటును తగ్గించడానికి కీలక రేట్లను పెంచుతూ కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకోవచ్చు.
గురువారం కీలక ప్రకటన
నేటి నుంచి గురువారం వరకు (ఏప్రిల్ 3, 5 తేదీలు, 6వ తేదీ) రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee – MPC) సమావేశం జరుగుతోంది. మహావీర్ జయంతి కారణంగా ఏప్రిల్ 4న సమావేశం ఉండదు. ఈసారి కూడా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) మేర ఆర్‌బీఐ పెంచవచ్చు. గురువారం (6వ తేదీ) మధ్యాహ్నం కల్లా రెపో రేటుపై నిర్ణయం వెలువడుతుంది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో (2023), ఆర్‌బీఐ నుంచి వెలువడే చివరి పెంపు ఇదే అవుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో (2022-23), మే నుంచి ఫిబ్రవరి వరకు 6 దఫాల్లో, మొత్తం రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు లేదా 2.5 శాతం మేర ఆర్‌బీఐ పెంచింది. చివరిసారిగా, 2023 ఫిబ్రవరి 8న జరిగిన సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అంతకుముందు 2022 డిసెంబర్‌లో 35 bps పెరుగుదల ఉంది. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 6.50 శాతంగా ఉంది. ఇప్పుడు మరో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచితే, ఇది 6.75 శాతానికి చేరుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచేందుకు, ద్రవ్యోల్బణం రేటును తగ్గించేందుకు వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచుతోంది.
6 శాతం పైగా నమోదైన ద్రవ్యోల్బణం
2023 ఫిబ్రవరి నెలలో భారతదేశ చిల్లర ద్రవ్యోల్బణం 6.44 శాతంగా ఉంది, ఊహించిన దాని కంటే ఇది ఎక్కువగా నమోదైంది. అంతకుముందు, 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో ద్రవ్యోల్బణం రేటు తగ్గింది, ఆర్‌బీఐ గరిష్ట లక్ష్యమైన 6 శాతం కంటే తక్కువే నమోదైంది. అయితే, ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరిలో వరుసగా రెండు నెలల పాటు 6 శాతం పైగా లెక్క తేలింది. అందువల్లే మరో దఫా వడ్డీ రేట్ల పెంపు తప్పదని అంచనా వేస్తున్నారు.
రెపో రేటు పెరగడం వల్ల బ్యాంకులు రుణ రేట్లను పెంచాయి. రెపో రేటు ఆర్బీఐ ఎన్నిసార్లు పెంచిందో, బ్యాంకులు కూడా అన్నిసార్లు వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో ప్రజలపై నెలవారీ వాయిదాల (EMI) ఒత్తిడి పెరిగింది. ఈ సమావేశంలో కూడా రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ పెంచితే, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా ఈఎంఐ భారం మరింత పెరుగుతుంది.
ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం పెరుగుదలను అడ్డుకోవడానికి అమెరికా, UK సెంట్రల్ బ్యాంక్ సహా కొన్ని అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు కూడా కీలక రేట్లను పెంచాయి. ఈ నిర్ణయాలు కూడా ఆర్‌బీఐ మీద ఒత్తిడి పెంచాయి. అభివృద్ధి చెందిన దేశాలకు అనుగుణంగా మన దేశంలోనూ వడ్డీ రేట్ల పెంపు జరక్కపోతే, మన దేశంలోని విదేశీ పెట్టుబడులు ఎక్కువ వడ్డీ లభించే దేశాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
[ad_2]
Source link
Leave a Reply