హౌస్‌ లోన్‌ తీసుకోవచ్చు, తిరిగి కట్టాల్సిన పని లేదు – నిజంగా ఇలాంటి స్కీమ్‌ ఉంది

[ad_1]

Reverse Mortgage Loan: హౌస్‌ లోన్‌ తీసుకుంటే మీరు బ్యాంక్‌కు EMI కట్టాలి. అదే, రివర్స్‌ మార్టిగేజ్‌ లోన్‌ తీసుకుంటే, బ్యాంక్‌లే మీకు EMI చెల్లిస్తాయి. అందుకే దీనిని రివర్స్‌ మార్ట్‌గేజ్‌ లోన్‌ అన్నారు. పైగా, దీనిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. నివశించడానికి వీలున్న సొంత ఇల్లు ఉన్నవారికే ఈ అవకాశం, అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఈ స్కీమ్‌లో చేరడానికి అనర్హులు. 

రివర్స్‌ మార్టిగేజ్‌ లోన్‌ కింద బ్యాంకులు కోటి రూపాయల వరకు అప్పు ఇస్తాయి, ఆ అప్పును సమాన భాగాలుగా విభజించి, గరిష్టంగా 20 ఏళ్ల వరకు EMI రూపంలో చెల్లిస్తాయి. నివాసయోగ్యమైన సొంత ఇల్లు ఉండి, ఇతరత్రా ఆదాయం లేని వృద్ధులు (సీనియర్‌ సిటిజెన్‌) ఆర్థిక ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం ఇది. కాబట్టి, సొంత ఇల్లు ఉండి, 60 ఏళ్లు నిండిన ఎవరైనా రివర్స్‌ మార్ట్‌గేజ్‌ రుణం తీసుకోవడానికి అర్హులే. రుణం తీసుకున్నాక కూడా రుణగ్రహీత అదే ఇంటిలో నిరభ్యంతరంగా ఉండవచ్చు, బ్యాంక్‌కు అద్దె కట్టాల్సిన పని లేదు.

రివర్స్ మార్టిగేజ్‌ పథకం కింద రుణం తీసుకోవడం ఎలా?
దరఖాస్తుదారు ఇంటిని బ్యాంక్‌ తనఖా పెట్టుకుంటుంది. ఇల్లు తనఖా పెట్టినంత మాత్రాన ఆ ఇంటిని బ్యాంక్‌కు అప్పజెప్పాల్సిన అవసరం లేదు, అద్దె కట్టాల్సిన పని లేదు. బతికినంత కాలం అదే ఇంట్లో దర్జాగా ఉండవచ్చు. ఆ ప్రాంతంలో ఆ ఆస్తి విలువ ఎంతో లెక్కేసి, ఆ విలువలో దాదాపు 80% వరకు రుణంగా బ్యాంక్‌ మంజూరు చేస్తుంది. అప్పుపై వసూలు చేసే వడ్డీని కూడా అసలుకు కలుపుతుంది. దీనిని గరిష్టంగా 20 ఏళ్లకు EMIగా మారుస్తుంది. అంటే, ప్రతి నెలా కొంత మొత్తం EMI చొప్పున, 20 ఏళ్ల వరకు చెల్లిస్తుంది. ఒకవేళ, ఆ నివాస ఆస్తి దరఖాస్తుదారు భార్య పేరిట కూడా ఉమ్మడి ఆస్తిగా ఉంటే, ఆమె వయస్సు 55 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. వయస్సు అర్హత బ్యాంకులను బట్టి మారవచ్చు.

ఇల్లు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువను, అప్పటికి అమల్లో ఉన్న వడ్డీ రేటును బట్టి రుణం మొత్తాన్ని, తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇంటి విలువ ఆధారంగా గరిష్టంగా కోటి రూపాయల వరకు రుణం మంజూరు చేస్తాయి. ఈ రుణం మీద ప్రాసెసింగ్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీ, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, వర్తించే GST చార్జీలను రుణగ్రహీత చెల్లించాల్సి ఉంటుంది. నివాసయోగ్యమైన ఇంటికి మాత్రమే ఈ అప్పు లభిస్తుంది, వాణిజ్య ఆస్తికి రాదు. తనఖా పెట్టే నివాస గృహంపై ఎలాంటి వివాదాలు, ముఖ్యంగా కోర్ట్‌ కేసులు ఉండకూడదు. దీంతోపాటు, రుణం తిరిగి తీర్చే వరకు ఆ ఇల్లు దృఢంగా ఉంటుందని బ్యాంకులు నమ్మాలి. బలహీనంగా ఉన్న ఇంటికి అప్పు పుట్టదు. రుణం తీసుకున్నాక, ఆ ఇంటికి ఏదైనా పెద్ద స్థాయి మరమ్మతు చేయాలంటే బ్యాంక్‌ అనుమతి తీసుకోవాలి. ఇంటికి సంబంధించిన ఏ రకమైన పన్నులు అయినా రుణగ్రహీతే చెల్లించాలి, బ్యాంక్‌ చెల్లించదు.

రుణం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు!
రివర్స్ మార్టిగేజ్‌ పథకం కింద లోన్‌ తీసుకుంటే, ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే బ్యాంక్‌కు ముందస్తుగానే చెల్లించవచ్చు. ప్రి-క్లోజర్‌ ఛార్జీలు లేకుండా లోన్‌ క్లోజ్‌ చేస్తారు. డబ్బు లేక లోన్‌ తిరిగి చెల్లించలేకపోయినా ఇబ్బంది లేదు. బ్యాంక్‌ మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా అడగదు. EMI కాలపరిమితి తీరిన తర్వాత కూడా బ్యాంక్‌ మిమ్మల్ని డబ్బు అడగదు. మీరు అదే ఇంట్లో ఉండవచ్చు. మీ తదనంతరం మాత్రమే ఆ ఇంటిని బ్యాంక్‌ స్వాధీనం చేసుకుంటుంది. పైన చెప్పుకున్నట్లు, ఆ ఇల్లు మీ భార్య పేరిట కూడా ఉమ్మడి ఆస్తిగా ఉంటే, ఆమె బతికి ఉన్నంతకాలం కూడా అదే ఇంట్లో ఉంచవచ్చు. బ్యాంక్‌ ఆ ఇంటివైపు కన్నెత్తి చూడదు. ఆమె తదనంతరం మాత్రమే ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. కాబట్టి, రుణం తిరిగి చెల్లించలేకపోయినా, బతికి ఉన్నంతకాలం సొంత ఇంట్లో, సొంత హక్కుతో ఉండవచ్చు. 

రివర్స్ మార్టిగేజ్‌ రుణాన్ని రెపో రేటుతో అనుసంధానిస్తారు. కాబట్టి, రుణ రేట్లు పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు దానికి అనుగుణంగా లోన్‌ మొత్తం సర్దుబాటు అవుతుంది. తమ వారసులకు ఇంటిని ఇవ్వాల్సిన అవసరం లేని వాళ్లు, ఏ విధమైన ఆదాయం లేనివాళ్లు రివర్స్‌ మార్టిగేజ్‌ లోన్‌ తీసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: CVV గుర్తు లేదా?, నో ప్రోబ్లెం, దానితో పని లేకుండానే చెల్లింపు చేయవచ్చు 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *