జులై 14న చంద్రయాన్‌-3 ప్రయోగం.. ఆ రెండు రోజుల్లో చంద్రుడిపై ల్యాండింగ్: ఇస్రో

[ad_1]

ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం షెడ్యూల్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) గురువారం వెల్లడించింది. ఈ ప్రయోగాన్ని జులై 14న చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (SHAR)లో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత జులై 13న ఈ ప్రయోగం నిర్వహించాలని భావించినా లాంచ్‌ విండో అనుకూలతను పరిశీలించి ఒక రోజు వెనక్కి జరిపారు. జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగం నిర్వహిస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (ISRO Chairmen Somnath) ప్రకటన చేశారు. ప్రయోగంలో కీలకమైన ఎల్‌వీఎం-3పీ4 వాహక నౌకతో చంద్రయాన్‌-3 ఉపగ్రహాన్ని అనుసంధానించే ప్రక్రియ బుధవారం పూర్తి చేశారు. గురువారం వాహకనౌకను రెండో లాంచింగ్ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

గురువారం బెంగళూరులో నిర్వహించిన ‘జి-20 స్పేస్‌ ఎకానమీ లీడర్స్‌ మీట్‌’లో (G-20 Space Economy Leaders Meet) ఇస్రో ఛైర్మన్ మాట్లాడుతూ.. జులై 14న ప్రయోగించే ఉపగ్రహం.. ఆగస్టు చివరి నాటికి చంద్రుడి వద్దకు చేరుకోనుందని ఇస్రో ఛైర్మన్ అన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 23 లేదా 24న చంద్రయాన్‌-3 రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ జరిగే అవకాశం ఉందని సోమనాథ్‌ తెలిపారు. అప్పటికి చంద్రుడిపై పగలు మొదలవుతుందని చెప్పారు. ఒకవేళ ఈ రెండు రోజుల్లో ల్యాండింగ్ జరగకుంటే మరో నెల రోజులు వేచి చూసి, సెప్టెంబరులో ప్రయత్నిస్తామని ఆయన వివరించారు. చంద్రుడి దక్షణ ధ్రువంపై వెలుతురు ఉండకపోవడం వల్ల ల్యాండర్, రోవర్‌లకు శక్తి ఉండదు, కాబట్టి ఉపరితలంపై 70 డిగ్రీల దక్షిణంగా ల్యాండింగ్ కోసం ప్రణాళిక రూపొందించినట్టు పేర్కొన్నారు.

చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ విజయవంతంగా జరుగుతుందని బలమైన నమ్మకంతో ఉన్నామని సోమనాథ్ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ల్యాండర్‌లో మార్పులు చేసినట్టు వివరించారు. ల్యాండర్, రోవర్ జీవితకాలం 14 ఎర్త్ డేస్ వరకు ఉంటుందని, అయితే దానిని పొడిగించడానికి చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. భూమిపై పద్నాలుగు రోజులైతే చంద్రుడిపై ఒక రోజు. చంద్రునిపై సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య సమయం లేదా చంద్రుడి ఆకాశంలో సూర్యుడు అదే స్థానానికి తిరిగి రావడానికి పట్టే సమయంతో లెక్కిస్తారు.

‘సూర్యుడు అస్తమించిన తర్వాత, ల్యాండర్, రోవర్ పనిచేయడానికి శక్తి ఉండదు.. అన్ని పరికరాలు పనిచేయడం మానేస్తాయి. అయినప్పటికీ, తదుపరి సూర్యోదయం తర్వాత రీఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మా పరీక్షలు చూపిస్తున్నాయి. అదే జరిగితే మనకు మరో 14 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం రోవర్ పనిచేస్తుంది’అని సోమనాథ్ అన్నారు.

సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన విక్రమ్ (Vikram) నుంచి ప్రజ్ఞాన్ (Pragyan) రోవర్ విడిపోతుంది. ఇది ల్యాండర్‌లోని కెమెరాల రికార్డవుతుంది. రోవర్ చక్రాల సాయంతో చంద్రుని ఉపరితలంపై కదలుతుంది. ప్రజ్ఞాన్ అడ్డంకులను నివారించడానికి కెమెరాలను కూడా అమర్చారు. ‘రోవర్ కదలిక ల్యాండర్ పరిశీలనా ప్రాంతంలో ఉండేలా పరిమితం చేయబడుతుంది.. ల్యాండర్‌లోని కెమెరాలు అన్ని సమయాల్లో రోవర్‌ను చూడగలిగేలా ఉండాలని మేము కోరుకుంటున్నాం… ప్రస్తుతానికి వాటి పనికాలం 14 రోజులుగా ఉంది.. మేము అది కవర్ చేసే దూరాన్ని మ్యాప్ చేస్తాం.. ల్యాండర్, రోవర్ జీవితకాలం పొడిగించనట్లయితే అది మరింత ప్రయాణిస్తుంది’ అని సోమనాథ్ చెప్పారు.

కాగా, చంద్రయాన్-3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ మూడు మాడ్యుల్స్ ఉన్నాయి. ఉపగ్రహాన్ని మోసుకెళ్లే అంతరిక్ష నౌక బరువు 3,900 కిలోలు కాగా.. ప్రొపల్షన్ మాడ్యుల్ బరువు 2,148 కిలోలు, రోవర్‌తో కలుపుకుని ల్యాండర్ మాడ్యుల్ బరువు 1,752 కిలోలు.

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *