పేటీఎంపై దయ చూపే ఛాన్సే లేదు, చివరి తలుపునూ మూసేసిన ఆర్‌బీఐ

[ad_1]

Paytm Crisis: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (PPBL) ఆంక్షలు సడలించాలంటూ ఫిన్‌టెక్‌ ఇండస్ట్రీ మొత్తం ఏకమై చేసిన విజ్ఞప్తులు, పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ (Vijay Shekhar Sharma) ఆర్థిక మంత్రి నిర్మలమ్మను & ఆర్‌బీఐ అధికార్లను కలిసి చేసిన విన్నపాలు, ఇతర ప్రయత్నాలు.. అన్నీ వృథా అయ్యాయి. ఆంక్షల వలలో చిక్కుకున్న PPBL, దాన్నుంచి బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు, చివరి డోర్‌ను కూడా ఆర్‌బీఐ దాదాపుగా మూసేసింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ మీద ఆర్‌బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

సోమవారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), పేటీఎం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై సెంట్రల్ బ్యాంక్ విధించిన ఆంక్షలపై పునరాలోచించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన దాస్‌, పేటీఎం కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు కుండ బద్ధలు కొట్టారు.

“పేటీఎంపై తీసుకున్న నిర్ణయంపై సమీక్ష గురించి మీరు ఆశిస్తుంటే.. నేను ఆ విషయం గురించి చాలా స్పష్టంగా చెబుతా వినండి. ఆర్‌బీఐ నిర్ణయంపై సమీక్షించే ఆస్కారమే లేదు. పేటీఎంలోని ఫాస్టాగ్‌ యూజర్లు, వాలెట్ కస్టమర్లు, ఇతర ఖాతాదార్లు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానంగా పేటీఎంపై FAQ  (frequently asked questions) జారీ చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించుకుంది. నిర్ణయంపై సమీక్షించడం ఆ లిస్ట్‌లో లేదు. ఈ వారంలో జారీ అయ్యే FAQలో సమీక్షను ఆశించొద్దు” – శక్తికాంత దాస్‌ 

తాము ఆషామాషీగా ఒక నిర్ణయాన్ని తీసుకోమని కూడా దాస్‌ చెప్పారు. “ఒక నిర్ణయం తీసుకునే సమయంలో అన్ని లాభనష్టాల గురించి మేం చర్చిస్తాం, అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తాం. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత సీరియస్‌గా నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు.

ఫిన్‌టెక్ రంగానికి ఆర్‌బీఐ మద్దతు కొనసాగుతుందన్న దాస్‌, ఆ రంగం అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. “మన దేశంలో ఫిన్‌టెక్ రంగానికి ముఖ్యమైన పాత్ర ఉంది. కోట్ల మంది ప్రజలు ఫిన్‌టెక్ సంస్థల వాలెట్లలో డబ్బులు ఉంచుతున్నారు. కాబట్టి.. కస్టమర్‌ ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వానికి ఫస్ట్‌ ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైనా ఫిన్‌టెక్‌ సంస్థ తన వ్యాపారాన్ని నడపాలనుకుంటే, కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండాలి” అని ఆర్‌బీఐ గవర్నర్‌ తేల్చి చెప్పారు.

2024 మార్చి 01 నుంచి డిపాజిట్లు, ఫండ్ బదిలీలు, డిజిటల్ వాలెట్‌లతో సహా అన్ని కార్యకలాపాలను ఆపేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను 2024 జనవరి 31న ఆర్‌బీఐ ఆదేశించింది. 

పేటీఎంలో చైనా పెట్టుబడులపై ఆరా!
PTI రిపోర్ట్‌ ప్రకారం, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లోకి (PPSL) చైనా నుంచి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని (FDI) కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. సమగ్ర పరిశీలన తర్వాత ఎఫ్‌డీఐ అంశంపై నిర్ణయం తీసుకుంటారని పీటీఐ నివేదించింది. 

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మీద మనీ లాండరింగ్‌ ఆరోపణలు రావడంతో, PPBL బోర్డ్‌ నుంచి ఒక స్వతంత్ర డైరెక్టర్‌ వైదొలిగారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్‌ మంజు అగర్వాల్‌, తన వ్యక్తిగత కారణాల వల్ల 2024 ఫిబ్రవరి 01న బోర్డుకు రాజీనామా చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేటీఎం కూడా ప్రకటించింది.

మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ IRCTC, Paytm, HEG, Dilip Buildcon

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *