ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్‌, ఇప్పుడు మీకు మరింత ప్రయోజనం

[ad_1]

Bandhan Bank FD: సురక్షిత పెట్టుబడి మార్గాల్లో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఒకటి. అసురక్షిత పెట్టుబడి మార్గాల్లా కాకుండా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టే డబ్బు ఎక్కడికీ పోదు. స్థిరమైన ఆదాయం ఉంటుంది. దేశంలో వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాంకులు కూడా ఈ తరహా పథకాల (Bank FD Scheme) మీద ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో, అన్ని బ్యాంకుల్లో కొన్ని నెలలుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సంఖ్య పెరుగుతోంది.

తాజాగా, ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్, ‍తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేటును (Bandhan Bank FD Rates) పెంచింది. ఎఫ్‌డీ వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు లేదా 0.50 శాతం పెంచింది. 

సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం వడ్డీ
FD వడ్డీ రేటును పెంచిన తర్వాత, ఇప్పుడు, ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) 8.5 శాతం వడ్డీని & సాధారణ ఖాతాదార్లకు 8 శాతం వడ్డీని బంధన్ బ్యాంక్ అందిస్తోంది. 600 రోజుల వ్యవధి గల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ (FD) మీద ఈ వడ్డీ లభిస్తుంది.

అదే విధంగా, ఒక సంవత్సరం కాల పరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేటును పెంచి 7 శాతానికి చేర్చింది ఈ బ్యాంక్‌. అంటే, ఇప్పుడు సీనియర్ సిటిజన్లు బంధన్ బ్యాంక్‌లో 0.5 శాతం అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. బ్యాంక్ ఈ కొత్త రేట్లు నిన్నటి (సోమవారం, 06 ఫిబ్రవరి 2023) నుంచి అమలులోకి వచ్చాయి.

ఇటీవల వడ్డీని పెంచిన బ్యాంకులు
బంధన్‌ బ్యాంక్‌ కంటే ముందు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ (IDFC FIRST Bank‌) కూడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచింది. ఈ బ్యాంకులో, సీనియర్ సిటిజన్లు, 18 నెలల నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 8 శాతం వడ్డీని పొందుతున్నారు. అదే విధంగా, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Jana Small Finance Bank) కూడా తన వద్ద చేసే FDల మీద వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాల వ్యవధి ఉన్న FDల మీద ఈ బ్యాంక్‌ ఇప్పుడు 8.10 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. ఇదే సమయంలో, సీనియర్ సిటిజన్లు ఇవే కాల వ్యవధి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద 8.80 శాతం వడ్డీని పొందుతున్నారు.

రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), 2022 మే నెల నుంచి రెపో రేటును పెంచడం ప్రారంభించింది. అప్పటి నుంచి 2022 డిసెంబర్‌ వరకు జరిగిన వరుస సమీక్షల ద్వారా, రెపో రేటు 200 బేసిస్‌ పాయింట్లు లేదా 2 శాతం పెంచి, మొత్తంగా 6.25 శాతానికి చేర్చింది. 

ఈ సంవత్సరంలో, ‘పరపతి విధాన కమిటీ’ (Monetary Policy Committee) మొదటి సమీక్ష సోమవారం నుంచి ప్రారంభమైంది, బుధవారం వరకు ‍‌(సోమవారం, ఫిబ్రవరి 06, 2023 నుంచి ఫిబ్రవరి 08 2023) జరుగుతుంది. దేశంలో ద్రవ్యోల్బణ భారం క్రమంగా దిగి వస్తుండడంతో, ఈసారి రెపో రేటు పెంపు 25 bpsను మించకపోవచ్చని మార్కెట్‌ అంచనా వేస్తోంది. రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ పెంచితే, దానికి అనుగుణంగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. తద్వారా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *