Chandrayaan 3: ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 వెనక ఆ ముగ్గురు

[ad_1]

చంద్రుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్-3. ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన, భారీ ప్రయోగం ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.613 కోట్ల ఖర్చుచేశారు. చంద్రయాన్-3 ప్రయోగం కోసం ఇస్రోకు చెందిన 17 వేల మందికిపైగా సిబ్బంది ఊపిరి బిగబట్టి, నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలం మీద దక్షిణ ధ్రువంపై దిగుతూ ల్యాండర్ సాంకేతిక సమస్యతో కూలిపోయింది. ఈ నేపథ్యంలో నాటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఇస్రో శాస్త్రవేత్తలు లోపాలను సవరించి ఈసారి మరింత రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్-3ను చేపట్టారు.

ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. చంద్రయాన్‌-3 దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. అంతేకాదు, చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా గుర్తింపు పొందనుంది. మరి కొద్దిసేపట్లో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ బాహుబలి రాకెట్ ఎల్ఎంవీ-ఎం4 చంద్రయాన్-3ను నింగిలోకి తీసుకెళ్లనుంది.

అయితే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూపకల్పనలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త వీరముత్తువేల్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ చీఫ్ ఉన్నికృష్ణన్ నాయర్‌లు కీలకంగా వ్యవహరించారు. వీరితో పాటు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్ రాజారంజన్, బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ ఎం శంకరన్, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్, అసోం శాస్త్రవేత్త చాయాన్ దత్‌లు కూడా చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో తమ వంతు బాధ్యతలను నిర్వహించారు.

చంద్రయాన్-2 ల్యాండింగ్‌ సమయంలో వేగాన్ని తగ్గించడానికి ఏర్పాటుచేసిన థ్రస్టర్ ఇంజిన్లు, సాఫ్ట్‌వేర్‌ పరంగా తలెత్తిన ఇబ్బందులు ప్రయోగం వైఫల్యానికి దారితీశాయి. వాటితోపాటు నాడు చివరి క్షణాల్లో అనూహ్యంగా ఎదురైన ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పెంచారు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్‌ సెకనుకు మూడు మీటర్ల వేగాన్ని తట్టుకోగలదు. ఉపరితలాన్ని బలంగా తాకినా తట్టుకునేలా ల్యాండర్‌ దిగువ భాగం డిజైన్‌ను మార్చారు. ఈసారి ల్యాండింగ్‌కు 4X2.5 కి.మీల సువిశాల ప్రదేశాన్ని ఎంచుకున్నారు. తొలుత 500 X 500 మీటర్ల ప్రదేశంలో దిగడానికి ల్యాండర్‌ ప్రయత్నిస్తుంది. అక్కడ కుదరకపోతే 4X2.5 కి.మీల పరిధిలో ఎక్కడైనా దిగొచ్చు. ఇందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమర్చారు.


Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *