తాజా రిపోర్ట్స్ ప్రకారం..
2022లో దక్షిణ భారతదేశంలో అత్యధిక గృహ విక్రయాలు హైదరాబాద్ నగరంలో నమోదయ్యాయని ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కంపెనీ PropTiger తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఏకంగా 35,372 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో బెంగళూరు, చెన్నై నగరాలు వెనుకకు నెట్టబడ్డాయి.

పెద్ద ఇళ్లకే ప్రాధాన్యం..
విక్రయించబడిన హౌసింగ్ యూనిట్లలో 50% కంటే ఎక్కువ 3BHKలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. దీని తర్వాత 41% గృహ వినియోగదారులు 2BHKలను కొనుగోలు చేశారు. ద్రవ్యోల్బణం కారణంగా 2022 చివరి నాటికి నిర్మాణ వ్యయాలు పెరిగిన తరుణంలో విక్రయించిన యూనిట్లలో అత్యధిక నిర్మాణాల విలువ రూ. కోటి కంటే ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. రియల్టీ డిమాండ్ కారణంగా కొత్త ఇళ్ల ధరలు చదరపు అడుగులకు రూ.5,900-6,100 నుంచి చదరపు అడుగులకు రూ.6,130-6,330కి పెరిగాయి.

ఎక్కువ డిమాండ్..
హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లోని రియల్టీ ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం నగరంలోని తెల్లాపూర్, గుండ్లపోచంపల్లి, కొల్లూరు, పుప్పాలగూడ, కోకాపేట్ ప్రాంతాలు గృహ కొనుగోలుదారులు అత్యంత ఇష్టపడిన ప్రాంతాలుగా నిలిచాయి.

ఉద్యోగాలు..
స్నేహపూర్వక వ్యాపార వాతావరణం, మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ కారణంగా.. నగరంలో ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇది పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుదలకు కారణంగా మారింది. దీంతో రియల్టీ మార్కెట్ పై కూడా ప్రభావం ఉంటుందని Housing.com, PropTiger.com, Makaan.comలో డైరెక్టర్ అండ్ రీసెర్చ్ హెడ్ అంకిత సూద్ తెలిపారు.