[ad_1]
NPS Withdrawal Rule: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System) కింద డబ్బును ఉపసంహరించుకునే (విత్ డ్రా) నియమాలను కొవిడ్-19 సమయంలో మార్చారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేలా NPS సబ్‌స్క్రైబర్లకు ఎంతో కొంత డబ్బు అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా, NPS ఖాతా నుంచి నగదు పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన నియమాలు మార్చారు. ఆ రూల్స్ ప్రకారం, స్వీయ ధృవీకరణతో (Self Declaration) ఆన్‌లైన్ ద్వారా నగదు ఉపసంహరణకు (Online Money Withdrawal Rule) అనుమతి ఇచ్చారు.
ఇప్పుడు మళ్లీ రూల్స్ మార్చారు. కొత్త సంవత్సరంలో, జనవరి 1, 2023 నుంచి స్వీయ ధృవీకరణ ద్వారా NPS నుంచి పాక్షిక నగదు ఉపసంహరణ సౌకర్యం అందుబాటులో ఉండదని రెగ్యులేటర్ PFRDA (Pension Fund Regulatory and Development Authority) వెల్లడించింది.
ప్రభుత్వ రంగంలోని చందాదారులకు ఈ సదుపాయం ఇకపై అందుబాటులో ఉండదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగంలోని ఇతర సంస్థల ఉద్యోగులు అందరికీ ఇది వర్తిస్తుంది. డిసెంబర్ 23న విడుదల చేసిన సర్క్యులర్‌లో PFRDA ఈ విషయాన్ని వెల్లడించింది.
డబ్బు కావాలంటే ఏం చేయాలి?
కొత్త నిబంధన (జనవరి 1, 2023 నుంచి) అమలులోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ & ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగి ఎవరైనా తన NPS ఖాతా నుంచి పాక్షికంగా డబ్బు విత్ డ్రా చేసుకోవాలని భావిస్తే, సెల్ఫ్ డిక్లరేషన్ ఇక చెల్లదు. దానికి బదులు నోడల్ ద్వారా డిక్లరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్లు NPS ఖాతా నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలు అవుతుంది.
News Reels
కొందరికి ఈ నిబంధన వర్తించదు
‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ’ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం… ప్రభుత్వేతర రంగాలకు చెందిన NPS చందాదారులకు ఈ నియమం వర్తించదు. ప్రభుత్వేతర రంగాల్లో పని చేసే వాళ్లు కొత్త సంవత్సరంలోనూ స్వీయ ధృవీకరణతో NPS ఖాతా నుంచి కొంత మేర డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగిలిన NPS చందాదారులు, కార్పొరేట్ కస్టమర్లు అందరూ పాత ప్రక్రియ ద్వారా కొంత డబ్బును వెనక్కు తీసుకునే వెసులుబాటు కొనసాగుతుంది.
పాక్షిక నగదు ఉపసంహరణలో ముఖ్యమైన విషయాలు:
NPS ఖాతా ప్రారంభించి మూడు సంవత్సరాలు నిండి ఉండాలి.
వెనక్కు తీసుకునే డబ్బు, NPS ఖాతాలోని మొత్తం పెట్టుబడిలో 25 శాతానికి మించి ఉండకూడదు.
NPS ఖాతా నుంచి గరిష్టంగా మూడు ఉపసంహరణలకు మాత్రమే రెగ్యులేటర్ అనుమతి ఇచ్చింది.
ఏ చందాదారు అయినా, తన NPS ఖాతా నుంచి చిన్నపాటి కారణాలతో డబ్బును పాక్షికంగా ఉపసంహరించుకోవడానికి రెగ్యులేటర్ అనుతించదు. పిల్లల చదువు ఖర్చుల కోసం, పిల్లలు లేదా చందాదారుడి వివాహం కోసం, ఇల్లు లేదా ఇతర ఆస్తి కొనుగోలు కోసం, అనారోగ్య పరిస్థితుల్లో వైద్య చికిత్సలు వంటి కొన్ని కారణాలతో మాత్రమే NPS ఖాతా నుంచి పాక్షికంగా నగదు ఉపసంహరించుకోవచ్చు.
[ad_2]
Source link
Leave a Reply