PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు 25 దేశాల ప్రతినిధులు, 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం


Minister Gudivada Amarnath : మార్చి 3, 4 తేదీలలో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు రాష్ట్ర ప్రగతికి మరింత ఉపయోగపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి మంగళవారం విశాఖలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ప్రగతిని సదస్సులో పారిశ్రామికవేత్తలకు చెప్పనున్నామని తెలిపారు. దేశంలోనే ఎనిమిదో అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకోబోతున్నామన్నారు. మారీటైం బోర్డు ద్వారా 15 వేల కోట్ల రూపాయలతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ఇప్పుడున్న పోర్టులకు అదనంగా నాలుగు కొత్త పోర్టులు,  ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనున్నామన్నారు.  ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి వెసెల్ రాబోతుందని అమర్నాథ్ చెప్పారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తామని, భావనపాడు పోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి పోర్టుకు ఆనుకుని ఐదు నుంచి పదివేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయిస్తున్నామని మంత్రి అమర్ నాథ్ తెలియజేశారు.  రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయని అని చెప్పారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నం.1 

రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడును రాబట్టేందుకు అవకాశాలు ఉన్నాయని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.  దీనికోసం రాష్ట్రంలో 29 ప్రాంతాలను గుర్తించామన్నారు. అదేవిధంగా 646 చదరపు కిలోమీటర్ల పరిధిలో పీసీపీఐఆర్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించామని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హెచ్పీసీఎల్, ఐఓసీ, ఎన్.టి.పి.సి కర్మాగారాలను ప్రపంచ స్థాయిలో ఫోకస్ చేయనున్నామని ఆయన చెప్పారు. కాగా 2021- 22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి 1,44,000 కోట్ల రూపాయల ఎగుమతులు చేశామని చెప్పారు. ఎగుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎనిమిదో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు.  

100 ఎకరాల్లో ఐటీ పార్క్ 

రాష్ట్రంలో 2 వేల ఎకరాలలో  బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో సుమారు 40,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. 70 శాతం వర్కింగ్ ఏజ్ గ్రూప్ కలిగిన ఆంధ్రప్రదేశ్  జీఎస్డీపీలో  ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ప్రాంతాలను మేజర్ కాన్సెప్ట్ సిటీలుగా రూపుదిద్దుతున్నమని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఆనుకుని 100 ఎకరాలలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి సెకనుకు ఒక సెల్ ఫోన్ తయారవుతోందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో స్కిల్  హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

25 దేశాల నుంచి ప్రతినిధులు 

2023-28 గాను కొత్త పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని అని చెప్పారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను రాబట్టేందుకు అనువుగా ఈ పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు. ఈ సమ్మిట్ లో ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు ఆరు నెలల్లో పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి అడిషనల్ సపోర్ట్ ఉంటుందని అమర్నాథ్ చెప్పారు. మూడో తేదీ ఉదయం సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. సదస్సు జరిగే ప్రదేశంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని ఉన్న పరిశ్రమల ప్రగతిని ఎగ్జిబిషన్ ద్వారా అతిథులకు తెలియజేస్తామని చెప్పారు. తర్వాత సెషన్స్ ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. సదస్సుకు 25 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని 14 మంది అంబాసిడర్లు రానున్నారని , వివిధ దేశాలకు చెందిన కార్యదర్శులు, యూరోపియన్ యూనియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారని ఆయన చెప్పారు. నాలుగో తేదీన పలు ఎంవోయూలు జరుగుతాయని తెలియజేశారు.  

 Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *