Paytm Crisis: పేటీఎం షేర్లలో పతనం కొనసాగుతోంది, మంగళవారం ‍(13 ఫిబ్రవరి 2024) మరింత భారీగా క్షీణించాయి. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ‍‌(Paytm Payments Bank) మీద ఆర్‌బీఐ (RBI) విధించిన ఆంక్షల కారణంగా ఈ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ ఇచ్చిన రేటింగ్‌ కారణంగా మంగళవారం పేటీఎం స్టాక్‌ 10 పడిపోయింది. 

పేటీఎం షేర్లను డౌన్‌గ్రేడ్ చేసిన మాక్వారీ 
ఫారిన్‌ బ్రోకింగ్‌ హౌస్‌ మాక్వారీ, పేటీఎం షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు (One97 Communications Limited) ‘అండర్ పెర్ఫార్మ్’ రేటింగ్ ఇచ్చింది. అంతేకాదు, ఈ స్టాక్‌ టార్గెట్ ధరను కూడా రూ.275 కి (Paytm shares target price) తగ్గించింది. ఇంతకుముందు, పేటీఎం షేర్లకు రూ. 650 టార్గెట్‌ ప్రైస్‌ను ఈ బ్రోకింగ్‌ కంపెనీ ఇచ్చింది. ఇప్పుడు, కొత్త రేటింగ్‌ ప్రకారం చూస్తే, లక్ష్యిత ధరను ఒకేసారి 57 శాతం కోసేసి ఘోరంగా అవమానించింది.

పేటీఎం షేర్లను మాక్వారీ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు, ఆర్‌బీఐ గవర్నర్‌ సోమవారం చేసిన కామెంట్లు కూడా పేటీఎం ఇన్వెస్టర్లను భయపెట్టాయి. ఈ రెండు వార్తలు బయటకు వచ్చాక, మంగళవారం ఉదయం మార్కెట్‌ ఓపెన్‌ అయిన దగ్గర్నుంచి పేటీఎం షేర్లు రెడ్‌ జోన్‌లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ స్టాక్‌ ఈ రోజు రూ. 380 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మాక్వారీ ఇచ్చిన టార్గెట్ ధర, మంగళవారం కనిష్ట స్థాయి కంటే దాదాపు రూ. 100 తక్కువగా ఉంది. అంటే, బ్రోకరేజ్‌ ప్రకారం పేటీఎం షేర్‌కు ఇప్పుడున్న విలువ కూడా ఎక్కువే. మాక్వారీ లెక్క ప్రకారం ఈ స్టాక్‌ ఇంకా రూ. 100 తగ్గాలి. అదే జరిగితే ఇన్వెస్టర్ల పెట్టుబడి దాదాపుగా జీరో అవుతుంది.

ఈ ఏడాది జనవరి 31న ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నాటి నుంచి ఇప్పటి వరకు పేటీఎం కౌంటర్‌ సుమారు 45 శాతం నష్టపోయింది.

గరిష్ఠ స్థాయి నుంచి 80 శాతం పతనం
2021 నవంబర్‌ 18న జీవిత కాల గరిష్ట స్థాయి (Paytm shares all-time high) రూ. 1,995 మార్క్‌ను టచ్‌ చేసిన పేటీఎం షేర్‌, మంగళవారం రూ. 380 కి పడిపోయింది. ఇది, లైఫ్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయి కంటే 80.55 శాతం తక్కువ. 2023 అక్టోబర్‌లో 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 998.30 కి చేరిన తర్వాత కూడా నిరంతరం పతనమవుతూనే ఉంది.

ఐపీవో సమయంలో, ఒక్కో షేర్‌ను (Paytm IPO share price) రూ. 2,150 చొప్పున పేటీఎం విడుదల చేసింది. అయితే, ఇష్యూ ధర కంటే డిస్కౌంట్‌లో రూ. 1,950 వద్ద ఈ స్క్రిప్ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయింది. లిస్టింగ్‌ తర్వాత కొద్దిగా పెరిగినా, అక్కడి నుంచి అసలు సినిమా చూపించాయి. హయ్యర్‌ వాల్యూయేషన్‌ కారణంగా ఈ కంపెనీ షేర్లు నష్టాల్లోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం, IPO మార్క్‌ను అందుకోలేనంత దూరంలోకి జారిపోయాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: వేసుకో వీరతాడు – రూ.20 లక్షల కోట్ల ఘనత సాధించిన తొలి కంపెనీ రిలయన్స్

మరిన్ని చూడండిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *