మళ్లీ రికార్డుల్లోకి ఎక్కిన సెన్సెక్స్‌, నిఫ్టీ – ఆల్‌టైమ్‌ హైలో మిడ్‌క్యాప్స్‌


Stock Market News Today in Telugu: మంగళవారం (12 డిసెంబర్‌ 2023) నాడు స్టాక్‌ మార్కెట్లు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే నిఫ్టీ మరోమారు ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయిని అధిగమించి సరికొత్త శిఖరాన్ని తాకింది. అదే సమయంలో, మిడ్‌ క్యాప్ ఇండెక్స్ కూడా రికార్డు గరిష్ట స్థాయికి చేరి, మార్కెట్‌కు మద్దతుగా నిలిచింది. ఓపెనింగ్‌ టైమ్‌లో, మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 44,900 స్థాయిని దాటింది, 45,000 లెవెల్‌ దగ్గరకు వెళ్లింది. 

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్‌లో (సోమవారం, 11 డిసెంబర్‌ 2023) 69,929 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 92.15 పాయింట్ల లాభంతో 70,020 వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది, గత సెషన్‌లో 20,997 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 21.45 పాయింట్లు లేదా 0.10 శాతం పెరుగుదలతో 21,018 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే… సెన్సెక్స్‌ 70,033.64 లెవెల్‌ వద్దకు చేరి తాజా ఆల్‌ టైమ్‌ హైని ‍(Sensex fresh all-time high) క్రియేట్‌ చేసింది. నిఫ్టీ కూడా 21,037.90 స్థాయికి వెళ్లి కొత్త జీవనకాల గరిష్టాన్ని (Nifty fresh all-time high) నమోదు చేసింది. 

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
మార్కెట్‌ ప్రారంభ సమయంలో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 22 షేర్లు పురోగమనంలో కనిపించగా, కేవలం 8 స్టాక్స్‌ మాత్రమే తిరోగమనంలో ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌ టాప్ గెయినర్స్‌లో.. టాటా స్టీల్ 0.92 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.91 శాతం, ఐటీసీ 0.90 శాతం లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ 0.78 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.71 శాతం, M&M 0.67 శాతం గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి.

నిఫ్టీ చిత్రం
నిఫ్టీ 50 ప్యాక్‌లోని 38 షేర్లలో పెరుగుదల కనిపించగా, 12 స్టాక్స్‌లో క్షీణత కనిపించింది. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో.. HDFC లైఫ్ 2.35 శాతం, బజాజ్ ఆటో 1.88 శాతం, హీరో మోటోకార్ప్ 1.66 శాతం లాభపడ్డాయి. గ్రాసిమ్, SBI లైఫ్ షేర్లు 1.62 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ సెక్టోరియల్‌ ఇండెక్స్‌ల్లో… ఐటీ రంగం మాత్రమే నష్టపోయింది. మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత ఐటీ కూడా గ్రీన్ జోన్‌లోకి తిరిగి రాగా, రియాల్టీ ఇండెక్స్ స్వల్పంగా పడిపోయింది.

బ్యాంక్ నిఫ్టీ – మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌
ఓపెనింగ్‌ సెషన్‌లో, బ్యాంక్ నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల లాభంతో ఉంది. మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 175.90 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 44,905 వద్ద కనిపించింది. ఇది దాని ఆల్ టైమ్ హై లెవెల్ ‍‌(Midcap index all-time high).

అడ్వాన్స్-డిక్లైన్ రేషియో 
మార్కెట్ ప్రారంభ సమయానికి, BSEలో 1,961 షేర్లు అడ్వాన్స్‌ అయితే, 299 షేర్లు డిక్లైన్‌ అయ్యాయి. 185 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 39 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత, 2,115 షేర్లు ఎగబాకితే, 884 షేర్లు పడిపోయాయి. 99 షేర్లలో ఎటువంటి మార్పు కనిపించలేదు.

ఉదయం 10.10 గంటల సమయానికి… సెన్సెక్స్‌ 58.26 పాయింట్లు లేదా 0.083% పెరిగి 69,986.79 స్థాయి వద్ద; నిఫ్టీ 32.30 పాయింట్లు లేదా 0.1% లాభంతో 21,029.40 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 

గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
సోమవారం, యూఎస్‌ మార్కెట్స్‌ లాభాల్లో క్లోజ్‌ అయ్యాయి. డౌ జోన్స్‌ 0.43 శాతం లాభపడింది. S&P500 0.39 శాతం పెరిగింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.20 శాతం వృద్ధి చెందింది. ఆసియా మార్కెట్లలో… మంగళవారం ఓపెనింగ్‌ టైమ్‌లో నికాయ్‌, హ్యాంగ్ సెంగ్ 0.7 శాతం చొప్పున పెరిగాయి. CSI 300, కోస్పి, S&P/ASX 200 కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఇవి 0.05 శాతం నుంచి 0.4 శాతం మధ్యలో పెరిగాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఉచిత అవకాశానికి ఆఖరి రెండు రోజులు, ఆలస్యం చేస్తే డబ్బులు కట్టాల్సిందేSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *