Home Renovation Loan: కొత్త ఇల్లు కొంత కాలం తర్వాత పాతదైపోతుంది. రిపేర్లు వస్తుంటాయి. ట్రెండ్‌, టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి.. ఇప్పుడు కొత్తగా కట్టే ఇళ్లతో పోలిస్తే పాత ఇల్లు పరమ బోరింగ్‌గా ఉండవచ్చు. బోర్‌ కొడుతోంది కదాని ఇంటిని వదులుకోలేం. కానీ, దానిని లేటెస్ట్‌ ట్రెండ్‌, టెక్నాలజీకి తగ్గట్లుగా మార్చుకోవచ్చు. ఇందుకు కావల్సిన డబ్బుల కోసం చింతించాల్సిన అవసరం లేదు. పాత ఇంటి రూపరేఖల్ని కొత్తగా మార్చుకోవడానికి కూడా బ్యాంకులు, NBFC కంపెనీలు లోన్స్‌ (రెనోవేషన్‌ లోన్‌/గృహ పునరుద్ధరణ రుణం) ఇస్తాయి. 

మీ పాత ఇంటిని లేటెస్ట్‌ ట్రెండ్‌కు తగ్గట్లుగా డిజైన్ చేయాలనుకున్నా, మేజర్‌ రిపేర్స్‌ చేయించాలనుకున్నా, రూమ్స్‌ పెంచుకోవాలనుకున్నా.. ఏం చేయాలన్నా రెనోవేషన్‌ లోన్‌ దొరుకుతుంది. ఉదాహరణకు.. మీ ఇంటి వంటగది, బాత్‌రూమ్‌, బెడ్‌రూమ్‌ను పడగొట్టి మళ్లీ కట్టినా, ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ వ్యవస్థలు మార్చాలనుకున్నా హోమ్‌ రెనోవేషన్‌ లోన్‌ కోసం అప్లై చేయవచ్చు. గృహ పునరుద్ధరణ రుణం చాలా పాపులర్‌ అయింది. హోమ్‌ లోన్స్‌ తరహాలోనే హోమ్‌ రెనోవేషన్‌ లోన్స్‌ను తీసుకునే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు) ఈ లోన్స్‌ అందిస్తున్నాయి. 

ఎంత రుణం వస్తుంది?
హోమ్‌ రెనోవేషన్‌ లోన్‌ కోసం మీరు అప్లై చేస్తే రూ. 25 లక్షల వరకు అప్పు దొరుకుతుంది. అయితే, కచ్చితంగా ఎంత మొత్తం శాంక్షన్‌ అవుతుందన్నది బ్యాంకర్‌ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కస్టమర్ ఆదాయ వనరులు, క్రెడిట్‌ హిస్టరీ, ఆస్తిపాస్తులు, ఇంటి విలువ, ఇల్లు ఉన్న ప్రాంతం, ఇతర డాక్యుమెంట్స్‌ ఆధారంగా లోన్‌ అమౌంట్‌ను బ్యాంకర్‌ నిర్ణయిస్తారు.

వడ్డీ రేటు ఎంత?
గృహ పునరుద్ధరణ కోసం లోన్‌ తీసుకుంటే, సాధారణంగా, గృహ రుణం కంటే ఎక్కువ వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. వీటిని ఫ్లోటింగ్ ఇంట్రస్ట్‌ రేట్లతో లింక్‌ చేస్తారు. అయితే, పర్సనల్‌ లోన్స్‌ మీద పడే వడ్డీలతో పోలిస్తే గృహ పునరుద్ధరణ రుణం వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. సాధారణంగా… హోమ్‌ రెనోవేషన్‌ లోన్‌ వడ్డీ రేటు 8-12 శాతం వరకు ఉంటుంది. తీసుకున్న రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. చెల్లింపు గడువును 20 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు.

హోమ్‌ రెనోవేషన్‌ లోన్‌ అర్హతలు
హోమ్‌ రెనోవేషన్‌ లోన్‌ తీసుకోవాలంటే తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి. క్రమం తప్పకుండా ఆదాయం (రెగ్యులర్ ఇన్‌కమ్‌ సోర్స్‌) వస్తుండాలి. వయస్సు 21 సంవత్సరాలకు తగ్గకూడదు. క్రెడిట్ స్కోర్ కూడా బాగుండాలి. 

ఏ పత్రాలు అవసరం?
లోన్‌ తీసుకునే వ్యక్తి, తన ఉపాధి, ఆదాయ మార్గాలకు సంబంధించిన డాక్యుమెంట్లను బ్యాంకర్‌కు సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. కస్టమర్‌ వ్యక్తిగత గుర్తింపు, చిరునామాకు సంబంధించిన ప్రూఫ్‌ డాక్యుమెంట్స్‌ కూడా సమర్పించాలి. ఆస్తి యాజమాన్యానికి సంబంధించిన రుజువు, రిపేర్‌ ఎస్టిమేషన్స్‌ను కూడా అందించాలి.

పన్ను మినహాయింపు
హోమ్‌ రెనోవేషన్‌ లోన్‌ తీసుకుంటే, ఇన్‌కమ్‌ టాక్స్‌ సెక్షన్ 24B కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 30,000 వరకు వడ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *